Pawan Kalyan: తమిళ దర్శకులతో పవన్ కళ్యాణ్ - హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ ఉన్నాయి బ్రో!
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ తమిళ దర్శకులతో పవర్ స్టార్ నటించిన సినిమాలు, ఎన్ని హిట్లు ప్లాపులు ఉన్నాయో తెలుసుకుందాం.
టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అగ్ర హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు పవర్ స్టార్. అందుకే ప్రతి ఒక్క దర్శకుడూ అవకాశం వస్తే, ఆయనతో ఒక్కసారైనా పని చేయాలని కోరుకుంటారు. అయితే తెలుగులో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ.. పవన్ అప్పుడప్పుడు కొందరు తమిళ దర్శకులకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ మొదలైన తర్వాత, అందరూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తో జట్టు కడుతున్నారు కానీ.. పవన్ కళ్యాణ్ అప్పట్లోనే వారితో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేశారు. ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు కోలీవుడ్ డైరెక్టర్స్ తో 7 చిత్రాల్లో నటించారు. కాకపోతే వాటిల్లో హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువ ఉండటం గమనార్హం.
'తొలి ప్రేమ' హిట్టు.. 'బాలు' ఫట్టు
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన నాలుగో సినిమా 'తొలి ప్రేమ'. 1998లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాదు, పవన్ కెరీర్ లో క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ మూవీతో ఎ. కరుణాకర్ వంటి తమిళ వ్యక్తిని డైరెక్టర్ గా పరిచయం చేశారు. దర్శకుడిగా అరంగేట్రం చేయడానికి ముందు అతను భాగ్యరాజ్, శంకర్ వంటి డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. అయితే కరుణాకరన్ ఇప్పటి వరకూ అన్నీ తెలుగు సినిమాలే చేశారు. ఇందులో భాగంగా పవన్ తో రూపొందించిన రెండో చిత్రం 'బాలు - ABCDEFG'. 2005 లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.
'ఖుషి' అలా.. 'పులి' ఇలా
2001లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఖుషి'. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.జె. సూర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో 'కొమురం పులి' సినిమా వచ్చింది. భారీ అంచనాలతో 2010లో రిలీజైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలింది. పవన్ కు 'ఖుషి' వంటి మెమరబుల్ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు.. ఈసారి మాత్రం భారీ డిజాస్టర్ ను రుచి చూపించాడు.
నిరాశపరిచిన 'బంగారం'.. బోల్తాకొట్టిన 'పంజా'
పవన్ కళ్యాణ్ నుంచి 2006 లో వచ్చిన సినిమా 'బంగారం'. దీంతో తమిళ దర్శకుడు ధరణి తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అందరినీ తీవ్ర నిరాశ పరిచింది. ధరణి ఆ తర్వాత రామ్ చరణ్ తో 'మెరుపు' చిత్రం మొదలు పెట్టారు కానీ, అది ఆదిలోనే ఆగిపోయింది. ఇక మరో తమిళ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ 'పంజా' అనే సినిమా చేశారు పవర్ స్టార్. ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ యాక్షన్ మూవీ ప్లాప్ అయింది. దీంతో పవన్ ను స్టైలిష్ గా ప్రెజెంట్ చేశాడనే పేరు తెచ్చుకున్న 'బిల్లా' డైరెక్టర్.. 'బాలు' సినిమానే మళ్ళీ చూపించాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు.
మిశ్రమ స్పందన తెచ్చుకున్న 'బ్రో'
దశాబ్ద కాలం తర్వాత తమిళ దర్శకుడితో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా 'బ్రో'. సముద్రఖని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'వినోదయ సిత్తం' చిత్రానికి అధికారిక రీమేక్ ఇది. తెలుగులోనూ సముద్ర ఖనే దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ సెట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - మాటలు సమకూర్చే బాధ్యత తీసుకున్నారు. గత శుక్రవారం (జులై 28) థియేటర్లలోకి వచ్చిన ఈ ఫాంటసీ కామెడీ డ్రామాకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీనికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లో 92 కోట్ల గ్రాస్ తో 56 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని ప్రకారం ఇప్పటి వరకు 56% మాత్రమే రికవరీ అయింది. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవాలంటే ఇంకా 42 కోట్ల మేర కలెక్ట్ చేయాల్సి ఉంది. వీక్ డేస్ లో వచ్చే వసూళ్లను బట్టే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మరి రానున్న రోజుల్లో 'బ్రో' ఆక్యుపెన్సీ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: హిట్టు కొట్టాలంటే గన్ను పట్టాల్సిందే - ఈ గన్స్ లేకపోతే ఏమైపోయేవారో!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial