Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Paruchuri Gopala Krishna : 'హనుమాన్'.. బ్లాక్ బస్టర్ హిట్ . ఈ మధ్యే ఓటీటీలోకి కూడా వచ్చేసింది ఈ సినిమా. ఇక ఈ సినిమాపై పరుచూరి గోపాల కృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే?
Paruchuri Gopala Krishna about HanuMan Movie: 'హనుమాన్'.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంపర్ హిట్ కొట్టింది ఈ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి బరిలో నిలిచి.. సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడిచిన ఈ సినిమా.. ఇప్పుడిక ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. నెం.1 స్థానంలో నిలిచింది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్ వండర్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే?
ఊపిరి ఆడకుండా చేశాడు
"సినిమా మొదట్లో బాబా, శివుడిని చూపించారు. సినిమా మాత్రం ఆంజనేయ స్వామి గురించి. అక్కడ శ్రీరాముడిని లేదా విష్ణుమూర్తిని చూపించాలి. కానీ, శివున్ని ఎందుకు చూపించారో అర్థంకాలేదు. ఇక సినిమా విషయానికొస్తే.. ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఆఫ్ ఊపిరి ఆడకుండా చేశాడు. విలన్‌కు సంబంధించి ఒక పిల్లాడిని చూపించడం, అతను పవర్స్ కోసం ప్రయత్నించడం, తల్లిదండ్రులు మరణించడం చూపించాడు. కట్ చేస్తే.. ఒక అక్క, తమ్ముడు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి హీరోను పట్టించుకోకపోవడం. ఒక కమెడియన్ తన కోసం ఏదో చేశాడని నమ్మటం అలా కామెడీ కూడా చూపించాడు. ఇక్కడ గొప్పతనం అదే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఊపిరి ఆడకుండా ఫస్ట్ ఆఫ్ నడిపాడు. హనుమంతుడు దైవ భక్తుడు. అలా దైవ భక్తుడి అంశ పొందినప్పుడు జరిగే అద్భుతం ఇక్కడ చూపించాడు. పాతాళ భైరవి ఇన్ స్పిరేషన్ తో ఈ సినిమా తీసినట్లు అనిపించింది. హనుమంతుడి కథ అయినప్పటికీ.. ఆ సినిమాలో రాజకుమారి కోసం, ఇక్కడ కూడా హీరోయిన్ కోసం హీరో చేస్తుంటాడు. రేళంగి గారి పాత్రని కమెడియన్ పాత్రగా పెట్టినట్లు అనిపించింది" అన్నారు.
జాగ్రత్త పడ్డారు
"హీరోయిజం విషయానికి వస్తే.. ఇంత చిన్న పిల్లాడు డమ డమా అందరినీ కొట్టేశాడు అంటే.. తేడా వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి ఆలోచన రాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే, అక్కడ దైవాంశాన్ని జోడించారు. వర్మగారు ఈ సినిమాని తేజ సజ్జ లాంటి పిల్లాడితో చేసేందుకు భయపడలేదు అనిపించింది. ఎందుకంటే.. ఆయన స్క్రీన్ ప్లే మీద ఆయనకు నమ్మకం ఉంది. ఓపెనింగ్ లో హీరోని చిలిపి కుర్రాడిలా చూపించారు. ఓపెనింగ్ లో ఫైట్ పెట్టాడు. కొట్టేస్తాడేమో అనే డౌట్ వచ్చేసింది నాకు.. కానీ, అక్కడే డైరెక్టర్ తెలివిగా వ్యవహరించాడు. స్క్రీన్ ప్లే స్కిల్స్ ని చూపించాడు. ఇక కొండను ఎత్తే సీన్ చూస్తుంటే ఒళ్లు గగ్గురుపొడిచింది నాకు. ఒక చిన్న హీరోను తీసుకున్నాను. కొండంత బలం అతని దగ్గర పెడుతున్నాను. చిన్న కొండను అలా లేపేసి చూపిస్తుంటే జనం ఏమైపోవాలి? అనుకున్న డైరెక్టర్.. సీన్ వచ్చేసరికి మ్యాన్ పవర్ తో పాటు గాడ్ పవర్ కూడా ఉంది అని థియేటర్ లో ఉన్న ప్రతి ఆడియెన్ కి తెలిసేలా చేశాడు".
"నిజానికి ఇండియన్స్ మైథాలజీని ప్రేమిస్తాం, విశ్వసిస్తాం. ధర్మరాజు, రాముడు, సీత, లక్ష్మణుడు లాంటి పవిత్రమైన పాత్రలన్నీ మన హృదయాల్లో ఉంటాయి. మన రక్తంలోకి వెళ్లిపోయాయి. ఆ విశ్వాసంతోనే వర్మ సినిమా తీశాడు. ఇక ఆయన్ను నమ్మిన నిర్మాతల ధైర్యానికి హ్యాట్సాఫ్. ఇది సాంఘీకమైన కథ. ఫాంటసీ తక్కువ ఉంది. జేబులో ఒక రాయి పెట్టడం, ఆ రాయిని పోగొట్టుకోవడం, హీరో ప్లేస్ లో వేరొకరు వచ్చి ఫైట్ చేయడం.. ఇవన్నీ హీరోకి స్పిరిచ్యుయల్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పడమే. హిందూ ధర్మాలను నమ్మే వాళ్లకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది’’ అని పరుచూరి తెలిపారు.
క్రెడిట్ మొత్తం వర్మకే..
"ఈ సినిమా క్రెడిట్ మొత్తం ప్రశాంత్ వర్మదే. ఒక డైరెక్టర్ హిట్ సినిమా తీస్తాడు. అదే డైరెక్టర్ సినిమా ఆడదు. సినిమా అనేది పదబంధం. ఏ దృశ్యం తర్వాత ఏది రావాలి? ఏ పాత్రను ఎలా వాడాలి అనేది తెలియాలి. ప్రశాంత్ వర్మ దాన్ని క్యాచ్ చేశాడు. నీళ్లలో పడిపోవడం అనేది భయంకరమైన సీన్. నిజానికి అంత చిన్నపిల్లాడు తేజ సజ్జ. నీళ్లలో పడిపోతే చనిపోతాడు. కానీ, ఎవరో కాపాడినట్లు ఇంటికి తెచ్చినట్లు భలే చక్కగా నడిపించాడు డైరెక్టర్. ఇక అక్క తమ్ముళ్ల అనుబంధం కూడా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో. అక్క పాత్రకు ఇచ్చిన ఫినిషింగ్ ఊహించలేదు. సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరగాలి, కసి పెరగాలి అది ఉంది ఈ సినిమాలో. జేబులో బొమ్మ కనిపించకుండా పోతే.. తన మెడలో ఉన్న గొలుసును హీరోయిన్ కట్టడం చాలా బాగుంది. అంటే అక్కడ ధైర్యాన్ని, విశ్వాసాన్ని కల్పించడం. చిన్న హీరో తేజతో నేను సినిమా చేస్తున్నాను. అనుక్షణం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించాడని, ఆ సీన్ ద్వారా అర్థం అయ్యింది".
చివరి 30 నిమిషాలు అరెస్టింగ్
"ఇక క్లైమాక్స్ విషయానికొస్తే.. చివరి 30 నిమిషాలు అరెస్టింగ్ గా అనిపించింది. ఇతనికి ఏమైపోతుందో అనే భయాన్ని ఎలా కలిగించాడో.. అతను గెలుస్తున్నప్పుడు ఆనందాన్ని ఇచ్చాడు. ఫినిషింగ్ అన్ని సినిమాల్లో లాగా ఒకేలా చేయకుండా.. అక్కడ రాముడిని, హనుమంతుడిని కూర్చోబెట్టి మాయ చేశాడు. సెకండ్ పార్ట్ చేస్తున్నాడని అనుకుంటున్నాను. అప్పుడే హీరోయిన్ తో సంబంధం పెడతాడు అనే అనుమానం వచ్చింది. నేను అలా ఊహించాను. ఈ కథ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇక గ్రామాన్ని దోచుకోవడం అనే చిన్న పాయింట్ ని చూపించారు. విలన్ తో వచ్చిన కమెడియన్ వీళ్లకి హెల్ప్ చేయడం. అది ఉడత భక్తి. రాములవారికి ఉడత కూడా సాయం చేసినట్లు ఆ కమెడియన్ పాత్ర ద్వారా చూపించారు."
"సెకెండ్ ఆఫ్ లో 20 నిమిషాలు దాటిన తర్వాత కొంత ట్రిమ్ కూడా చేసినట్లు ఉండుంటే.. బాగుండు అనిపించింది. యూత్ కోసం కొంచెం రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు అనిపించింది. పాటలు చాలా బాగా ఉన్నాయి. ఈ జనరేషన్ కి దూరంగా వెళ్లి, ఈ జనరేషన్ మొత్తానికి ఒక అద్భుతమైన సినిమాని తీసిన నిర్మాతలకి, దర్శకుడు వర్మకి, సాంకేతిక నిపుణులు అందరికీ ధన్యవాదాలు. ఇంత చిన్న సినిమాని ఆదరించి, హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లిన ప్రేక్షక మహాశయులకు ప్రత్యేకంగా ధన్యవాదలు చెప్తున్నాను."