Happy Birthday NTR: నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ హిట్లు, ఎన్నో ఆటు పోట్లు - ఎన్టీఆర్ సినీ జర్నీ సాగిందిలా!
నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈరోజు తారక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ జర్నీలోని ఆసక్తికరమైన విషయాలేంటో చూద్దాం
దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు మనవడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తాత పోలికలు పునికి పుచ్చుకోవడమే కాదు.. నటనలో డైలాగ్ డెలివరీలో స్క్రీన్ ప్రెజెన్స్ లో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. డ్యాన్స్ లలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. 'యంగ్ టైగర్' గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తారక్.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరిగా రాణిస్తున్నాడు. అయితే ఇదంతా ఆయనకు ఓవర్ నైట్ లో వచ్చిందేమీ కాదు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ, ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు.
ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్ని విజయాలు ఉన్నాయో, అంతకన్నా పరాజయాలు ఉన్నాయి. నూనూగు మీసాల వయసులోనే బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు అందుకున్నాడు.. అంతకుమించి ప్లాపులు, డిజాస్టర్లు చవిచూసాడు. అయితే ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా తట్టుకొని, చిత్ర పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోగలిగాడు. RRR సినిమాతో 'గ్లోబల్ స్టార్' గా అవతరించిన నందమూరి వారసుడు, నేడు (మే 20) తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం!
సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తరువాత గుణశేఖర్ తెరకెక్కించిన ‘రామాయణం’ చిత్రంలో బాల రాముడిగా ఆకట్టుకున్నాడు. 2001 లో 'నిన్ను చూడాలని' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు తారక్. వి.ఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామోజీ రావు నిర్మించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయితే ఎస్.ఎస్. రాజమౌళి డెబ్యూ మూవీ 'స్టూడెంట్ నెం.1'తో నందమూరి యువ హీరో తొలి హిట్టు రుచి చూసాడు.
ఇదే క్రమంలో ఎన్టీఆర్ నటించిన 'సుబ్బు' సినిమా ఫ్లాప్ అవ్వగా.. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆది' చిత్రం సంచలన విజయం సాధించింది. దీని తర్వాత వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ ‘నాగ’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే రాజమౌళితో కలిసి చేసిన రెండో సినిమా ‘సింహాద్రి’ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచి, తారక్ స్టామినా ఏంటో చూపించింది. కానీ వెంటనే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆంధ్రావాలా’ చిత్రం డిజాస్టర్ గా మారింది. దీంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి చాలా సమయమే పట్టింది.
‘సాంబ’ ‘నా అల్లుడు’ ‘నరసింహుడు’ ‘అశోక్’ ‘రాఖీ’ వంటి సినిమాలు ఆశించిన విజయాలు అందుకోకపోవడంతో రేసులో వెనుకబడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో జక్కన్న సలహాతో సన్నగా మారి ‘యమదొంగ’ మూవీతో హిట్టు కొట్టాడు. కానీ వెంటనే ‘కంత్రి’ వంటి ప్లాప్ సినిమా ఇచ్చాడు. దీని తర్వాత వచ్చిన ‘అదుర్స్’ సినిమా ఎన్టీఆర్ లోని కామెడీ యాంగిల్ ని పరిచయం చేసింది. ‘బృందావనం’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది.
అయితే మెహర్ రమేష్ దర్శకత్వంలో తారక్ నటించిన ‘శక్తి’ సినిమా అతని కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. సురేందర్ రెడ్డితో చేసిన ‘ఊసరవెల్లి’.. బోయపాటి శ్రీనుతో తీసిన ‘దమ్ము’ చిత్రాలు కూడా పరాజయాల బాటలో పయనించాయి. ఈ క్రమంలో శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ‘బాద్ షా’ చిత్రం పర్వాలేదనిపించగా.. ‘రామయ్యా వస్తావయ్యా’ ‘రభస’ సినిమాలు ఎన్టీఆర్ ను బాగా నిరాశ పరిచాయి. అలాంటి టైంలో పూరీ జగన్నాథ్ తో చేసిన 'టెంపర్' చిత్రం అతని కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. అప్పటి నుంచే కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, వరుస హిట్లు కొడుతున్నాడు యంగ్ టైగర్.
‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా డిఫెరెంట్ హెయిర్ స్టైల్ తో స్టైలిష్ గా కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్. ‘జై లవకుశ’ చిత్రంతో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసారు. ఆ తర్వాత వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి నటించిన RRR మూవీ, తారక్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది.. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లింది.
Also Read : ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?
‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. కొమురం భీమ్ గా ఆయన అద్భుతమైన నటనకు, నాటు నాటు స్టెప్పులకు వెస్టర్న్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. 'నాటు నాటు' కు అకాడెమీ అవార్డు వచ్చిన తర్వాత తారక్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరింది. పలువురు హాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ఆయనతో సినిమా చేయాలనే ఆసక్తిని కనబరిచారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తెచ్చిపెట్టిన గ్లోబల్ ఇమేజ్ ని కాపాడుకునేలా ఎన్టీఆర్ అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే పవర్ ఫుల్ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. దీని తర్వాత 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ భారీ యాక్షన్ మూవీ చేయనున్నాడు. ఇదే క్రమంలో 'వార్ 2' మూవీతో నేరుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు తారక్. ఈ స్పై యూనివర్స్ లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకొని ఎన్నో మైలురాళ్ళు అధిగమించాలని కోరుకుంటూ 'ABP దేశం' అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. Happy Birthday NTR..!
Read Also: 'నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్, యంగ్ టైగర్ కూడా నాకు దేవరే'.. బండ్ల ట్వీట్ వైరల్!