Nani: నాని మిస్ ఫైర్, కన్నడ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన నేచురల్ స్టార్!
నాని చేసిన వ్యాఖ్యలపై కన్నడీగులు గుర్రుగా ఉన్నారు. దీంతో నాని వారికి క్షమాపణలు చెప్పాల్సింది. అయితే, తమకు క్షమాపణలు వద్దని, ‘అంటే సుందరానికి..’ సినిమాను కన్నడలో డబ్ చేయాలని కోరుతున్నారు. ఇంతకీ ఏమైంది?
Ante Sundaraniki in Kannada | నేచురల్ స్టార్ నాని(Nani), మలయాళ నటి నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికి..’ (Ante Sundaraniki) విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 10 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా బుధవారం మూవీ టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్, మలయాళం భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అయితే, కన్నడలో మాత్రం రిలీజ్ చేయడం లేదు. దీనిపై నాని చేసిన వ్యాఖ్యలు కన్నడిగులను బాగా హర్ట్ చేశాయి. దీంతో నాని క్షమాపణలు చెప్పక తప్పలేదు.
ఇప్పటికే ‘RRR’, ‘పుష్ప’ వంటి పాన్ ఇండియా చిత్రాలు కన్నడ సినీ ప్రేమికులను నిరుత్సాహానికి గురిచేశాయి. తమ రాష్ట్రంలో కన్నడంలో కంటే తెలుగు వెర్షన్‌లోనే ఈ చిత్రాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడంపై ఇదివరకే అక్కడి మీడియా తెలుగు నిర్మాతలను దుమ్మెత్తి పోసింది. అయితే, నాని ‘అంటే సుందరానికీ..’ సినిమాను కన్నడ భాషలో డబ్బింగ్ చేయకుండా నేరుగా తెలుగులోనే విడుదల చేయాలని నిర్ణయించారు. దీనిపై నాని ఇచ్చిన వివరణ.. కన్నడ ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది.
Also Read: సమంత ఎక్కడ? ఈ ఫొటోతో ఫన్నీగా స్పందించిన విజయ్ దేవరకొండ, ఇందులో ఒరిజినల్ ఏదీ?
‘అంటే సుందరానికి..’ (Ante Sundaraniki Teaser) సినిమాను టీజర్ రిలీజ్ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ.. ‘‘అంటే సుందరానికి.. సినిమాను కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే చూస్తారు. అందుకే, ఆ భాషలో మూవీని అనువాదించలేదు. మా సొంత వాయిస్‌తో ఉన్న ఒరిజనల్ సినిమాను చూపించడమే మా నటీనటులకు ఇష్టం. కానీ, భాషాపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. అందువల్ల ప్రతి సినిమాను ఇతర భాషల్లోకి అనువాదిస్తున్నాం. కానీ, కన్నడ భాషలో మాకు ఆ సమస్యలు లేవు. ఎందుకంటే వారికి తెలుగు భాష అర్థమవుతుంది. తెలుగు సినిమాలను చాలా చూస్తారు. అందుకే, ఈ చిత్రాన్ని కన్నడలో విడుదల చేయడం లేదు’’ అని తెలిపాడు. అయితే, నాని అలా ఎలా అనుకుంటారని కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కురిపించారు. తమకు తెలుగు, తమిళ భాషలు అర్థం కావని పలువురు నానికి చెప్పారు. కన్నడ, తెలుగు లిపిలు ఒకేలా ఉన్నా మాటలు మాత్రం అర్థం కావని, ఆ విషయాన్ని నాని తెలుసుకోవాలని మరికొందరు అన్నారు.
ఈ నేపథ్యంలో నాని కన్నడ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పక తప్పలేదు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ ట్విట్టర్‌లో తెలిపాడు. ‘‘డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేనప్పుడు కూడా కన్నడ ప్రేక్షకులు నా సినిమాలు లేదా ఇతర తెలుగు చిత్రాలను ఆధరించారు. ఆ కృతజ్ఞతతో ఒక నిర్దిష్ట సందర్భంలో మాత్రమే ఆ వ్యాఖ్యలను చేశాను. దానికి సోషల్ మీడియాలో వేరే అర్థం తీసింది. ఆ విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోతే నన్ను క్షమించండి. కన్నడ సినిమా సరిహద్దులు దాటి విజయం సాధించినందుకు గర్వపడుతున్నాను’’ అని నాని తెలిపాడు. అయితే, కన్నడ ప్రేక్షకుల కోరిక మేరకు ‘అంటే, సుందరానికి..’ సినిమాను ఆ భాషలో అనువాదిస్తారో లేదో చూడాలి.
Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?