Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Manchu Manoj News | తన రెండో కుమారుడు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీకి మోహన్ బాబు లేఖ రాశారు.
Mohan babu complaint against his son Manoj Manchu and Monika Manchu | హైదరాబాద్: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని మొదట నటుడు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆపై మోహన్ బాబు సైతం తన ప్రాణలకు ముప్పు ఉందని, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుని, రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులతో మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాల అంశం మరో మలుపు తీసుకుంది. ఆస్తి విషయంలో మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో మనోజ్ పై దాడి జరగడంతో గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. ఇది దుష్ప్రచారమని మంచు ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ అనూహ్యంగా సాయంత్రానికి మంచు మనోజ్ గాయాలతో ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకున్నాడు. సొంతంగా నడవలేని స్థితిలో, మరొకరి సాయంతో మంచు మనోజ్ నడుస్తూ కనిపించడం, చివరకు మెడకు పట్టితో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.
మనోజ్ నుంచి ప్రాణాలకు ముప్పు - మోహన్ బాబు ఫిర్యాదు
తన కుమారుడు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపికి మోహన్ బాబు లేఖ రాశారు.
మోహన్ బాబు ఫిర్యాదు లేఖలో ఏముందంటే..
‘Sy.No.194, మంచు టౌన్, జల్పల్లి, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ 500005 నివాసి అయిన మంచు మోహన్ బాబు అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం కింది వాస్తవాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
పైన తెలిపిన అడ్రస్‌లో గత 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను. 08.12.2024న, నా చిన్న కుమారుడు మనోజ్ (నాలుగు నెలల క్రితం నా ఇంటిని విడిచిపెట్టి తిరిగి వచ్చాడు) అతని ద్వారా ఉద్యోగంలో చేరిన కొందరు నా ఇంటి వద్ద కలకలం సృష్టించారు. తరువాత మనోజ్, తన భార్య మోనికాతో కలిసి ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన 7 నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి, నానీ సంరక్షణలో ఉంచారు. నా కొడుకు మనోజ్ రాత్రి 9 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడనీ, ఆ సమయంలో నేను నిద్రపోతున్నాను.
మరుసటి రోజు ఉదయం నేను నా పనుల్లో బిజీగా ఉండగా నా ఇంటి దగ్గర కొందరు తెలియని వ్యక్తులను చూశాను. మాదాపూర్‌లోని నా ఆఫీసులో ఉదయం 10:30 గంటలకు నా ఉద్యోగి ఒకరు, నా కుమారుడు మనోజ్‌కు సహచరులమని చెప్పుకుంటూ దాదాపు 30 మంది వ్యక్తులు నా ఇంట్లోకి చొరబడ్డారు. వారు నా సిబ్బందిని వాళ్లు బెదిరించారు. వారి అనుమతి లేకుండా ఎవరూ ఇంట్లోకి ప్రవేశించరని సైతం అనౌన్స్ చేశారు.
నా కుమారుడు మనోజ్, కోడలు మోనిక సూచనల మేరకు నా ఇంటిని వారి ఆధీనంలోకి తీసుకుని నా ఉద్యోగులను బెదిరించారు. నాకు రక్షణ లేదని ఆందోళన చెందుతున్నాను. నేను ఇళ్లు విడిచి వెళ్లాలని బలవంతం చేస్తూ నాకు హాని కలిగించే చర్యలకు దిగారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులను తీసుకురావడంతో నాతో పాటు నా కుటుంబసభ్యులకు వారి నుంచి ప్రాణహాని ఉంది. కనుక ఈ వ్యవహారానికి మనోజ్ అతడి భార్య మోనిక కారణమని నేను నమ్ముతున్నాను. 78 ఏళ్ల సీనియర్ సిటిజన్‌ని అయిన నాపై కిరాయి గ్యాంగ్‌తో బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా ఆస్తితో పాటు ప్రాణాలకు సైతం ముప్పు ఉంది. కనుక మనోజ్, మోనిక, వారి మనుషులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. నా ఆస్తులపై వారికి హక్కులు లేవని ప్రకటించండి. నాకు రక్షణ కల్పించండి. నా ఇంటిని నాకు తిరిగి అప్పగించండి’ సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
తన ప్రాణాలకు ముప్పు ఉందని మంచు మనోజ్ సైతం ఫిర్యాదు
ఇంతకుముందే మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని, వారి నుంచి తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా వెళ్లి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.