Mithra Mandali: ‘కత్తందుకో జానకి’.. రెబల్ స్టార్ డైలాగ్‌తో సాంగ్, మిత్రోం ఆ మాత్రం ఉండాలిగా..!
Mithra Mandali Song: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఐకానిక్ డైలాగ్ ‘కత్తందుకో జానకి’ని తీసుకొని, ఈ తరం మెచ్చేలా ‘మిత్ర మండలి’లో అద్భుతమైన సాంగ్‌ని రెడీ చేశారు. తాజాగా అమలాపురంలో విడుదలైన ఈ పాట ఎలా ఉందంటే..

Mithra Mandali Song: రెబల్ స్టార్ కృష్ణంరాజు పేరు వినబడితే చాలు.. వెంటనే అందరికీ గుర్తొచ్చే డైలాగ్ ‘కత్తందుకో జానకి’. ఇప్పుడీ డైలాగ్‌తో పాట వస్తే ఎలా ఉంటుంది? అద్భుతం కదా! ఆయనని తలచుకున్నట్లు ఉంటుంది. పాట విన్నట్లు ఉంటుంది. బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో.. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. టీజర్ హిలేరియస్‌గా ఉండటంతో.. సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి.
తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘కత్తందుకో జానకి’ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను తాజాగా అమలాపురం కిమ్స్ కాలేజ్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రాండ్‌గా విడుదల చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఐకానిక్ డైలాగ్ ‘కత్తందుకో జానకి’ని తీసుకొని, ఈ తరం మెచ్చేలా సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ స్వరపరిచారు. అందరూ సరదాగా పాడుకునేలా కాసర్ల శ్యామ్ మరోసారి తన కలం బలం ప్రదర్శించారు. ఈ సరదా గీతాన్ని ఎంతో అందంగా, అర్థవంతంగా ఆయన రాశారనడంలో సందేహమే లేదు. అలాగే రాహుల్ సిప్లిగంజ్ తన గాత్రంతో ఈ పాటకు కావాల్సిన జోష్‌ని తీసుకొచ్చారు.
Also Read: 'పుష్ప' నిర్మాతలను టార్గెట్ చేసిన దేవి శ్రీ ప్రసాద్? 'కుబేర' సక్సెస్ మీట్‌లో సెటైర్ వాళ్ళ మీదేనా?
‘మిత్ర మండలి’ నుంచి విడుదలైన ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘కత్తందుకో జానకి’.. విడుదలైన కాసేపటికే టాప్‌లో ట్రెండ్‌లోకి వచ్చేసింది. ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రధాన పాత్రధారులు ప్రియదర్శి, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరాల ప్రపంచాన్ని ఈ పాట పరిచయం చేస్తుంది. తమ గురించి తాము ఉల్లాసంగా పాడుతూ.. నేటి యూత్ అలవాట్లయిన రీల్స్, రిలేషన్స్, పబ్జీ గేమింగ్ ఇలా ప్రతిదానిని ప్రస్తావిస్తూ ఈ పాట నడిచిన తీరు అందరికీ ఆహ్లాదాన్ని పంచుతోంది. ఓ వైపు యువత తమ అలవాట్లను చెప్పుకుంటుంటే, మరోవైపు తల్లిదండ్రులు వారిని తరుముతూ ‘కత్తందుకో జానకి’ అనడం మరింతగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
అమలాపురం కిమ్స్ కాలేజ్ లో జరిగిన ఈ సాంగ్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి హాజరయ్యారు. అలాగే కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు, ఎండీ రవివర్మ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇంకా చిత్ర సమర్పకులు బన్నీ వాస్, నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల.. నటీనటులు ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా.. దర్శకుడు విజయేందర్ ఎస్, సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. అతిథులందరూ ఈ పాట చాలా బాగుందంటూ.. ‘మిత్ర మండలి’ సినిమా ఘన విజయం సాధించాలని కోరుతూ.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. అతి త్వరలోనే థియేటర్లలోకి రానుందని మేకర్స్ తెలిపారు.
Also Read: బీచ్... బికినీ... ఫ్యామిలీ... సంతోషంగా కాజల్ బర్త్‌డే సెలబ్రేషన్స్... ఫోటోలు చూడండి





















