Vishal Song - Mark Antony : అదరదా, గుండె అదరదా మామా - విశాల్ పాడిన సాంగ్ విన్నారా?
'మార్క్ ఆంటోనీ' కోసం విశాల్ ఓ పాట పాడారు. ఆ పాటను మీరు విన్నారా? ఎలా ఉంది?
కథానాయకులు అప్పుడప్పుడు గొంతు సవరించుకుంటూ ఉంటారు. పవర్ ఫుల్ డైలాగులు చెప్పడం మాత్రమే కాదు, పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులో విశాల్ (Vishal) కూడా చేరారు. ఆయన ఓ పాట పాడారు.
'మార్క్ ఆంటోనీ'లో విశాల్ పాట
విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'మార్క్ ఆంటోనీ' (Mark Antony). ఇదొక సైన్స్ ఫిక్షన్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. టైమ్ ట్రావెల్ థీమ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సినిమా కోసమే విశాల్ పాడారు.
'అదరదా... గుండె అదరదా మామ
బెదరదా... బెంగ మొదలవదా
వణకవా... కాళ్ళు వణకవా మామ
వచ్చినది... అన్న ఆంటోనీ రా!
అన్న ఎంట్రీ ఇస్తే... తూటాల తుఫాను
ఎనిమీ ఎస్కేప్ అవడు... కామన్ సీను
ఎక్స్ట్రా గట్రా చేస్తే... ఎటాక్ మోడు ఆను
పరుగులు పెడతాడు పగవాడు'
అంటూ సాగిన ఈ గీతాన్ని రామ జోగయ్య శాస్త్రి రాశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇటీవల 'సార్' కోసం తమిళంలో ధనుష్ చేత జీవీ ఓ పాట పాడించారు. ఇప్పుడు విశాల్ చేత 'మార్క్ ఆంటోనీ' కోసం పాడించారు.
Also Read : తమన్ ఆ పాటను కాపీ కొట్టారా? 'జాణవులే'పై ఫ్యాన్స్ ట్రోల్స్
విశాల్ ఇంతకు ముందు 'మై డియర్ లవరు' అని ఓ పాట పాడారు. గాయకుడిగా ఆయనకు అది తొలి పాట. సుందర్ సి. దర్శకత్వం వహించిన 'మద గజ రాజా' కోసం ఆయన గాయకుడిగా మారారు. అయితే... ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. 'మార్క్ ఆంటోనీ' గాయకుడిగా విశాల్ తొలి సినిమా అవుతుంది.
Also Read : ఆలీకి పవన్ కళ్యాణ్ ఝలక్ - స్నేహానికి పూర్తిగా తెగతెంపులు?
విశాల్ జోడీగా హైదరాబాదీ అమ్మాయి!
'మార్క్ ఆంటోనీ'లో విశాల్ సరసన హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ (Ritu Varma) నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన 'కనులు కనులు దోచాయంటే', 'ఒకే ఒక జీవితం', 'ఆకాశం' సినిమాలతో రీతూ వర్మ విజయాలు అందుకున్నారు. హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేశారు. ఇప్పుడీ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
సైన్స్ ఫిక్షన్ అంశాలకు తోడు భారీ యాక్షన్ సన్నివేశాలు, వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది. 'మార్క్ ఆంటోనీ'లో ప్రముఖ నటుడు & దర్శకుడు ఎస్.జె. సూర్య, టాలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ వెర్సటైల్ యాక్టర్ సునీల్, మరో దర్శకుడు సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఎస్ వినోద్ కుమార్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, చిత్రీకరణ పనులు చివరి దశలో ఉన్నాయి.
ఈ సినిమాకు పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ యాక్షన్ సన్నివేశాలు సమకూర్చారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. విశాల్ ఇమేజ్, ఆయన స్టోరీ సెలక్షన్ మీద ప్రేక్షకులకు నమ్మకం ఉండటంతో మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనబడుతోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial