Yatra 2 Movie Trailer: నాశనం అయిపోతాడని తెలిసినా.. శత్రువుకు తలవంచడు, ఆకట్టుకుంటున్న ‘యాత్ర 2’ ట్రైలర్
Yatra 2 Movie Trailer: ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘యాత్ర 2’ విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
Yatra 2 Movie Trailer Out: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కించారు దర్శకుడు మహి వి రాఘవ్. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘యాత్ర 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైయస్సార్ మరణం తర్వాత ఆయన కుమారుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనేది 'యాత్ర 2'లో చూపించనున్నారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఇందులో ప్రస్తావించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో వైయస్సార్, జగన్ మోహన్ రెడ్డి పాత్రల్లో మమ్ముట్టి, జీవా నటించారు. ఈ చిత్రం కోసం వైయస్సార్, జగన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
జగన్ రాజకీయ ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించిన మహి
‘యాత్ర 2’ ట్రైలర్ లో దర్శకుడు మహి జగన్ రాజకీయ ప్రస్తావాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ట్రైలర్ ప్రారంభంలో రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ గురించి తీసుకునే నిర్ణయం గురించి చూపిస్తారు. ఆ తర్వాత ఆయన చనిపోతారు. ఆ సమయంలోనే జీవా జగన్ మోహన్ రెడ్డిగా ఎంట్రీ ఇస్తారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు యాత్ర మొదలు పెడతారు. ఈ యాత్రను ఆపాలని ఢిల్లీ పెద్దలు హెచ్చరిస్తారు. అయినా, వారిని పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకు కాంగ్రెస్ పెద్దలు ఎంతో ప్రయత్నిస్తారు.
కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడేలా ఈ ఓటమి ఉండాలని ప్లాన్ చేస్తారు. “జగన్ రెడ్డి కడప వాడు సర్.. శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలని అని నిర్ణయించుకున్నాక, వాడు నాశనం అయిపోతాడు అని తెలిసినా శత్రువుకు తలవంచడు” అంటూ శుభలేక సుధాకర్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. “ఎన్నికలు అయిపోయాక, జనాన్ని మోసం చేసి నా క్రెడిబులిటీని పోగొట్టుకోలేను. ఆ క్రెడిబులిటీ లేని రోజు మా నాయిన లేడు, నేను లేను” అంటూ జీవా చెప్పే మాటలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. “నేను విన్నాను, నేను ఉన్నాను” అంటూ జీవా చెప్పే మాటతో ట్రైలర్ ఎండ్ అవుతుంది. ఈ ట్రైలర్ లో జగన్ యాత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు మహి.
ఫిబ్రవరి 8న 'యాత్ర 2' విడుదల
త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక 'యాత్ర 2' చిత్రాన్ని నిర్మించారు. 'యాత్ర' విడుదలైన ఫిబ్రవరి 8న 'యాత్ర 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. వైఎస్ భారతిగా కేతికా నారాయణన్, సోనియాగా సుజానే పర్ఫెక్ట్ యాప్ట్ అని టీజర్ చూసిన తర్వాత జనాలు చెబుతున్నారు. జగన్ పాత్రలో జీవా సైతం ఒదిగిపోయారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీగా సుజానే బెర్నెర్ట్ నటించారు.