Guntur Kaaram Trailer: మాస్ మాస్ మాస్ - మొత్తం మహేష్ ఊర మాసే - ‘గుంటూరు కారం’ ట్రైలర్ చూశారా?
Guntur Kaaram Trailer Launch: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.
Guntur Kaaram: 2024 సంక్రాంతికి విడుదల అవుతున్న తెలుగు సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్‌కు ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ ఎలా ఉంది?
ఇక ట్రైలర్ విషయానికి వస్తే... త్రివిక్రమ్ మార్కు ఫన్ మూమెంట్స్‌తో పాటు మహేష్ బాబు మాస్‌ను కూడా పర్‌ఫెక్ట్‌గా చూపించారు. పండగకి అన్ని సెంటర్ల ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని ట్రైలర్‌తోనే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవలి కాలంలో మహేష్ బాబు ఇంత మాస్‌గా కనిపించలేదు. ఇదే సినిమాకు అతి పెద్ద ప్లస్‌పాయింట్‌గా ఉండనుంది.
నిజానికి ఈ సినిమా ట్రైలర్‌ను నేడు (జనవరి 7వ తేదీ) విడుదల చేస్తున్నట్లు జనవరి ఆరో తేదీనే ప్రకటించారు. కానీ టైమ్ మాత్రం ప్రకటించలేదు. ఈరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో ట్రైలర్‌ను రాత్రి 9:09 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అనౌన్స్ చేశారు.
ఒకవైపు ఓవర్సీస్ కంటెంట్, మరోవైపు ట్రైలర్‌కు సంబంధించిన వర్క్ ప్యారలల్‌గా జరుగుతుందని తెలిపారు. అందువల్ల ఆలస్యం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా అభిమానులను కోరారు. కానీ ఇప్పుడు అంతా సిద్ధం అయిందని, ట్రైలర్‌ను రాత్రి 9:09 గంటలకు విడుదల చేయడానికి అంతా రెడీ అయిందని తెలిపారు.
‘గుంటూరు కారం’లో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీలీల ‘అమ్ము’ అనే పాత్రలో, మీనాక్షి చౌదరి ‘రాజీ’ అనే పాత్రలో కనిపిస్తున్నారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్, సునీల్, మహేష్ ఆచంట, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు.
రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊహించలేనంత భారీ స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 104.1 కోట్ల బిజినెస్ అందుకోవడం విశేషం. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో రూ.9.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 21 కోట్ల బిజినెస్ జరగడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ‘గుంటూరు కారం’ బిజినెస్ రూ.134.6 కోట్లుగా ఉంది. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక బిజినెస్. ‘గుంటూరు కారం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాలంటే సుమారు రూ.135 కోట్లకు పైగా సాధించాలి.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో...
‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జనవరి 6వ తేదీన జరగాల్సి ఉంది. కానీ పోలీసు పర్మిషన్లు రాకపోవడం వల్ల ఈ ఈవెంట్‌ను గుంటూరులో నిర్వహించాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అనుమతులు రాగానే గుంటూరులో ఈ వేడుకను ఎక్కడ నిర్వహిస్తారో అధికారికంగా ప్రకటిస్తారు. జనవరి 9వ తేదీన ఈ కార్యక్రమం జరగనుందని సమాచారం. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ‘గుంటూరు కారం’ అయిపోయాక మహేష్ బాబు... దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఆ సినిమా విడుదల అవ్వడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ‘గుంటూరు కారం’ని మ్యాగ్జిమం సెలబ్రేట్ చేయాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.