Lokesh Kanagaraj: తమిళ స్టార్ డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం, ఇకపై ఆ విషయం చెప్పనని వెల్లడి!
Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను తీసే సినిమాల విషయంలో కొత్త నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ‘ఖైదీ,’విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించారు. తాజాగా విజయ్ దళపతి హీరోగా ‘లియో’ మూవీని రూపొందించారు. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా దుమ్మురేపింది. వాస్తవానికి ‘లియో’ మూవీ ఫస్ట్ ఆఫ్ బాగున్నా, సెకండ్ ఆఫ్ బాగా లేదనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ కామెంట్స్ పై ఆయన స్పందించారు. సినిమా ఎందుకు విమర్శలకు ఎదుర్కోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. ఇకపై అలా జరగదని వివరించారు.
ఇకపై రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనని చెప్పిన లోకేష్
ఇకపై తన సినిమాల విషయంలో ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించనని లోకేష్ వెల్లడించారు. అలా చేయడం వల్ల రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రెషర్ పెరుగుతుందని చెప్పారు. ఈ టెన్షన్ లో ఏకాగ్రత దెబ్బతింటుందన్నారు. అనుకున్న సన్నివేశాలను సరిగ్గా రూపొందించలేకపోతున్నట్లు ప్రకటించారు. ఇకపై అలాంటి తప్పు చేయనని వివరించారు. “’లియో’ రిలీజ్ తర్వాత చాలా మంది నుంచి నాకు ఓ విమర్శ వినిపించింది. ఈ సినిమా సెకెండ్ ఆఫ్ బాగాలేదన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందనే ఆత్రంలో చేసిన పొరపాటు కారణంగానే చాలా సన్నివేశాలు సరిగా రాలేదు. ఇకపై సినిమా రిలీజ్ డేట్ ముందుగా ప్రకటించను. అనవసరంగా టెన్షన్ పడి సినిమా క్వాలిటీని దెబ్బతీయలేను” అని చెప్పుకొచ్చారు.
2023లో అతిపెద్ద న్యూస్ మేకర్ గా ‘లియో’
‘మాస్టర్’ మూవీ తర్వాత లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్‌లో ‘లియో’ మూవీ తెరకెక్కింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఫీమేల్ లీడ్ చేసింది. అర్జున్, సంజయ్ దత్, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది ‘లియో’ మూవీ అతిపెద్ద న్యూస్ మేకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా, గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది సత్తా చాటింది. అటు మాదక ద్రవ్యాలను ప్రోత్సహించేలా ఈ సినిమాలోని పాట ఉందనే వివాదంతో పాటు హీరోయిన్ త్రిష గురించి నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అసభ్య వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.
సొంత నిర్మాణ సంస్థను ప్రకటించిన లోకేష్
ఇక తాజాగా లోకేష్ ‘జీ స్క్వాడ్’ అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తనతో పాటు తన మిత్రుల సినిమాలు ఈ సంస్థలో తెరకెక్కించాని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి తొలి సినిమాగా ‘ఫైట్ క్లబ్’ రూపొందింది. ఈ సినిమాలో విజయ్ కుమార్ హీరో గా నటించారు. ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.