Dhanush: ధనుష్ బాడీగార్డ్ ఓవరాక్షన్ - ముంబై బీచ్‌లో అభిమానుల పట్ల దురుసు ప్రవర్తన
Dhanush: 'కుబేర' షూటింగ్ కోసం హీరో ధనుష్ ఇటీవలే ముంబైలో వాలిపోయారు. అయితే అక్కడి బీచ్ లో అభిమానుల పట్ల ఆయన బాడీగార్డ్ అనుచితంగా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ అక్కినేని నాగార్జున పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ తాజాగా షెడ్యూల్ ఇటీవలే ముంబైలో ప్రారంభమైంది. అక్కడ జుహు బీచ్‌లో నాగ్, ధనుష్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే బీచ్ ఒడ్డున ధనుష్ ను వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్న అభిమానుల పట్ల ఆయన బాడీగార్డ్స్ కాస్త దురుసుగా ప్రవర్తించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
'కుబేర' షూటింగ్ కోసం హీరో ధనుష్ తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కలిసి జుహు బీచ్ వద్ద నడుచుకుంటూ వెళ్ళడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో అక్కడున్న అభిమానులు ధనుష్ వైపు దూసుకొస్తూ ఆయన్ను తమ మొబైల్ ఫోన్లలో బంధించే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన హీరో బాడీగార్డ్స్.. ఆ అభిమానులను దూరంగా నెట్టివేసారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితం నాగార్జున బాడీగార్డ్ ఇలానే ఓ పెద్దాయన పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన వీడియో వచ్చిన తర్వాత, ఇప్పుడు ధనుష్ సెక్యూరిటీ సిబ్బంది అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వీడియో రావడం నెట్టింట హాట్ టాపిక్ అయింది.
View this post on Instagram
ఇటీవల అక్కినేని నాగార్జున ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్నప్పుడు, ఓ వ్యక్తి ఆయన్ను కలవడానికి ప్రయత్నించారు. వెంటనే పక్కనున్న బౌన్సర్ ఒకరు ఆ వ్యక్తి రెక్క పట్టుకుని దూరంగా నెట్టేయడంతో కింద పడిపోయాడు. అది నాగ్ గమనించ కుండా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో ధనుష్ కూడా పక్కనే ఉన్నారు. అయితే ఈ వీడియో తన దృష్టికి రావడంతో, నాగార్జున సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ షేర్ చేసిన పోస్ట్ పై స్పందిస్తూ.. “ఇది నా దృష్టికి వచ్చింది… ఇలా జరగకకుండా ఉండాల్సింది. నేను ఆ పెద్ద మనిషికి క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను” అని నాగ్ పేర్కొన్నారు. ఇది జరిగిన మరుసటి రోజే ధనుష్ బాడీగార్డ్స్ అభిమానులను పక్కకి నెట్టేసిన వీడియో బయటకి వచ్చింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ట్రోలింగ్ చేస్తుంటే, మరికొందరు మాత్రం సెలబ్రెటీల సెక్యూరిటీ పట్ల అప్రమత్తంగా ఉండటం బౌన్సర్ల బాధ్యత అని కామెంట్లు చేస్తున్నారు.
ఏదేమైనా సినీ సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేసెస్ లో కనిపించినప్పుడు అభిమానులు మీద పడటం సహజంగానే జరుగుతుంది. వారిని కలిసి అభిమానం చాటుకోవాలని, కుదిరితే ఒక సెల్ఫీ తీసుకోవాలని ఫ్యాన్స్ ఆలోచిస్తారు కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయి. కొందరు హీరో హీరోయిన్లు వారి ఉత్సాహం చూసి ఎంతో సహనంతో దగ్గరకు పిలిచి మాట్లాడతారు. చిరునవ్వుతో సెల్ఫీ ఇస్తారు. కొన్నిసార్లు అభిమానులు అత్యుత్సాహం చూపించడంతో సెక్యూరిటీ సిబ్బంది చేతిలో భంగపాటు తప్పదు. ఇక్కడ నాగార్జున, ధనుష్ సంఘటనల్లో వారి బాడీగార్డ్స్ అభిమానుల విషయంలో కాస్త ఓవరాక్షన్ చూపించినట్లు కనిపిస్తుంది. స్టార్స్ కు రక్షణగా నిలవడంలో తప్పు లేదు కానీ, ఫ్యాన్స్ పట్ల దయతో వ్యవహరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తన కారణంగా అనవసరంగా సెలబ్రిటీలు అభాసుపాలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also Read: నా కొడుకు కోరుకునే లక్షణాలున్న అమ్మాయి దొరకడం కష్టం - సల్మాన్ ఖాన్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు