Ka Trailer : పగటిపూట 3 గంటలకే చీకటి పడే వింత ఊరు... క్యూరియాసిటీని పెంచేస్తోన్న 'క' ట్రైలర్
Tollywood News | కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా మూవీ 'క' ట్రైలర్ వచ్చేసింది. మరి ఆ ట్రైలర్ లోని విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
Kiran Abbavaram Ka movie Trailor | చిన్న గ్యాప్ తరువాత టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క' అనే మూవీతో పాన్ ఇండియా హీరోగా లక్ ను పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ట్రైలర్ ఎలా ఉంది? అందులోని విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
టాలీవుడ్ యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న భారీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'క'. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన తన్వి రామ్, నయన్ సారిక హీరోయిన్ గా నటించారు. శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. దర్శక ద్వయం సుజిత్, సందీప్ ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహించారు. 'క' మూవీ ఈనెల 31న దీపావళి కానుకగా తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళం వంటి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. అయితే అనేక అవాంతరాల తర్వాత ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు శుక్రవారం రోజు రిలీజ్ అయింది. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
ఈ ట్రైలర్ లో మొదట్లోనే చుట్టూ కొండల మధ్య ఉన్న అందమైన కృష్ణగిరి అనే ఊరుని చూపించారు. విచిత్రం ఏంటంటే ఈ ఊర్లో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది. ఇలాంటి ఊరికి కిరణ్ అబ్బవరం వాసుదేవ్ అనే పోస్ట్ మాన్ గా పని చేస్తాడు. ఈ క్రమంలోనే సత్యభామ అనే అందమైన అమ్మాయితో వాసుదేవ్ ప్రేమలో పడతాడని, ఆ ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది అనే సీన్స్ ను చూపించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. అంతేకాకుండా ఓ ముసుగు వ్యక్తి ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ వాసుదేవ్ ని బెదిరించడం ఆసక్తిని రేకెత్తించింది. మొత్తానికి ట్రైలర్ ద్వారా అసలు ఆ ఉత్తరంలో ఏముంది? ఆ ముసుగు వ్యక్తి ఎవరు? అతని గ్యాంగ్ హీరోని ఎందుకు వెంటాడుతోంది? అనే క్యూరియాసిటీని పెంచారు. ఇక చివర్లో 'నాది అనే ఊరికి నేను చేసే మంచి' అంటూ హీరో చెప్పే డైలాగ్ కొత్త డౌట్ లను రేకెత్తించింది. మొత్తానికి ట్రైలర్ ని చూస్తుంటే ఈ మూవీ గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందనే విషయం స్పష్టం అవుతుంది. అంతేకాకుండా హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు ట్రైలర్ లో సంగీతం, కిరణ్ అబ్బవరం యాక్టింగ్ హైలెట్ గా నిలిచాయి.
ఇదిలా ఉండగా కిరణ్ అబ్బవరం ఈసారి ఏకంగా దుల్కర్ సల్మాన్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో బాక్స్ ఆఫీసు ఫైట్ కి దిగబోతున్నాడు. 'లక్కీ భాస్కర్' సినిమాతో పాటు 'క' మూవీ కూడా అక్టోబర్ 31 నే రిలీజ్ కాబోతోంది. మరి ఈ రెండు సినిమాలలో బాక్స్ ఆఫీసు విన్నర్ గా నిలిచేది ఎవరో చూడాలి.