Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకు క్యాచీ టైటిల్... 'బేబీ' నిర్మాతలతో కలిసి
Kiran Abbavaram New Movie: 'బేబీ' నిర్మాతలతో కలిసి యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఒక సినిమా చేయబోతున్నారు. ఆ చిత్రానికి క్రేజీ టైటిల్ ఖరారు చేశారు.

Kiran Abbavaram teams up Baby producer SKN: కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా 'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూస్ చేసిన మాస్ మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతుంది. దీనికి అమృత ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామి. ఈ చిత్రానికి క్యాచీ టైటిల్ ఖరారు చేశారు.
చెన్నై లవ్ స్టోరీ... కిరణ్ అబ్బవరం సినిమా!
కిరణ్ అబ్బవరం హీరోగా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రానికి 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story) టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలో ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నారు.
'చెన్నై లవ్ స్టోరీ' అనౌన్స్‌మెంట్ కోసం విశాఖలో ప్రత్యేకంగా ఒక వీడియో షూట్ చేశారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తారు. గతంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' చిత్రానికి మెలోడీ బ్రహ్మ మ్యూజిక్ చేశారు మరోసారి కిరణ్ అబ్బవరం, మణిశర్మ కలయికలో సినిమా రానుంది.
కల్ట్ ఫిల్మ్ 'బేబీ' ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ నిర్మాణంలో...
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో యూత్ అందరితో పాటు పెద్దలను సైతం మెప్పించిన సినిమా 'బేబీ'. కల్ట్ స్టేటస్ వచ్చిన ఆ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకం మీద ఎస్కేఎన్ ప్రొడ్యూస్ చేశారు. హీరోలకు, దర్శకులకు అభిమానులు ఉండడం సహజం. ఆ తరహాలో నిర్మాతలకు ఫాలోయింగ్ అరుదుగా ఉంటుంది. ప్రేక్షకులలో అటువంటి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న యంగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. ఆయన నిర్మాణంలో సినిమా, అదీ లవ్ స్టోరీ అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుందని ఊహించవచ్చు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
'క' మూవీతో బాక్సాఫీస్ దగ్గర కిరణ్ అబ్బవరం భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన 'దిల్ రూబా' కొంత మంది ప్రేక్షకులను, కిరణ్ అబ్బవరం అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం 'కే ర్యాంప్' సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం... 'చెన్నై లవ్ స్టోరీ'ని త్వరలో సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.





















