Keerthy Suresh: అఫీషియల్‌గా ఆంటోనీతో మ్యారేజ్ కన్ఫర్మ్ చేసిన కీర్తి సురేష్... అతనితో 15 ఏళ్లుగా ప్రేమలో!
Keerthy Suresh Wedding: మహానటి కీర్తి సురేష్ తన పెళ్లి వార్తలను ధృవీకరించింది. సోషల్ మీడియాలో తనకు కాబోయే భర్త పేరు చెప్పింది. ఇంకా ఆవిడ ఏమన్నారంటే?
మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) మెడలో అతి త్వరలో మూడు ముడులు పడనున్నాయి. ఈ మలయాళీ భామ త్వరలో ఓ ఇంటి కోడలు కానున్నారు. ఈ విషయం తెలిసింది. అయితే... తన పెళ్లి కబురు కీర్తి సురేష్ స్వయంగా చెప్పారు.
ఆంటోనీతో 15 ఏళ్లుగా ప్రేమలో!
హీరోయిన్ కీర్తి సురేష్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తన స్కూల్ ఫ్రెండ్, చాలా ఏళ్లుగా పరిచయం ఉన్న ఆంటోనీ (Antony Thattil)తో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు ఆవిడ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''15 years and counting It has always been.. AntoNY x KEerthy ( Iykyk) '' అని ఆవిడ ఆంటోనీతో దిగిన ఫోటో షేర్ చేశారు. అయితే... అతని ఫేస్ చూపించలేదు. వెనుక నుంచి దిగిన ఫోటో షేర్ చేశారు. ఒకేసారి పెళ్లి ఫోటోలు షేర్ చేస్తారేమో!?
హీరోయిన్లు మాళవిక మోహనన్, ప్రియాంక అరుల్ మోహన్, రాశీ ఖన్నా, నజ్రియా నజీమ్, త్రిష తదితరులు కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. హీరో సందీప్ కిషన్, 'వెన్నెల' కిశోర్ సహా మరికొంత మంది ప్రముఖులు కూడా! అంతే కాదు... రాశీ ఖన్నా అయితే ''మాకు ఇప్పుడు తెలిసింది... కంగ్రాచ్యులేషన్స్'' అని కామెంట్ చేశారు.
కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఆంటోని ప్రస్తుతం దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. ఆయన ఓ వ్యాపారవేత్త. కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఆ విషయం బయటకు రాకుండా బాగా మేనేజ్ చేశారు.
Also Read: అమెరికా అమ్మాయితో సుబ్బరాజు పెళ్లైపోయిందోచ్... 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు
View this post on Instagram
పెళ్లి ఎప్పుడు? ఎక్కడ చేసుకోబోతున్నారు?
అతి త్వరలో కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. డిసెంబర్ 11న గోవాలో కుటుంబ సభ్యులు, కొంత మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ పెళ్లికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత మంది హీరోలు దర్శక నిర్మాతలు కూడా హాజరు అయ్యే అవకాశం ఉందని తెలిసింది.
కీర్తి పెళ్లి వార్తలు రావడం కొత్త ఏమీ కాదు!
కీర్తి సురేష్ పెళ్లి గురించి హడావిడి జరగడం కొత్త ఏమీ కాదు. కొన్ని సంవత్సరాలుగా ఆవిడ ఫలానా వ్యక్తితో ప్రేమలో ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ నుంచి మొదలు పెడితే మలయాళ చిత్ర సీమలో స్నేహితులతోనూ ఆమెకు ముడిపెట్టి వార్తలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో తన స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగా... కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారని ఓ న్యూస్ వైరల్ అయింది. అప్పుడు ఆ వార్తలను ఆవిడ ఖండించారు. ఇన్నాళ్లకు తన ప్రియుడి గురించి వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీలోకి వారసురాలిగా వచ్చినా...
మలయాళ సినిమా నిర్మాత జి సురేష్ కుమార్ సీనియర్ హీరోయిన్ మేనక దంపతుల రెండో కుమార్తె కీర్తి సురేష్. సినిమా ఇండస్ట్రీలోకి ఆమె బాలనటిగా అడుగుపెట్టారు. వారసురాలిగా వచ్చిన సరే... ఆ తర్వాత భాషలకు అతీతంగా తన నటనతో ప్రేక్షకులను అభిమానులుగా చేసుకున్నారు. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు బేబీ జోన్ సినిమాతో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.