పడవను మింగేసే శవాల కెరటం - ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తోన్న జీవీ ప్రకాష్, 'కింగ్ స్టన్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కమల్
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ హీరోగా 'కింగ్ స్టన్' అనే మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కమల్ హాసన్ ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.
కోలీవుడ్ యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఓవైపు సంగీత దర్శకుడిగా మరోవైపు హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులోనూ అగ్ర హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోస్ట్ చేస్తూ మరోవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా కోలీవుడ్‌లో 'అడియే' (Adiye) అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన జీవీ ప్రకాష్ తాజాగా తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. 'అడియే' తర్వాత జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్ స్టన్' (KingSton). కమల్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
విశ్వ నటుడు కమలహాసన్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టి చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 'ఇండియాస్ ఫస్ట్ సీ హారర్ అడ్వెంచర్' అంటే సముద్రం బ్యాక్ డ్రాప్ లో హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హారర్ ఎలిమెంట్స్ తో ఇప్పటివరకు మరే సినిమా రాలేదు. మొట్టమొదటిసారి జీవి ప్రకాష్ ఈ సినిమాతో సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. హీరోగా జీవి ప్రకాష్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.
తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'కింగ్ స్టన్' జీవి ప్రకాష్ కెరియర్ లో 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో జీవి ప్రకాష్ కి జోడిగా కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ జంటగా 'బ్యాచిలర్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది? సినిమాలో జీవి ప్రకాష్, దివ్యభారతి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. జి స్టూడియోస్ నిర్మాణ సంస్థతో కలిసి జీవి ప్రకాష్ హీరోగా నటిస్తూనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే 2013లో జీవి ప్రకాష్ కుమార్ నిర్మాతగా మారి 'మదయానై కూట్టం' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి కోటి రూపాయలు బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద రూ.15 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ గా, హీరో గానే కాకుండా ఈ చిత్రంతో నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు జీవి ప్రకాష్. అయినా కూడా ఆ తర్వాత ఇప్పటివరకు మరో చిత్రాన్ని నిర్మించలేదు. అలాంటిది దాదాపు 10 ఏళ్ల తర్వాత తాజాగా తాను హీరోగా నటిస్తున్న 'కింగ్ స్టన్' మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ కుమార్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస చిత్రాలకు పనిచేస్తున్నారు. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఆడియోస్ నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకున్నాయి. దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతోపాటు వైష్ణవ తేజ్ నటించిన 'ఆదికేశవ' చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు.
Also Read : కొంతమంది ఇష్టపడతారు, మరికొందరు తిడతారు - అందుకే అలాంటి పాత్రలు: అనసూయ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
View this post on Instagram