God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
జయం రవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఇరైవన్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'గాడ్' పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార, జయం రవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఇరైవన్'. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కి ఐ. అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో 'గాడ్' పేరుతో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
12 మంది యువతులని అతి కిరాతకంగా హత్య చేసిన బ్రహ్మ అనే సైకో కిల్లర్ గా బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రాహుల్ బోస్ ను పరిచయం చేయడంతో 'గాడ్' ట్రైలర్ ప్రారంభమైంది. కోర్టులు, లా అండ్ ఆర్డర్ పైన నమ్మకం లేని అర్జున్ అనే పోలీస్ అధికారిగా జయం రవి కనిపించారు. క్రిమినల్స్ మృగాళ్లుగా మారి తప్పు చేస్తున్నప్పుడు దేవుడే శిక్షిస్తాడులే అని వదిలేసేంత సహనం తనకు లేదని చెప్తున్న అతను.. క్రిమినల్స్ ని ఈ భూమ్మీద లేకుండా చేస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు.
స్మైలీ కిల్లర్ బ్రహ్మ హాస్పిటల్ నుంచి తప్పించుకోగా, అతన్ని పట్టుకోడానికి అర్జున్ తన టీంతో కలిసి రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో అతనికి ఈసారి ఎదురైంది మామూలు క్రిమినల్ కాదనే విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బ్రహ్మ సైకో కిల్లర్ గా ఎందుకు మారాడు? ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్న అర్జున్.. బ్రహ్మను అంతమొందించాడా లేదా? ఈ క్రమంలో అతను ఏమేమి కోల్పోయాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది తెలియాలంటే 'గాడ్' సినిమా చూడాల్సిందే.
Also Read: '480 ఫైల్స్ మిస్ అయ్యాయి.. అందుకే చంద్రముఖి-2 వాయిదా'
క్రైమ్, సస్పెన్స్ అండ్ వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన 'గాడ్' ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. వయలెన్స్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. క్రిమినల్స్ ని ఇన్స్టెంట్ గా శిక్షించే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా జయం రవి ఆకట్టుకున్నాడు. 'తని వరువన్' తర్వాత మరోసారి అతని ప్రేయసిగా నయనతార కనిపించింది. వారిని గతం తాలూకు కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతున్నట్లు అర్థమవుతోంది. ఇందులో నరైన్, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటించగా.. చార్లీ, అజగం పెరుమాళ్, భగవతి పెరుమాళ్, వినోద్ కిషన్, విజయలక్ష్మి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కి తగ్గట్టుగా ఉంది. విజువల్స్ కూడా బాగున్నాయి. దీనికి హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ నిర్వహించగా, మణికంధ బాలాజీ ఎడిటింగ్ వర్క్ చేసారు. చిరునవ్వుల చిరుజల్లు (ఎండ్రెండ్రుం పున్నాగై), మనితన్, వామనన్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఐ. అహ్మద్.. ఇప్పుడు వాటికి పూర్తి భిన్నమైన జోనర్ తో 'గాడ్' మూవీని తెరకెక్కించారని చెప్పాలి. ట్రైలర్ చూస్తుంటే గతంలో వచ్చిన కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్ గుర్తుకు వస్తాయి. కాకపోతే ఇందులో కొత్త ట్రీట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
'ఇరైవన్' చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికేట్ ఇవ్వడంపై ఇటీవల జయం రవి మాట్లాడుతూ.. ''ఈ సినిమాని పిల్లలతో కలిసి చూడొద్దు. ఇందులో కొన్ని సన్నివేశాలు చూసి చిన్న పిల్లలు భయపడే అవకాశం ఉంది. సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ లోనే చూపించాం. కొంతమంది ప్రేక్షకులు ఇలాంటి క్రైమ్ అండ్ సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడతారు. వాళ్లు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను'' అని అన్నారు. 'గాడ్' చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై సుధన్ సుందరం & జయరామ్ నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది.
Also Read: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial