(Source: ECI/ABP News/ABP Majha)
కార్తీ మంచి మనసు - సేవా కార్యక్రమాల కోసం కోటి 25 లక్షలు విరాళం!
తమిళ హీరో కార్తీ తన కెరీర్లో 25వ చిత్రం గా వస్తున్న 'జపాన్' మూవీ మరింత స్పెషల్ అవ్వాలని సేవా కార్యక్రమాల కోసం కోటి 25 లక్షలు విరాళం అందించారు.
కోలీవుడ్ హీరో కార్తీ మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. తన అన్న సూర్య లాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే కార్తి స్వయంగా సేవా కార్యక్రమాలు చేసేందుకు ఓ ఫౌండేషన్ కూడా రన్ చేస్తున్నాడు. ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సాయం అందించాడు. ఇక తాజాగా తన కెరియర్లో 25వ చిత్రం గా వస్తున్న 'జపాన్'(Japan) మూవీ తనకు మరింత స్పెషల్ అవ్వాలని కోటి రూపాయలకు పైగా విరాళం ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. ప్రస్తుతం కోలీవుడ్ లో మంచి సక్సెస్ రేట్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు కార్తి. కేవలం తమిళంలోనే కాదు.. తెలుగులోనూ కార్తీకి మంచి సక్సెస్ రేట్ ఉంది.
రీసెంట్ గా 'పోనియన్ సెల్వన్' సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న కార్తీ ప్రస్తుతం 'జపాన్' అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ కార్తీక్ కెరీర్ కి చాలా స్పెషల్. ఎందుకంటే కార్తీ నటిస్తున్న 25వ చిత్రం ఇది. దీపావళి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 'జపాన్' ను మరింత స్పెషల్ చేసేందుకు కార్తీ ఏకంగా కోటి 25 లక్షలు సోషల్ ఆక్టివిటీస్ కోసం డొనేట్ చేశారు. సామాజిక కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, పేదవారికి ఆహారం అందించడం కోసం ఈ భారీ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
తన కెరీర్లో జపాన్ 25వ చిత్రం కావడంతో 25 మంది సామాజిక కార్యకర్తలకు ఒక్కొక్కరికి ఒక లక్ష, 25 పేద పాఠశాలలకు ఒక్కొక్కరికి ఒక లక్ష, 25 ఆస్పత్రులకు ఒక్కొక్కరికి ఒక లక్ష.. మిగిలిన మొత్తాన్ని 25 రోజులపాటు 25,000 మందికి ఆహారం అందించనున్నట్లు సమాచారం. వీటిలో ఇప్పటికే 25 వేల మందికి అన్నదానం చేయాలనే కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఇటీవలే ఉలవన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 వేల మందికి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక టీ.నగర్ లోని కార్తీ అభిమాన సంఘం కార్యాలయంలో దీన్ని ప్రారంభించారు. జపాన్ నిర్మాత ఎస్ ఆర్ ప్రభు, దర్శకుడు రాజు మురుగన్ విచ్చేసి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం మిగతా సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కార్తీ చేస్తున్న ఈ మంచి పని గురించి తెలుసుకున్న నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక 'జపాన్' విషయానికొస్తే.. రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా కార్తీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఇందులో కార్తీ ఓ దొంగగా కనిపించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 10న తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : 'ప్రేమమ్' డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం - ఆ సమస్యతో సినిమాలకు గుడ్ బై అంటూ సంచలన పోస్ట్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial