Oscars 2023: ఆస్కార్ అవార్డు విజేతలకు లభించే ప్రైజ్ మనీ ఎంత?
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ విజేతలకు ఇచ్చే ట్రోఫీ తో నగదు ఇవ్వరు. అయితే వారికి ఆస్కార్ గెలవడం వల్ల ఎన్నో అవకాశాలను తీసుకు వస్తుందనడంలో సందేహం లేదు
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. భారత కాలమాన ప్రకారం మార్చి 13, తెల్లవారుజామున ఈ అంతర్జాతీయ స్థాయి సినిమా పండుగ మొదలవ్వనున్న విషయం తెల్సిందే. ఈసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమాలోని ‘‘నాటు నాటు...’’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అవ్వడంతో భారత సినీ ప్రేమికుల దృష్టి ఈ మెగా ఈవెంట్ పై ఉంది. హాలీవుడ్ తారలతో పాటు మన బాలీవుడ్, టాలీవుడ్ తారలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే టీమ్ మొత్తం కూడా అమెరికాలో ఉన్నారు. ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుని రావాలని ఇండియన్ సినీ ప్రేమికులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న విజేతలకు ట్రోఫీతో పాటు నగదు ఏమైనా ఇస్తారా అనేది చాలా మంది ప్రశ్న.
‘ఆస్కార్’ అంటే ‘విలువ’ కట్టలేని పురస్కారం, అందుకే...
‘ఆస్కార్’ అవార్డు అంటే ప్రపంచవ్యాప్త గుర్తింపు. అంతకు మించి ‘విలువ’ గల పురస్కారం మరేది ఉండదు. అందుకే, ఈ అవార్డుల వేడుకలో ప్రత్యేక నగదు బహుమతి అంటూ ఏదీ ఉండదు. పైగా, వారిచ్చే ట్రోఫీకి కూడా ఎలాంటి విలువ ఉండదు. దాన్ని అమ్మేయాలని అనుకున్నా.. కేవలం ఒక డాలర్ మాత్రమే లభిస్తుంది.
ఆస్కార్ విజేతలకు ట్రోఫీ ఇచ్చిన సమయంలో నేరుగా నగదు లభించదు. కానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న తర్వాత వారి స్థాయి అమాంతం పెరిగి సినిమాల్లో మరింతగా బిజీ అవుతారు. వారు చేసిన.. తీసిన సినిమాలకు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆధరణ ఎక్కువగా ఉంటుంది. అలా పారితోషికం రూపంలో.. కలెక్షన్స్ రూపంలో ఆస్కార్ విజేతలకు భారీగా ఆదాయం దక్కే అవకాశాలున్నాయి. ఒక్కసారి ఆస్కార్ విజేతగా నిలిస్తే కెరీర్ మొత్తం వారు చేసే సినిమాలకు మంచి ప్రాముఖ్యత ఏర్పడుతుంది. తద్వారా పారితోషికం రూపంలోనే కాకుండా ఎక్కువ ప్రాజెక్టులు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలా ఈ అవార్డు దక్కించుకున్న వారు అంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా భారీగా సంపాదించుకునే వీలుంటుంది. విజేతలు గోల్డెన్ ట్రోఫీ అందుకోవడమే జీవితంలో గొప్ప విషయం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన తర్వాత ప్రపంచ అత్యుత్తమ టెక్నీషియన్ లేదా నటుడు అనే పేరు దక్కుతుంది. ఆ కారణంగా కూడా వారి సినిమాలకు ప్రపంచం మొత్తం గుర్తింపు ఉంటుంది. ఒక సినిమాకు ఆస్కార్ లభిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఏళ్లకు ఏళ్లు ఆ సినిమాను ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. అందుకే ప్రతి ఒక్క సినీ టెక్నీషియన్, నటుడు నటికి ఆస్కార్ అనేది ఒక కల అనడంలో సందేహం లేదు.
ఆస్కార్ ట్రోఫీ ఖరీదు $1
అకాడమీ నిబంధనల ప్రకారం ట్రోఫీ ని అమ్మడం, పారవేయడం కానీ చేయకూడదు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక వేళ ట్రోఫీ వద్దనుకుంటే అకాడమీ వారే స్వయంగా ఒక డాలర్ ఇచ్చి కొనుగోలు చేయాల్సిందే తప్ప మరెవ్వరి అమ్మడానికి వీలు లేదు. అవార్డు గ్రహీతలు, నామినేషన్స్ లో ఉన్నవారు వేడుక సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న స్టార్స్ తో సెలబ్రిటీలతో కలుస్తారు. అది కూడా వారికి కలిసొచ్చే అంశం. కనుక ఆస్కార్ అవార్డు దక్కించుకుని ట్రోఫీ మాత్రమే అందుకున్నా భవిష్యత్తులో విజేతలకు మంచి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. కేవలం విజేతలకు మాత్రమే కాకుండా నామినేషన్స్ దక్కించుకున్న వారికి కూడా అకాడమీ తరపున గూడీ బ్యాగ్ ను అందిస్తారు. ఆ బ్యాగ్ లో కొన్ని గిప్ట్ లు, తినే పదార్థాలు ఉంటాయి. మన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకుని ఇండియాలో అడుగు పెడుతుందా.. లేదా అనేది చూడాలి.
Read Also: ‘ఆస్కార్’ అవార్డు అంత చవకా? ట్రోఫీని ఏ లోహంతో చేస్తారు? ఖరీదు ఎంత?