Ilaiyaraaja: ఆ సంగతి నాకు తెలిస్తే మ్యూజిక్ వదిలేస్తా - మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా
Shashtipoorthi Teaser: తన నుంచి సంగీతం ఎలా వస్తుందో తనకు ఎప్పటికీ తెలియకూడదని దేవుడిని కోరుకుంటున్నట్లు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అన్నారు. 'షష్టిపూర్తి' సినిమా టీజర్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Ilaiyaraaja Comments On Music Career In Shashtipoorthi Teaser Event: తనకు ఎంత సంగీతం తెలుసన్నది ముఖ్యం కాదని.. సంగీతమే తన గురించి తెలుసుకుందని మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) అన్నారు. ఆయన మ్యూజిక్ అందించిన 'షష్టిపూర్తి' (Shashtipoorthi) సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'అలా అని దేవున్ని కోరుకుంటా'
తాను ఇక్కడకి వచ్చింది మాట్లాడ్డానికి కాదని.. మాట్లాడడానికి ఏమీ లేదని ఇళయరాజా అన్నారు. 'కీరవాణి పల్లవి వినిపించినప్పుడు.. ఆయన మనసులో నా మీద ఉన్న ఆత్మ బంధాన్ని రాశారని అర్థమైంది. నా మీద వున్న అభిమానం కీరవాణిలో ఎప్పుడూ మారలేదు. నాకు ఎంత సంగీతం తెలుసన్నది ముఖ్యం కాదు. సంగీతమే నా గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తోందో నాకు తెలియదు. ఆ సంగతి తెలిసిన మరుక్షణంలోనే నేను సంగీతాన్ని ఆపేస్తాను.. నాకు నాలోంచి సంగీతం ఎలా వస్తోందో నాకు ఎప్పటికీ తెలియకూడదని దేవుడిని కోరుకుంటున్నాను. షష్టిపూర్తి చేస్తున్న కొత్తవారిని ప్రోత్సహించడానికే ఇక్కడికి వచ్చాను' అని అన్నారు.
అది నా అదృష్టం
ఇళయరాజా మ్యూజిక్‌కు పాట రాయడం తనకు దొరికిన అద్భుతమైన అవకాశం అని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) అన్నారు. 'నేను మద్రాసు వెళ్లినప్పుడు, ఇళయరాజా గారి ఇల్లుని ఆరాధనా భావంతో చూసేవాడిని. చాలా ఏళ్ల తర్వాత చక్రవర్తి గారి దగ్గర పని చేసేటప్పుడు వేటూరి, ఇళయరాజా గారిని కలిసే భాగ్యం కలిగింది. ఆయన సంగీతానికి పాడాలనుకున్నా. కానీ, ఆ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు ఆయన సంగీతానికి పాట రాసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నేను రాసిన పాటగా మాత్రమే కాకుండా ఆయనతో నాకున్న పరిచయాన్ని ప్రతిఫలించేలా ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇప్పించిన రూపేష్, పవన్‌కి, వారికి వారధిగా నిలిచిన చైతన్య ప్రసాద్‌కి కృతజ్ఞతలు.' అని అన్నారు.
'అలా జరిగుంటే సూసైడ్ చేసుకునేవాడిని'
తన కెరీర్‌లో 'లేడీస్ టైలర్' సినిమా ఆడకుంటే తాను ఆత్మహత్య చేసుకునేవాడినేమోనని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) అన్నారు. ఇళయరాజా సంగీతం వల్లే ఆ సినిమా హిట్టయిందని తెలిపారు. 'మా 'స్వామి' ఇంత కాలానికి నా సినిమాకి సంగీతాన్ని అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. కీరవాణి పాట రాశారంటేనే ఈ సినిమా ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. నేను నిజ జీవితంలో ‘షష్టిపూర్తి’ చేసుకోలేదు. నాకు నట జీవితంలో ‘షష్టిపూర్తి’ వచ్చింది. చక్కటి కథతో రూపొందిన సినిమా ఇది.' అని అన్నారు.
'షష్టిపూర్తి' సినిమాలో రూపేష్, ఆకాంక్షాసింగ్ హీరో, హీరోయిన్లుగా నటించగా.. ‘లేడీస్ టైలర్’ కపుల్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలు పోషించారు. మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ చౌదరి నిర్మించగా.. పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మూవీలోని ‘ఏదో ఏదేదో’ అంటూ సాగే ఒక పాటకు కీరవాణి లిరిక్స్ అందించారు.





















