మీరెందుకు ప్యాకప్ చెబుతారంటూ మోహన్ బాబుతో గొడవపడ్డా: సంగీత దర్శకుడు కోటి
పలు సినిమాలకు మ్యూజిక్ అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి.. హీరో మోహన్ బాబు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందని ఆయన కితాబిచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
Koti on Mohan Babu : తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ సంగీత దర్శకులలో కోటి ఒకరు. ఆయన సంగీతం అందించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కెరీర్ తొలినాళ్లలో కోటి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. కోటి దగ్గర మణిశర్మ కూడా శిష్యరికం చేశారు. అయితే హీరో మోహన్ బాబుతో ఉన్న సంబంధంపై ప్రస్తావించిన ఆయన.. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాను ఎక్కువగా గొడవ పడింది నటుడు మోహన్ బాబుతోనే అని కోటి అన్నారు. కానీ అది పర్సనల్ కోపం కాదని, వర్క్ వల్ల వచ్చేదేనని క్లారిటీ ఇచ్చారు. అలా ఎంత గొడవ జరిగినా సినిమాను వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు మాత్రం ఎప్పుడూ జరగలేదన్నారు. ఆయన కూడా తనను ఓ బ్రదర్ లా చూసేవారని చెప్పారు. "ప్రొడ్యూసర్ తో కూడా నన్ను తీసేయమని, పలు మాటలన్నా కూడా వాళ్లు తీసేయపోయే వాళ్లు. ఎందుకంటే మన టాలెంట్ ఏంటో వాళ్లకు. మన వర్త్ ఎంత అనేది కూడా తెలుసు. అందుకే కోపిష్టి అయినా పడదాం అని వదిలేసేవారు" అని నవ్వుతూ చెప్పారు.
"ఇండస్ట్రీలో ఉన్న వాళ్లలో అత్యంత కోపం ప్రదర్శించే వాళ్లలో మోహన్ బాబు ఒకరు. ఓ మూవీకి పనిచేస్తున్నపుడు ఊకే విసుగు తెప్పిస్తుంటే.. ఆయనొచ్చి వెంటనే ప్యాకప్ అని చెప్పేశారు. అప్పుడు వెంటనే నేను.. అయినా మీరెందుకు సర్ ప్యాకప్ చెప్పాలి. అది నా ఆర్కెస్ట్రా అని గట్టిగా చెప్పడంతో ఆయన అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత బయటకెళ్లి చూసేసరికి కారు దగ్గర ఉన్నారు. అలా ఎవరి దారిని వాళ్లం వెళ్లిపోతాం. ఆ తర్వాత రెండు రోజుల పాటు మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. స్టూడియో అంతా కూడా ఏమవుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు ఆ టైంలో. అప్పుడే డైరెక్టర్ బి. గోపాల్ ఇంటికి వచ్చి.. ఏంటి కోటి ఇది.. అని ఏదో చెప్పేసరికి.. సరే ఇక అని.. మళ్లీ నెక్స్ట్ డే నుంచి అంతా రొటీన్ అయిపోయేది. మోహన్ బాబు కూడా మామూలుగా వచ్చేవారు. మళ్లీ రికార్డింగులు, షూటింగ్స్.. అంతా కామన్ అయిపోతుందింకా" అని కోటి చెప్పుకొచ్చారు.
"కానీ మోహన్ బాబు గురించి చెప్పాలంటే.. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది" అని కోటి ఆయన గురించి గొప్పగా చెప్పారు. "చక్కగా అన్నీ దగ్గరుండి చేయించుకుంటారు. మంచి హోస్ట్ కూడా. మంచి భోజనం కూడా పెడతారు. బ్రహ్మాండంగా చూసుకుంటారు" అని మోహన్ బాబు గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను కోటి పంచుకున్నారు. అలాగే, తనను దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చాలా ఇష్టపడేవారని, ఓ సారి తన సినిమాలోకి తనని తీసుకోలేదనే కారణంతో ఆయన సినిమా చేయనంటూ నిర్మాతకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారని తెలిపారు. ఆయన తనపై ఉన్ననమ్మకం అలాంటిదని పేర్కొన్నారు.
Read Also : పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial