Telugu Movies: విలన్‌తో బాలకృష్ణ, కమల్ హాసన్, నాగార్జునకు మాటల్లేవ్... ఈ సినిమాల్లో అదే స్పెషాలిటీ మరి
హీరో విలన్ మధ్య పంచ్ డైలాగ్స్ ప్రతి సినిమాలోనూ ఉంటాయి. స్టార్ హీరోస్ మూవీస్ అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. అయితే... హీరో విలన్ మధ్య ఒక్క డైలాగ్ కూడా లేని సినిమాలు తెలుగులో ఉన్నాయి. అవి ఏమిటో తెలుసా?

హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే హీరో పంచ్ డైలాగ్ చెప్పాలి. విలన్ ముందు తొడ కొట్టాలి. మీసం మెలేయాలి. వీరోచితంగా పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పాలి. హీరో విలన్ మధ్య పంచ్ డైలాగ్స్ ప్రతి సినిమాలోనూ ఉంటాయి. ఆఖరికి కొత్తగా వచ్చే హీరోలు సైతం విలన్ ముందు పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఇక, స్టార్ హీరోస్ మూవీస్ అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. అయితే... హీరో విలన్ మధ్య ఒక్క డైలాగ్ కూడా లేని సినిమాలు తెలుగులో ఉన్నాయి. అవి ఏమిటో తెలుసా?
'భైరవద్వీపం'లో బాలయ్యకు విలన్‌కు మధ్య డైలాగ్స్ లేవు!
ఇటీవల 'భైరవ ద్వీపం' విలన్ విజయ రంగరాజు చనిపోయారు. 'మేడమ్', గోపీచంద్ 'యజ్ఞం' లాంటి సినిమాల్లో ఆయన నటించినా... 90లలో, అప్పటి పిల్లల మనసుల్లో 'భైరవద్వీపం' విలన్‌గానే ఆయన గుర్తుండి పోయారు. 1994లో వచ్చిన ఆ సినిమాకు సంబంధించి ఒక విశేషం ఏమిటో తెలుసా? ఆ సినిమాలో హీరో బాలకృష్ణ, మంత్రికుడు విజయ రంగ రాజు మధ్య ఒక్క డైలాగ్ కూడా ఉండదు. దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు చాలా తెలివిగా అల్లిన స్క్రీన్ ప్లే మేజిక్ అది. ఇప్పటిలా హీరో విలన్ల మధ్య పంచ్ డైలాగులు, వన్ లైనర్లు ఏవీ లేకుండా తీసిన ఈసినిమా ఓ క్లాసిక్ గా మిగిలిపోయింది. అయితే ఇదే పంథాలో హీరో విలన్ ల మధ్య డైలాగులు లేని సినిమాలు ఇంకొన్ని ఉన్నాయి.
గోవిందా గోవిందా... రామ్ గోపాల్ వర్మ, నాగార్జున సినిమాలోనూ....
రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా' సినిమా కూడా 1994లో విడుదల అయ్యింది. చాలా భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ తర్వాత కాలంలో కల్ట్ స్టేటస్ పొందింది. ఆర్జీవి తీసిన గొప్ప సినిమాల్లో ఒకటిగా ఆయన ఫాన్స్ చెప్పుకునే 'గోవిందా గోవిందా'లో కూడా హీరో నాగార్జున, విలన్‌గా నటించిన ధీర్ మధ్య కూడా ఒక్క డైలాగూ ఉండదు. ఆ మాటకొస్తే ఆ సినిమాలో విలన్ ఎవరితోనో మాట్లాడడు. అదే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అనిల్ రాజ్ పాత్ర చాలా పాపులర్ అయింది. విచిత్రం ఏంటంటే... సినిమాలో ఆ క్యారెక్టర్‌కు కూడా డైలాగులు ఉండవు.
బాలకృష్ణ, నాగార్జున సినిమాల కంటే ముందు కమల్ సినిమాలో...
'భైరవ ద్వీపం', 'గోవిందా గోవిందా'.... ఈ రెండు సినిమాలు కంటే ముందు 1987లో వచ్చిన 'పుష్పక విమానం' సినిమాలోనూ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు ఇలాంటి ప్రయోగమే చేశారు. అసలు డైలాగులు లేకుండా తీసిన ఆ సినిమాలో హీరో కమల్ హాసన్, హంతకుడు టినూ ఆనంద్ మధ్య ఎలాంటి డైలాగులు లేకుండా సాగే సన్నివేశాలను చాలా గొప్పగా తీశారు సింగీతం. ఆ సినిమాలో చేసిన ప్రయోగాన్నే తరువాతి కాలంలో 'భైరవ ద్వీపం'లోనూ అప్లై చేశారాయన.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

