Karthi: 'అన్నయ్యతో గొడవ, అమ్మ ఇబ్బంది పడేది' - సూర్య గురించి కార్తీ ఏమన్నాడంటే?
'జపాన్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తీ యాంకర్ సుమతో ఫన్నీ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన అన్న సూర్యతో అనుబంధం గురించి మాట్లాడారు.
Karthi: కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీలకు టాలీవుడ్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నదమ్ములిద్దరూ కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన చిత్రాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. వారు నటించే చిత్రాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే, తమిళంలో కంటే ఇక్కడే ఎక్కువ వసూళ్లు రాబట్టిన సందర్భాలు ఉన్నాయంటే వారిని తెలుగు ఆడియన్స్ ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కార్తీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అన్న సూర్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్లమని చెప్పారు.
'జపాన్' ప్రమోషన్స్ లో భాగంగా కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ లతో యాంకర్ సుమ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సోదరుడు సూర్య గురించి కార్తీ మాట్లాడుతూ.. చిన్నప్పుడు తామిద్దరం ఎప్పుడూ ఫైటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్లమని చెప్పారు. ఇద్దరం ఒక రూమ్ లో ఉంటే పెద్ద భూకంపం వచ్చినట్లు ఉండేదని, ఇంట్లో ఒకరికొకరం ఎదురుపడినా గొడవ జరగబోతున్నట్లు రెండు నిముషాలు ఒక వైబ్రేషన్ వచ్చేదని నవ్వుతూ అన్నారు. అప్పట్లో తమని చూసి అమ్మ బాగా స్ట్రగుల్ అయ్యేదని తెలిపారు.
అయితే అప్పుడు ఎంతగా గొడవలు పడ్డామో ఇప్పుడు ఇద్దరం అంత ఫ్రెండ్స్ అయ్యామని, అప్పటి రోజులు తరచుకుని నవ్వుకుంటామని కార్తీ తెలిపారు. ''నేను చదువుకోడానికి యూఎస్ వెళ్లిన తర్వాత ఒకసారి కాల్ చేసిన 'నాకు ఇక్కడ కొట్టడానికి ఎవరూ లేరురా' అన్నాడు. నన్ను అంతగా మిస్ అవుతున్నానని చెప్పాడు. అప్పటి నుంచే మేం మంచి స్నేహితులమయ్యాం'' అని కార్తీ అన్నారు. చిన్నతనంలో ఎక్కువగా దొంగ పోలీస్ గేమ్స్ ఆడేవాళ్లమని, ఆ ఆటల్లో ఎప్పుడూ అన్నయ్యే దొంగ అని చెప్పాడు. ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టమని, అంత ఫాస్ట్ గా పరిగెడతాడని, ఈజీగా చెట్లు ఎక్కేస్తాడని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
Also Read: 'ఎవరికీ ఇలా జరగకూడదు'.. రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన విజయ్!
కాగా రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ - అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'జపాన్'. ఇందులో సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని దీపావళి సందర్బంగా నవంబర్ 10వ తేదీన తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేయనుంది.
కార్తీ ఇంతకముందు 'యుగానికొక్కడు' 'ఆవారా' 'నా పేరు శివ' 'ఖాకీ' 'ఖైదీ' 'ఊపిరి' వంటి సినిమాలతో తెలుగులో మంచి విజయాలు సాధించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన 'సర్దార్', 'పొన్నియన్ సెల్వన్ 1' 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ క్రమంలో రాబోతున్న 'జపాన్' మూవీపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే కార్తీ తెలుగు ప్రమోషన్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అందులోనూ తన కెరీర్ లో మైలురాయి సిల్వర్ జూబ్లీ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారంలో రెండు మూడు రోజులు హైదరాబాద్ లోనే మకాం వేసి మరీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 'బిగ్ బాస్' లాంటి పాపులర్ తెలుగు రియాలిటీ షోలో సందడి చేయడమే కాదు, స్పెషల్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా టాలెంటెడ్ హీరోకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.