Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కాకినాడలోనే నిర్వహించేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..రామ్‌చరణ్ సూచన మేరకే ఇప్పటికే కాకినాడలో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సామాజిక స్పృహ కలిగిన దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో 'గేమ్ ఛేంజర్' కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం కాస్త ముందుకు జరుపుతూ వస్తున్నారు. అయితే అన్ని ఆటంకాలు అధిగమించి త్వరలోనే అంటే జనవరి 10న 'గేమ్ ఛేంజర్' విడుదల కాబోతోందని మేకర్స్ తెలపడంతో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ ఇచ్చారు.
కాకినాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్...
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకినాడలో నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. దాంతో కాకినాడ జిల్లాలోనే కాకుండా అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అటు తూర్పుగోదావరి జిల్లాలోనూ జన సైనికులు, మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే... కాకినాడలో ఈవెంట్ చేస్తారా? లేదంటే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చేస్తారా? అనేది తెలియాలి. ఆల్రెడీ కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో ఈవెంట్ చేసేందుకు కొన్ని గ్రౌండ్స్ 'గేమ్ ఛేంజర్' యూనిట్ నుంచి నిర్వాహకులు పరిశీలించారు.
ఇచ్చిన మాటకు కట్టుబడిన రామ్ చరణ్
ఎన్నికలకు ముందు పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున రామ్ చరణ్ ప్రచారం నిర్వహించారు. తన బాబాయ్ పవన్ కల్యాణ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఇకపై తన సినిమా ప్రచార కార్యక్రమాలను ఈ ప్రాంతంలోనే నిర్వహిస్తానని ఆయన పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆయన తన 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కాకినాడ పిఠాపురం పరిసర ప్రాంతాల మధ్యనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రామ్ చరణ్ వ్యక్తిగత సిబ్బంది, ఈవెంట్ నిర్వాహకులు సోమవారం, మంగళవారం కాకినాడ`పిఠాపురం ప్రాంతాల్లో పర్యటించారు. పలు గ్రౌండ్లను పరిశీలించారు. దీంతో జనసైనికులు, మెగా అభిమానుల్లో జోష్ పెరిగింది.
ముఖ్య అతిధిగా జనసేనాని పవన్ కల్యాణ్
కాకినాడ వేదికగా జరగనున్న 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు రామ్ చరణ్ నటించిన కొన్ని సినిమాలకు పవన్ కల్యాణ్ అటెంట్ అయ్యారు. అయితే, అప్పుడు ఆయన పవర్ స్టార్. టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరు. కానీ, ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎం. ఆ హోదాలో అబ్బాయ్ ఈవెంట్‌కు వస్తుంటడం తొలిసారి కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది.
డిసెంబర్ 10న విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్'
ఎక్కువ శాతం గోదావరి జిల్లాల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న గేమ్‌ఛేంజర్ సినిమా డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ రిలీజ్ కార్యక్రమం ఉత్తరప్రదేశ్ లక్నోలో భారీ జనసందోహం మథ్య జరిగింది.
Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే





















