Sankranthi 2025: మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని, ఈ సంక్రాంతి క్లాష్ తో బాక్స్ ఆఫీసు మోత మోగాల్సిందే
Game Changer NBK109 Thandel movies | 2025 సంక్రాంతికి బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది. మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని క్లాష్ తో బాక్స్ ఆఫీసు షేక్ అవ్వాల్సిందే.
Game Changer Movie News | ప్రతి ఏడాది సంక్రాంతి టాలీవుడ్ మూవీ లవర్స్ తో పాటు సెలబ్రిటీలకు కూడా చాలా ముఖ్యమైనది. సంక్రాంతికి సినిమా వస్తే హిట్టే అన్న సెంటిమెంట్ టాలీవుడ్ లో పెద్ద హీరోలు అందరికీ ఉంది. అందుకే బాలయ్య, చిరంజీవి లాంటి బడా స్టార్స్ సంక్రాంతిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. గత ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ఫైట్ ఏ రేంజ్ లో జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా అదే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపే క్లాష్ జరగబోతోంది.
మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని
నిన్న మొన్నటిదాకా సంక్రాంతి సినిమాల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉండేది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' సినిమాతో సంక్రాంతి సినిమా రిలీజ్ డేట్ పై కర్చీఫ్ వేశారు. ఇక తాజాగా ఆ రిలీజ్ డేట్ ని మెగాస్టార్ తన వారసుడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' కోసం త్యాగం చేశారు. ఇప్పుడు 'విశ్వంభర' రిలీజ్ డేట్ ను రీప్లేస్ చేసిన 'గేమ్ ఛేంజర్' మూవీ 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ పాన్ ఇండియా సినిమాతో ఢీ కొట్టడానికి నటసింహం నందమూరి బాలయ్య సిద్ధమవుతున్నాడు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'ఎన్బికె 109' సినిమాను సంక్రాంతి రేసులో దింపబోతున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ రెండు సినిమాలు సంక్రాంతికి క్లాష్ అవ్వడం ఖాయం.
ఇక ఈ ఇద్దరు హీరోలే కాకుండా ఈసారి సంక్రాంతికి అక్కినేని ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగబోతోంది. గత ఏడాది 'నా సామిరంగ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది నాగార్జున కాకుండా ఆయన వారసుడు అక్కినేని నాగచైతన్య సంక్రాంతి క్లాష్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తిరకెక్కుతున్న సినిమా 'తండేల్' కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇలా ప్రస్తుతానికి అయితే ఈ సంక్రాంతికి టాలీవుడ్ లోని ముగ్గురు బడా హీరోలు సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ కి సిద్ధమవుతున్నారు.
Also Read: Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
ఈ మూడు సినిమాలలో 'గేమ్ ఛేంజర్'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పాన్ ఇండియా సినిమా గురించి మెగా అభిమానులు చాలా కాలం నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ కావడానికి సిద్ధమైంది. కానీ అంతకంటే ముందు డిసెంబర్ 20 న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు అంటూ బజ్ నడిచింది. అదేవిధంగా నాగ చైతన్య 'తండేల్' సినిమాను కూడా క్రిస్మస్ రేసులో దింపబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ 'గేమ్ ఛేంజర్' మూవీ వల్ల ఈ సినిమాను వాయిదా వేస్తారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు చెర్రీ సినిమాను సంక్రాంతికి మూవ్ చేసినప్పటికీ, ప్రస్తుతం 'తండేల్' సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండడంతో క్రిస్మస్ కి రిలీజ్ చేసే ఛాన్స్ లేదని, కాబట్టి సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.