అందుకే ‘గేమ్ ఛేంజర్’ మూవీని డైరెక్ట్ చేయడం లేదు - దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు
రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమాకి కథ అందిస్తున్న కార్తిక్ సుబ్బరాజు.. ఈ సినిమాను తాను ఎందుకు డైరెక్ట్ చేయలేదనే విషయాన్ని తాజాగా ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్'(Game Changer) సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథ అందిస్తుండగా, సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రానికి కథ అందిస్తున్న కార్తీక్ సుబ్బరాజు రైటర్ గానే కాకుండా కోలీవుడ్లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
అయితే తాజాగా 'గేమ్ చేంజర్' మూవీకి ఎందుకు దర్శకత్వం వహించలేదు? అనే ప్రశ్నపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజుకి ఈ ప్రశ్న ఎదురవగా దానికి సమాధానం ఇస్తూ.." శంకర్ సార్ తాను దర్శకత్వం వహించగల స్క్రిప్ట్ లు ఏమన్నా ఉన్నాయా అని నన్ను అడిగినప్పుడు రచయితగా, దర్శకుడిగా నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను. 'గేమ్ చేంజర్' కథను ఆయనకు చెబితే చాలా లైక్ చేశారు. గేమ్ చేంజర్ ప్లాట్ కు భారి స్థాయిలో డిమాండ్ ఉంది. శంకర్ సార్ లాంటి వారు మాత్రమే ఆ ప్లాట్ కు కచ్చితంగా న్యాయం చేయగలరు. గేమ్ చేంజర్ శంకర్ సార్ స్టైల్ లో సాగే పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. ఇది శంకర్ సార్ జోన్ లో ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు కార్తీక్ సుబ్బరాజు.
కమర్షియల్ సినిమాలు చేయడంలో దర్శకుడు శంకర్ సిద్ధహస్తుడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఓ సామాజిక సందేశానికి వినోదాన్ని జోడించి సిల్వర్ స్క్రీన్ పై సినిమాని ఆయన ప్రజెంట్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తరహాలోనే 'గేమ్ చేంజర్' మూవీ కూడా ఉంటుందని రచయిత కార్తీక్ సుబ్బరాజు చెప్పడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక తాజాగా 'గేమ్ చేంజర్' కొత్త షెడ్యూల్ హైదరాబాదులోని గచ్చిబౌలిలో సోమవారం ప్రారంభమైంది. షూటింగ్ లోకేషన్ నుంచి విడుదలైన ఓ స్టిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అందులో లొకేషన్ లో రామ్ చరణ్ కి శంకర్ సీన్ ని వివరిస్తుండగా, చరణ్ సూపర్ కూల్ లుక్ లో ఎంతో శ్రద్ధగా వింటున్నట్లు కనిపించాడు. ఆ పిక్ లో చరణ్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, మరో హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్ విలన్ గా కనిపించనున్నారు. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, సముద్రఖని, జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ప్రభాస్ 'కల్కి'లో అమితాబ్ బచ్చన్ లుక్ చూశారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial