Sonu Sood: సోనుసూద్ హోటల్ బిల్లు పే చేసిన అజ్ఞాత అభిమాని, లెటర్‌లో ఏం రాశాడంటే?
నటుడు సోనూసూద్ కు ఓ అభిమాని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆయన హోటల్ బిల్లు అంతా తానే కట్టేశాడు. విషయం తెలుసుకున్న సోనూ, అభిమాని చేసిన పనికి ఆశ్చర్యపోయారు.
Stranger Pays Sonu Sood's Dinner Bill: రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు పోషించిన సోనూసూద్, రియల్ లైఫ్‌లో ఎంతో మందికి ఆపన్న హస్తం అందించి హీరోగా నిలిచాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన సేవలు ఎవ్వరూ, ఎప్పటికీ మర్చిపోలేరు. నిస్వార్థంతో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టాయి. ఆయన సాయంతో ఎంతో మంది కష్టకాలంలో ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. ఇంతకాలం ఎంతో మందికి సాయం చేసిన సోనూసూద్‌కు తాజాగా ఓ అభిమాని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆయన చేసిన పనికి ఈ రియల్ హీరో ఫిదా అయ్యారు.
బిల్ పే చేసిన అభిమాని, సోనూ ఫిదా
కొద్ది రోజుల క్రితం ఇటీవల సోనూసూద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. తన కుటుంబ సభ్యులు ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్లు తెప్పించుకున్నారు. అందరూ చక్కగా భోం చేశారు. తినడం పూర్తి అయ్యాక, బిల్ తీసుకురమ్మని సిబ్బందిని కోరాడు సోనూసూద్. అప్పుడు రెస్టారెంట్ సిబ్బంది నుంచి వచ్చిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోయారు. మీ బిల్ మొత్తం ఎవరో అజ్ఞాత వ్యక్తి చెల్లించి వెళ్లారని సదరు సిబ్బంది చెప్పారు. సోనూసూద్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాదు, బిల్ పే చేసి వెళ్లిన వ్యక్తి, సోనూసూద్ కు ఓ చిన్న నోట్ రాసిచ్చి వెళ్లారు.
“దేశం కోసం మీరు చేస్తున్న మంచి పనులకు నా తరపున చిన్న కృతజ్ఞత” అంటూ ఆ పేపర్ లో రాశాడు. ఈ విషయాన్ని సోనూసూద్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అజ్ఞాత అభిమాని రాసిన నోట్ ఫోటోను షేర్ చేస్తూ.. “ఈ పని ఎవరు చేశారో తెలియదు. కానీ.. అతడు నా మనసును గెలుచుకున్నాడు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనూసూద్ మంచి మనసుకు ఎవరైనా ఇలాగే చేస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
సోనూకు ప్రతిష్టాత్మక 'ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్' అవార్డు
తాజాగా సోనూసూద్ సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపు ప్రతిష్టాత్మక 'ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్' అవార్డును అందుకున్నారు. తన స్వచ్ఛంద సంస్థ, 'ది సూద్ ఫౌండేషన్' ద్వారా, ఆయన ఎంతో మంది పేద పిల్లలకు విద్యను అందిస్తున్నారు. పలువురు అభాగ్యులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారు. వృద్దాశ్రమాన్ని కూడా ఆయన రన్ చేస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపు ఇప్పటికే పలు అవార్డులు లభించాయి.
ప్రస్తుతం సోనూసూద్ దర్శకత్వంలో ‘ఫతే’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో సోనూసూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలు పోషించారు. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సూద్ నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. జీ స్టూడియోస్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తోంది.
Read Also: ‘సరిపోదా శనివారం‘ గ్లింప్స్: వారంలో ఒక్క రోజు మాత్రమే కోపం చూపించే పిచ్చినా కొడుకుని చూశారా?