Kamaal Rashid Khan: ‘బాహుబలి’ని దండగన్న ఆ సినీ విమర్శకుడు అరెస్ట్? కారణం సల్మాన్ ఖాన్ అట!
బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్‌ను ముంబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ వెనుక సల్మాన్ ఖాన్ ఉన్నాడంటూ కమల్ ట్వీట్ చేశాడు.
KRK arrested: బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్‌కేకు కాంట్రవర్సీలు అంటే చాలా ఇష్టం. ఆ కాంట్రవర్సీలే ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడేశాయి. తాజాగా తనను ముంబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారని తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు కేఆర్‌కే. కాసేపటికే ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. కానీ ఆ తర్వాత తన ట్విటర్ హ్యాండిల్‌లో ఈ పోస్ట్ కనిపించడం లేదు. డిలీట్ అయ్యిందా లేదా తనే స్వయంగా డిలీట్ చేశాడా అనే విషయం క్లారిటీ లేదు. కానీ రషీద్ అరెస్ట్ గురించే ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన అరెస్ట్ విషయంలో సల్మాన్ ఖాన్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది.
జైలులోనే మరణిస్తే..
కేఆర్‌కే ట్విటర్‌లో చేసిన పోస్ట్ ప్రకారం.. తను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్తున్నానని, అప్పుడే ముంబాయ్ పోలీసులు తనను అరెస్ట్ చేశారని తెలిపాడు. 2016కు సంబంధించిన కేసు విషయంపై ఎయిర్‌పోర్ట్ నుండే తనను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని అన్నాడు. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమా ‘టైగర్ 3’ ఫ్లాప్ అవ్వడానికి తనే కారణమని ఆరోపిస్తున్నారని, ఒకవేళ తాను జైలులోనే మరణిస్తే.. అది హత్య అని గుర్తించమని, ఎవరు చేశారో మీకు తెలిసిపోతుంది అంటూ నెటిజన్లను కోరాడు కేఆర్‌కే. సల్మాన్ ఖాన్‌ను ఆరోపిస్తూ.. కేఆర్‌కే చేసిన ట్వీట్ బాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపింది. పైగా ఈ ట్వీట్‌లో ప్రధానీ నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు పలు ప్రముఖ న్యూస్ ఛానెళ్లను కూడా ట్యాగ్ చేశాడు కేఆర్‌కే. కానీ కాసేపటికే ఆ పోస్ట్ డిలీట్ అయిపోయింది.
2020లో మొదటిసారి..
ట్విటర్‌లో పోస్ట్ కనిపించకపోవడంతో అసలు కేఆర్‌కే అరెస్ట్ చేసిన విషయం నిజమా కాదా? ఏ విషయంపై అరెస్ట్ చేశారు అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కాకపోతే.. కేఆర్‌కేపై పోలీసు కేసులు, అరెస్టులు అనేవి కొత్తేమీ కాదని వారు గుర్తుచేసుకుంటున్నారు. బాలీవుడ్‌లోని పెద్ద పెద్ద సెలబ్రిటీలపై, సీనియర్ నటీనటులపై, వారి సినిమాలపై బురద చల్లడం కేఆర్‌కేకు అలవాటే. ఆ అలవాటే తనను పలుమార్లు చిక్కుల్లో పడేసింది. ఎవరైనా స్టార్ హీరో సినిమా విడుదలయ్యిందంటే చాలు.. వెంటనే అది బాలేదని, దానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తాడు కమల్ రషీద్ ఖాన్. ఆ విషయంపై 2020లో తను మొదటిసారి అరెస్ట్ అయ్యాడు.
ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్‌పై అనుచిత వ్యాఖ్యలు
లెజెండరీ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ముంబాయ్ పోలీసులు.. కేఆర్‌కేను 2020లో మొదటిసారి అరెస్ట్ చేశారు. ‘దేశద్రోహి’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కేఆర్‌కే.. నిజంగానే ఒక దేశద్రోహిలాగా ప్రవర్తిస్తుంటాడు. ప్రపంచమంతా మహమ్మారి బారినపడి ఇబ్బందులు పడుతుంటే.. ఇలాంటి అమానవీయ ప్రవర్తనతో ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ఏంటో అర్థం కావడం లేదు అంటూ అతడిపై నమోదైన కేసులో పేర్కొన్నారు. అంతే కాకుండా దేశానికే గర్వకారణమైన నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించిన తర్వాత కేఆర్‌కే.. ఆయనపై అనుచిత, అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని, సీనియర్ నటుడు రిషీ కపూర్ గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటూ అతడిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అప్పట్లో కేఆర్‌కేను అరెస్ట్ చేశారు.
Also Read: మహేశ్, శ్రీలీల చితగ్గొట్టేశారు - మాస్ పాటపై నిర్మాత ఊరమాస్ అప్డేట్