Operation Sindoor: 'ఆపరేషన్ సింధూర్' మూవీ - సారీ చెప్పిన బాలీవుడ్ డైరెక్టర్.. అసలు కారణం ఏంటంటే?
Uttam Maheshwari: 'ఆపరేషన్ సింధూర్' పేరిట బాలీవుడ్ మూవీ అనౌన్స్‌మెంట్‌పై విమర్శలు వచ్చిన వేళ డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరీ సారీ చెప్పారు. ఎవరి మనోభావాలు గాయపరచడం తన ఉద్దేశం కాదన్నారు.

Uttam Maheshwari Apology Issues After Operation Sindoor Announcement: శత్రుదేశం వెన్నులో వణుకు పుట్టించేలా భారత్ చేపట్టిన సైనిక చర్య 'ఆపరేషన్ సింధూర్'. ఉగ్ర మూకలను మట్టుబెట్టిన సైన్యం ప్రస్తుతం పాక్ క్షిపణి దాడులను సైతం సమర్థంగా తిప్పికొడుతోంది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
తాజాగా.. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో బాలీవుడ్‌లో మూవీ రూపొందనున్నట్లు అనౌన్స్‌మెంట్ వచ్చింది. డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వర్ (Uttam Maheshwari) ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. నిక్కి విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ బ్యానర్‌పై ది కంటెంట్ ఇంజినీర్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే.. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఇలాంటి టైంలో సినిమా ఏంటంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.
సారీ చెప్పిన డైరెక్టర్
ఈ క్రమంలో డైరెక్టర్ ఉత్తమ్ మహేశ్వరీ సారీ చెపుతూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సమయం, సందర్భం లేకుండా టైటిల్ రివీల్ చేశారంటూ వస్తోన్న విమర్శలకు వివరణ ఇచ్చారు. డబ్బు లేదా ఫేమ్ కోసం తాను ఈ పని చేయలేదని.. ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అన్నారు.
'ఇది సినిమా కాదు.. దేశ ప్రజల ఎమోషన్'
''ఆపరేషన్ సింధూర్'పై సినిమా ప్రకటించినందుకు సారీ చెబుతున్నా. ఇతరుల మనోభావాలను గాయపరచడం లేదా రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు. మన సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాన్ని, నాయకత్వాన్ని ఓ పవర్ ఫుల్ స్టోరీగా సిల్వర్ స్క్రీన్‌పై తీసుకురావాలని అనుకున్నా. దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తూ దీన్ని రూపొందించాలనుకున్నా. అంతే తప్ప డబ్బు లేదా ఫేమ్ కోసం కాదు. అయితే, టైమింగ్, సున్నితత్వం కొందరికి అసౌకర్యం కలిగించొచ్చు. అందుకు సారీ చెబుతున్నా. ఇది కేవలం మూవీ మాత్రమే కాదు. దేశ ప్రజలు ఎమోషన్.' అంటూ ఉత్తమ్ మహేశ్వరీ వివరణ ఇచ్చారు.
Also Read: హ్యాపీ బర్త్ డే విజ్జీ - విజయ్ దేవరకొండకు రష్మిక క్యూట్ విషెష్.. ఒకే రోజు ఫ్యాన్స్‌కు రెండు గిఫ్ట్స్
పవర్ ఫుల్ పోస్టర్ వైరల్
ఓ మహిళ యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకుని, నుదిటిన సింధూరంతో ఉన్నట్లుగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఫైటర్ జెట్స్, బాంబులతో విధ్వంసం, మండుతున్న యుద్ధ భూమిని చూపించారు. ఈ పోస్టర్ వైరల్ కాగా.. దేశంలో టెన్షన్ వాతావరణం నెలకొన్న టైంలో సినిమా అనౌన్స్‌మెంట్ ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేశారు. క్లిష్ట సమయంలో సెన్సిటివ్ అంశంతో వ్యాపారమా? అంటూ విమర్శించారు.
ఇప్పటికే.. 'ఆపరేషన్ సింధూర్' టైటిల్ కోసం బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. దాదాపు 15 నిర్మాణ సంస్థలు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్నాయి. ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్‌లో పలువురు నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. టీ సిరీస్, జీ స్టూడియోస్ వంటి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు కూడా ఈ టైటిల్ కోసం అప్లై చేశాయి. అటు.. ఈ పేరుతో రిజిస్ట్రేషన్ కోసం ట్రేడ్ మార్క్‌ను సంప్రదించిన రిలయన్స్.. అప్లికేషన్ వెనక్కి తీసుకుంది. దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయలేమని.. తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పింది.






















