Aditi Shankar: 'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు డెబ్యూ - తమిళ్ రీమేక్‌తోనే, హీరోలు ఎవరో తెలుసా?
Aditi Shankar Tollywood Debut: దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు తెరకు పరిచయం కానున్నారు. యంగ్ హీరోలు చేస్తున్న మల్టీస్టారర్ సినిమాలో ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. ఇంతకీ, ఆ సినిమా ఏది? హీరోలు ఎవరో తెలుసా?
శంకర్ తమిళ దర్శకుడు కావచ్చు... కానీ తెలుగు ప్రేక్షకులు అందరికీ ఆయన తెలుసు. తెలుగులోనూ శంకర్ అంటే అభిమానం చూపించే జనాలు చాలా మంది ఉన్నారు. ఆయన ఫ్యామిలీ గురించి తెలుసా? ఆయన కుమార్తె అదితి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలుసా? అతిథి శంకర్ నటించిన రెండు తమిళ సినిమాలు ఆల్రెడీ విడుదల అయ్యాయి. మరో రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం కావడానికి రెడీ అవుతోంది. ఇంతకీ తెలుగులో అదితి శంకర్ నటిస్తున్న తొలి సినిమా ఏదో తెలుసా?
గరుడన్ తెలుగు రీమేక్... అదితి హీరోయిన్!
'దేవర' విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల నిమిత్తం చెన్నై వెళ్ళినప్పుడు దర్శకుడు వెట్రిమారన్ అంటే తనకు అభిమానం అని, ఆయన దర్శకత్వంలో స్ట్రయిట్ తమిళ సినిమా చేయాలని ఉందని ఎన్టీఆర్ తెలిపారు. వెట్రీమారన్ దర్శకత్వంలో కాకుండా నిర్మాణంలో రూపొందిన తమిళ సినిమా 'గరుడన్'. అందులో సూరి, శశి కుమార్, ఉన్ని ముకుందన్ హీరోలుగా నటించారు.
ఇప్పుడు 'గరుడన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అల్లరి నరేష్ 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కథానాయకగా నటించే అవకాశం అదితి సొంతం అయ్యిందని తెలిసింది. ఆల్రెడీ 'గరుడన్' తెలుగు రీమేక్ షూటింగ్ మొదలు అయింది. ఒక 15 రోజుల పాటు హీరోల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో మొదలు కాబోయే షెడ్యూల్ సమయానికి అదితి కూడా జాయిన్ అవుతారని టాక్.
అదితీతో పాటు ఆనంది, దివ్య పిళ్లై...
అతిథి శంకర్ కాకుండా 'గరుడన్' తెలుగు రీమేక్ లో మరో ఇద్దరు కథానాయికలకు చోటు ఉంది. అంటే సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు కదా! ఒక్కొక్కరి సరసన ఒక్కో అందాల భామ అన్నమాట.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అదితి శంకర్ నటిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి మిగతా ఇద్దరు కథానాయికలు ఎవరు? అంటే... తెలుగు అమ్మాయి ఆనంది (Actress Anandhi) ఒకరు. మరొకరు... మలయాళ నటి దివ్య పిళ్లై (Divya Pillai). అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మంగళవారం సినిమా గుర్తుందా? అందులో ఊరి జమీందారు చైతన్య భార్యగా నటించిన అమ్మాయి గుర్తుందా? ఆ అమ్మాయి దివ్య పిళ్లై.
Also Read: క్రిస్మస్ నుంచి సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' - తనయుడి కోసం చిరంజీవి త్యాగం?
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం మీద కేకే రాధామోహన్ నిర్మాణంలో 'గరుడన్' తెలుగు రీమేక్ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రాన్ని వీలైతే వచ్చే సంక్రాంతికి విడుదల చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు నుంచి సంక్రాంతి సీజన్ టార్గెట్ చేస్తూ చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఒకవేళ భారీ సినిమాలు ఏవైనా వాయిదా పడితే ఈ సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట.
నటిగా కాకుండా గాయనిగా అదితి శంకర్ ఆల్రెడీ టాలీవుడ్ డెబ్యూ ఇచ్చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిన 'గని' సినిమాలో 'రోమియో జూలియట్' పాటను ఆవిడ పాడారు. ఇప్పుడు కథానాయికగా తెలుగు డెబ్యూకి రెడీ అవుతున్నారు. తండ్రి దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేశారని టాక్.
Also Read: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్... అక్కడ ఫస్ట్ టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టారే!