ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ. 'దేవర' చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
దర్శకుడు కొరటాల శివ తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో తాను తెరకెక్కిస్తున్న 'దేవర'(Devara) మూవీ రెండు భాగాలుగా వస్తుందని అధికారికంగా ప్రకటించాడు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ప్రస్తుతం మన టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. 'బాహుబలి' తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు పీక్స్ కి చేరుకుంది. 'బాహుబలి' తర్వాత 'కే జి ఎఫ్' రెండు భాగాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. 'పొన్ని యన్ సెల్వన్' కూడా రెండు భాగాలుగా వచ్చింది. ఐకాన్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సైతం రెండు భాగాలుగా రాబోతోంది. ఇప్పటికే పార్ట్ వన్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
దాంతో 'పుష్ప 2'పై అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్ నటించిన 'సలార్' కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ అధికారిక ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో ఎన్టీఆర్ 'దేవర'(Devara) కూడా చేరింది. దర్శకుడు కొరటాల శివ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఆయన తన ట్విట్టర్లో ఓ వీడియోని రిలీజ్ చేశారు. అందులో దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. 'దేవర చిత్రాన్ని బిగ్ కాన్వాస్ పై భారీ స్కేల్లో తెరకెక్కిస్తున్నామని, రాను రాను ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిపోతోందని, దాంతో ఒక భాగంలో ఈ చిత్ర కథను చెప్పడం కష్టమవుతుందని, అందుకే రెండు భాగాలుగా దేవర సినిమాని తీసుకొస్తున్నట్లు తెలిపారు.
#DEVARA pic.twitter.com/74oTrv1u2W
— Devara (@DevaraMovie) October 4, 2023
అయితే సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నా కథలో ఎలాంటి మార్పు లేదని, కానీ కాన్వాస్ మాత్రమే పెరిగిందని అన్నారు. ఒక్క సినిమాగా దీన్ని తీసుకురావడం కష్టమని, పర్ఫెక్ట్ గా చెప్పాలంటే రెండు భాగాలుగా చేయడం బెటర్ అనిపించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. కోస్టర్ ఏరియాలో ఇప్పటివరకు బయటకు రానటువంటి, సినిమాల్లో చూపించనటువంటి ఓ కథని 'దేవర' చిత్రంతో తాము చెప్పబోతున్నామని కొరటాల వెల్లడించారు. సినిమా ఎలా ఉంటుందో ఇప్పటికే పోస్టర్స్ ద్వారా వెల్లడించమని తెలిపారు. రెండు భాగాలుగా రాబోతున్న 'దేవర' ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5, 2024న విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండో భాగం మరుసటి ఏడాది అంటే 2025 లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గానే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతోనే తెలుగు వెండితెరకి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. యువసుద ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పథకాలపై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Also Read : ఆ ప్రశ్నకు హెబ్బా పటేల్ ఆగ్రహం - ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial