Oy Movie: ‘ఓయ్’ టైటిల్‌లోనే మొత్తం కథ - ఆసక్తికరమైన వివరణ ఇచ్చిన దర్శకుడు
Oy Movie Re Release: 15 ఏళ్ల క్రితం థియేటర్లలో విడుదలై కమర్షియల్‌గా హిట్ అవ్వకపోయినా ఎంతోమంది మనసులను గెలుచుకున్న సినిమా ‘ఓయ్’. ఈ మూవీ రీ రిలీజ్ సందర్భంగా టైటిల్ వెనుక కథను రివీల్ చేశాడు దర్శకుడు.
![Oy Movie: ‘ఓయ్’ టైటిల్‌లోనే మొత్తం కథ - ఆసక్తికరమైన వివరణ ఇచ్చిన దర్శకుడు director anand ranga reveals the explanation behind the title oy Oy Movie: ‘ఓయ్’ టైటిల్‌లోనే మొత్తం కథ - ఆసక్తికరమైన వివరణ ఇచ్చిన దర్శకుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/23c3ef00e776444b04236471dc29421b1707813758676802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Director Anand Ranga: 2024 వాలెంటైన్స్ డే కాస్త రీ రిలీజ్ డేగా మారిపోనుంది. ఎన్నో ప్రేమకథా చిత్రాలు ఫిబ్రవరీ 14న విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగు మాత్రమే కాదు.. ఎన్నో హిందీ లవ్ స్టోరీలు కూడా మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్నాయి. అలా రీ రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘ఓయ్’ కూడా ఒకటి. ఆనంద్ రంగ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో ఇంత మంచి లవ్ స్టోరీ కమర్షియల్‌గా హిట్ ఎందుకు అవ్వలేదని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ‘ఓయ్’ రీ రిలీజ్ కారణంగా దర్శకుడు ఆనంద్ రంగ మరోసారి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అసలు ఆ టైటిల్ వెనుక కథ ఏంటని తాజాగా బయటపెట్టారు.
ఉదయ్, సంధ్య..
హీరో సిద్దార్థ్ ప్రేమకథలతోనే హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. కానీ తను ఎన్ని ప్రేమకథల్లో నటించినా ‘ఓయ్’ మాత్రం చాలా స్పెషల్ అని ఫ్యాన్స్ అంటుంటారు. 2009లో విడుదలయిన ఈ సినిమా ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. కానీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా మాత్రం హిట్ కాలేకపోయింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ కూడా పలుమార్లు గుర్తుచేసుకొని బాధపడ్డాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించిన షామిలి.. ‘ఓయ్’తో హీరోయిన్‌గా మారింది. ఉదయ్, సంధ్య పాత్రల్లో సిద్ధార్థ్, షామిలి నేచురల్‌గా నటించి ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. ఈ మూవీలో హీరోయిన్‌కు హీరోను ఓయ్ అని పిలవడం ఇష్టం. అందుకే మూవీకి ఆ టైటిల్ ఫిక్స్ చేశారని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ టైటిల్ వెనుక అసలు కథను తాజాగా దర్శకుడు రివీల్ చేశాడు.
ముందుగా ‘పరుగు’కు ఆ టైటిల్..
‘సినిమా అంతగా బ్లాక్‌బస్టర్ హిట్ కాకపోయినా సినిమాలో ఉన్న చిన్న వివరణను ఎవరైనా రివ్యూయర్ గుర్తించుంటే నేను చాలా సంతోషించేవాడిని. ఓయ్ టైటిల్‌కు సంబంధించిన అలాంటి ఒక చిన్న విషయాన్ని నేను గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మణిరత్నం సినిమాల్లో అమ్మాయిలు ఓయ్ అని పిలవడం నుండి ఇన్‌స్పైర్ అయ్యాను. కానీ ముందుగా ‘పరుగు’ సినిమాకు ఈ టైటిల్‌ను సజెస్ట్ చేశాను. అందులో హీరో.. హీరోయిన్ ఇంట్లో బంధించి ఉంటే.. అమ్మాయి వచ్చి కిటికీలో నుండి పిలిచి మాట్లాడుతుంది. ఆ తర్వాత నేను నా సొంత కథను రాయడం మొదలుపెట్టాను. సంధ్య ప్రతీసారి ఉదయ్‌ను ఓయ్ అని పిలవాలని నేను అనుకున్నాను. ప్రతీ తెలుగింట్లో ఈ పిలుపు కామనే’ అంటూ ముందుగా అల్లు అర్జున్ నటించిన ‘పరుగు’కు ‘ఓయ్’ అని టైటిల్ అనుకున్నట్టుగా ఆనంద్ రంగ రివీల్ చేశాడు.
వన్ ఇయర్..
‘‘మీరు గమనిస్తే సంధ్యతో ఉదయ్ ప్రేమకథ తన పుట్టినరోజున అంటే 2007 జనవరి 1న ప్రారంభమవుతుంది. సంక్రాంతికి ఉదయ్ తండ్రి చనిపోతాడు (ఆకాశంలో గాలిపటాలు ఎగురుతూ ఉంటాయి). సంధ్య గులాబీలతో మాట్లాడుతున్నప్పుడు వాలెంటైన్స్ డే వస్తే చాలు అని ప్రస్తావిస్తుంది. సంధ్య పిల్లలు సమ్మర్‌కు తన ఇంటికి వస్తారు. అక్కడ ఒక హోలీ సీక్వెన్స్ ఉంటుంది. షిప్‌లో వినాయక చవితి జరుగుతుంది. ఒక క్రిస్ట్మస్ సీన్ ఉంటుంది. డిసెంబర్ 31న వర్షం పడే చోటుకు ఉదయ్.. సంధ్యను తీసుకెళ్తాడు. 2008 జనవరి 1న సంధ్య చనిపోతుంది. అప్పటినుండి ఉదయ్ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం ఆపేస్తాడు. అంటే ఉదయ్ ఫస్ట్ లవ్ కేవలం సంవత్సరం మాత్రమే ఉంది’’ అంటూ ‘ఓయ్’ అంటే ‘వన్ ఇయర్’ అని బయటపెట్టాడు ఆనంద్ రంగ. ఇదంతా చూసిన ప్రేక్షకులు ఈ టైటిల్ వెనుక ఇంత అర్థం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
#OyReReleaseOnFeb14th pic.twitter.com/wDVEDe9jti
— anand ranga (@AnandRanga) February 12, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)