Dil Raju: ‘దేవర’ స్థానంలోకి ‘ఫ్యామిలీ స్టార్’? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
Devara Release Date: కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయ్యిందని వార్తలు వస్తుండగా.. దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
Dil Raju about Devara Release Date: ఈమధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల రిలీజ్ డేట్స్‌పై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. సినిమాల మధ్య ఎక్కువగా క్లాష్ రాకూడదని, అన్ని సినిమాలకు సమానంగా లాభాలు వచ్చేలా చూడాలని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చర్చించుకొని మూవీస్ రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేస్తూ ఎవరికీ నష్టం జరగకుండా చూస్తున్నారు. సంక్రాంతి సినిమా విడుదలల సమయంలో కూడా అదే జరిగింది. అప్పుడు చాలా చిత్రాలు సంక్రాంతికే విడుదల అవ్వాలని నిర్ణయించుకోగా.. దిల్ రాజు సమక్షంలో మీటింగ్ పెట్టి ‘ఈగల్’ వెనక్కి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పుడు మరోసారి కొన్ని విడుదల తేదీల విషయంలో కన్‌ఫ్యూజన్ ఎదురైతే అదే తరహా మీటింగ్‌ను ఏర్పాటు చేశారు.
సోలో రిలీజ్‌ను వదులుకున్న ‘దేవర’..
కొరటాల శివ, ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’ భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అందుకే ఏ పోటీ లేకుండా ఈ మూవీని ఏప్రిల్ 5న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ మూవీని సోలో రిలీజ్ చేయడానికి సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువ’ను సైతం వెనక్కి తప్పించారు. కానీ ఇంతలోనే ఫ్యాన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ‘దేవర’ మేకర్స్. ఈ సినిమా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దాదాపు పోస్ట్‌పోన్ అవ్వడం ఖాయమని కూడా తెలుస్తోంది. ఇక తాజాగా ఇదే విషయంపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా తను నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ డేట్ గురించి కీలక అప్డేట్‌ను అందించారు.
‘దేవర’ పోస్ట్‌పోన్ కన్ఫర్మ్..
‘దేవర’ పోస్ట్‌పోన్, ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుతూ.. ‘‘మా సినిమా వస్తుందిగా. దేవర వెనక్కి వెళ్తే మా సినిమా వస్తుందని అన్‌అఫీషియల్‌గా చెప్పాం కదా’’ అని అన్నారు దిల్ రాజు. అయితే ‘దేవర’ పోస్ట్‌పోన్ అయినట్టేనా అని అడగగా.. ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే మేము వస్తామని చెప్తున్నామంటూ ‘ఫ్యామిలీ స్టార్’ గురించి స్పష్టం చేశారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న పలు చిత్రాల్లో విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీ స్టార్’ కూడా ఒకటి. ఈ మూవీ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా.. పోటీ ఎక్కువగా ఉండడంతో సమ్మర్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. ఇప్పుడు ‘దేవర’ రిలీజ్ డేట్‌పై కన్నేసినట్టు దిల్ రాజు మాటల్లో అర్థమవుతోంది.
మాట్లాడగానే ఒప్పుకున్నారు..
‘ఈగల్’ సోలో రిలీజ్ అవుతుందని అప్పట్లో ఆ మూవీ నిర్మాతలకు మాటిచ్చారు దిల్ రాజు. కానీ ఇప్పుడు దానికి పోటీగా ‘ఊరి పేరు భైరవకోన’ వస్తున్నట్టు ప్రకటించింది. అదే విషయంపై మాట్లాడుతూ.. ‘ఊరి పేరు భైరవకోన’ పోస్ట్‌పోన్ చేయడానికి నిర్మాతలు ఒప్పుకున్నారని దిల్ రాజు ప్రకటించారు. ‘‘వాళ్లు ఈజీగానే ఒప్పుకున్నారు. ఫిబ్రవరీ 9న నాలుగు సినిమాలు ఉన్నాయి. 16న ఫ్రీగా ఉంది అని రాజేశ్, అనిల్‌కు నేనే చెప్పాను. మాట్లాడగానే వాళ్లు ఒప్పుకొని 16న వస్తున్నారు. ఒక వారం లేట్‌గా వాళ్లు వస్తున్నారు. ఎలాగో వాళ్ల పాట పెద్ద హిట్ అయ్యింది. సినిమా కూడా హిట్ కావాలని అందరం కోరుకుంటున్నాం. దాదాపు వాళ్లకు సోలో రిలీజ్‌లాగానే ఉంది. ఏదైనా చిన్న సినిమాలు వస్తాయేమో కానీ ఎక్కువశాతం వాళ్లది సోలో రిలీజ్ ఉంటుంది’’ అంటూ ‘ఊరి పేరు భైరవకోన’ పోస్ట్‌పోన్‌పై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఫైనల్‌గా ‘ఈగల్’ ఫిబ్రవరీ 9న, ‘ఊరి పేరు భైరవకోన’ ఫిబ్రవరీ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read: మన చేతుల్లో ఏం లేదు - ‘రాజా సాబ్’ విడుదల తేదీపై మారుతీ కామెంట్స్