KJQ Title Teaser: ఇంట్రెస్టింగ్ గా 'KJQ - కింగ్ జాకీ క్వీన్' టైటిల్ టీజర్ - హీరోగా దసరా దర్శకుడి సోదరుడు!
KJQ Title Teaser: దీక్షిత్ శెట్టి, శశి ఓదెల హీరోలుగా నటిస్తున్న సినిమాకి 'KJQ - కింగ్ జాకీ క్వీన్' అనే టైటిల్ ఖరారు చేసారు. మేకర్స్ తాజాగా టీజర్ ను రిలీజ్ చేసారు.
‘దియా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన కన్నడ యువ నటుడు దీక్షిత్ శెట్టి, తొలి మూవీతోనే దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యాడు. వెంటనే 'ముగ్గురు మొనగాళ్లు' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. హీరో నాని నిర్మించిన 'మీట్ క్యూట్' వెబ్ సిరీస్ లో నటించిన దీక్షిత్.. 'దసరా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. వాటిల్లో దసరా నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించే మూవీ కూడా ఉంది.
దీక్షిత్ శెట్టి హీరోగా 'దసరా' మేకర్స్ నుంచి ఓ సినిమా రాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.8 గా తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ టీజర్ ను మేకర్స్ తాజాగా ఆవిష్కరించారు. ఈ చిత్రానికి 'KJQ - కింగ్ జాకీ క్వీన్' అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు.
'KJQ - కింగ్ జాకీ క్వీన్' సినిమాలో దీక్షిత్ శెట్టి తో పాటుగా శశి ఓదెల మరో హీరోగా నటిస్తున్నాడు. శశి మరెవరో కాదు, 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కు స్వయానా సోదరుడు. ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో యుక్తి తారేజా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రిలీజైన ఈ మూవీ టైటిల్ టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.
'కింగ్ జాకీ క్వీన్' టైటిల్ టీజర్ చూస్తే, ఇది డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కే క్రైమ్ డ్రామా అనిపిస్తుంది. దీంట్లో సింహాసనం అధిష్టించే మోడరన్ కింగ్ గా దీక్షిత్ శెట్టిని చూపించారు. జాకీగా శశి ఓదెల కనిపించారు. ఇక బ్యూటీఫుల్ క్వీన్ గా, మోడర్న్ గర్ల్ గా యుక్తి తారేజా తన అంద చందాలతో ఆకట్టుకుంది. ఈ టీజర్ లో రెండు గన్స్ తో పాటుగా ఒక గులాబీని ప్రధానంగా చూపించారు. దీన్ని బట్టి కథంతా ఇదే థీమ్ తో ఉంటుందనీ, ఈ ముగ్గురి పాత్రల మధ్యనే నడుస్తుందనే విషయం అర్థమవుతుంది.
'కింగ్ జాకీ క్వీన్' చిత్రానికి కె.కె దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణచంద్ర తేజస్వి సంగీతం సమకూరుస్తున్నారు. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. శ్రీకాంత్ రామిశెట్టి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. శేఖర్ యలమంచిలి దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మేకర్స్ త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
View this post on Instagram
కాగా, ఎస్ఎల్వి సినిమాస్ ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ మొదటి నుంచీ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మిస్తూ, మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. కాకపోతే అందుకు తగినట్లుగా సరైన విజయాలు అందుకోలేకపోయారు. 'పడి పడి లేచె మనసు' 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 'విరాట పర్వం' 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి చిత్రాలు సక్సెస్ ఆశించిన సక్సెస్ అందించలేదు. అయితే నానితో చేసిన 'దసరా' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మళ్లీ ట్రాక్ లోకి ఎక్కారు. ఇప్పుడు 'కింగ్ జాకీ క్వీన్' అంటూ రాబోతున్నారు.
Also Read: 'ఊరు పేరు భైరవకోన' డైరెక్టర్ నుంచి మరో సినిమాటిక్ అడ్వెంచర్!