Dhanush Movie Shooting: అలిపిరిలో ఆగిపోయిన ధనుష్ మూవీ షూటింగ్, అనుమతులు రద్దు - అసలు ఏం జరిగింది?
Dhanush: అలిపిరిలో కోలీవుడు స్టార్ ధనుష్ కొత్త సినిమా షూటింగ్ నిలిచిపోయింది. తిరుపతిలో ట్రాఫిక్ ఇబ్బందులతో పోలీసులు షూటింగ్ అనుమతి రద్దు చేశారు
కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush), డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ అర్థాంతరంగా నిలిచిపోయింది. తిరుపతి (Tirupathi) నుంచి తిరుమల వెళ్లే ప్రధాన వీధుల్లో షూటింగ్ కోసం చిత్రబృందం ముందుగానే అన్ని అనుమతులు తీసుకుంది. తీరా షూటింగ్ మొదలుపెట్టే సరికి పెద్దఎత్తున ట్రాఫిక్ జాం అయ్యింది. తిరుమల (Tirumala)కు వెళ్లే భక్తులు, తిరిగి వచ్చే భక్తులతో పాటు పాఠశాలలకు, ఆఫీసులకు వెళ్లే వారితో ఒక్కసారిగా రోడ్లు కిటకిటలాడిపోయాయి.
ఒకపక్క సినిమా షూటింగ్, మరోపక్క ట్రాఫిక్ (Traffic) నిలిచిపోవడంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకదశలో ట్రాఫిక్ క్లియర్ చేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. దీంతో బుధవారం జరగాల్సిన షూటింగ్‌కు పోలీసులు(Police) అనుమతి రద్దు చేశారు. దీనిపై చిత్రబృందం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అన్ని అనుమతులు ముందుగానే తీసుకుని.. ఎంతో ఖర్చు చేసి షూటింగ్ మొదలుపెడితే ఇప్పుడు అర్థాంతరంగా నిలిపేశారని, దానివల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందిపడటంతో బీజేపీ (Bjp) నేతలు రంగంలోకి దిగారు. టెంపుల్ సిటీలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీతో ఉన్న రోడ్లే ట్రాఫిక్‌కు సరిపోక ఇబ్బందులు పడుతుంటే.. బహిరంగ ప్రదేశాల్లో సినిమా షూటింగ్‌లకు ఎలా అనుమతించారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆధ్మాత్యిక క్షేత్రం.. అది తిరుమలకు వెళ్ళే రోడ్డు.. ఎలా షూటింగ్ అనుమతి ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలిపిరితో పాటు నంది కూడలి, గోవిందరాజు స్వామి ఆలయంలో షూటింగ్‌కు కూడా పోలీసులు అనుమతించారు. రెండు రోజులు జరగనున్న సినిమా చిత్రీకరణ కోసం పోలీసులు చిత్ర బృందానికి కొన్ని షరతులు కూడా విధించారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకూడదని చెప్పారు. సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల బందో బస్తుకు కూడా సిబ్బందిని ఇవ్వలేమని తెలిపారు. అయితే, ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడంలో చిత్రయూనిట్ విఫలమైందని, అందుకే షూటింగ్ అనుమతులను రద్దు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
మీడియా బృందంపై దాడి
చిత్రబృందంలో కొందరు అత్యుత్సాహంతో మీడియా ప్రతినిధులపైనా దాడికి పాల్పడటం వివాదస్పదమైంది. షూటింగ్ వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ ను చిత్రీకరిస్తున్న ఓ వీడియోగ్రాఫర్ పట్ల చిత్రబృందం దురుసుగా ప్రవర్తించింది. కెమెరా లాక్కుని దుర్భాషలాడటంతో మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు
తిరుపతిలో సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వడం వల్ల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందిపడ్డారంటూ బీజేపీ నేతలు ఈస్ట్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తక్షణం అనుమతులు రద్దు చేయాలని కోరడంతో పాటు భవిష్యత్ లోనూ తిరుమల, తిరుపతిలో షూటింగ్ లకు అనుమతి ఇవ్వొద్దంటూ కోరారు.
ప్రత్యేక పాత్రలో నాగార్జున
ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున (Nagarjuna) ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ధనుష్‌కు ఇది రెండో తెలుగు చిత్రం కావడం విశేషం. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read: ఆ స్టార్ హీరోతో వరలక్ష్మీ శరత్‌కుమార్ పెళ్లి - నిజమెంత?