Dhanush Movie Shooting: అలిపిరిలో ధనుష్ మూవీ షూటింగ్ క్యాన్సిల్ కాలేదట, అసలు విషయం చెప్పిన మేకర్స్!
Dhanush Movie Shooting: ఇటీవల తిరుమల అలిపిరి దగ్గర ధనుష్ సినిమా షూటింగ్ జరిగింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులకు ఇబ్బందులు కలగడంతో అధికారులు షూటింగ్ అనుమతులు రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి.
Dhanush Movie Shooting: కోలీవుడ్ హీరో ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్నది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తిరుపతిలో జరిగింది. అలపిరి దగ్గర కీలక సన్నివేశాలను షూట్ చేశారు. అయితే, తిరుమలకు వెళ్లే ప్రధాన రహదారిలో షూటింగ్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అలిపిరిలో షూటింగ్ నిలిపివేత!
ఒకపక్క సినిమా షూటింగ్, మరోపక్క ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకదశలో ట్రాఫిక్ క్లియర్ చేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. దీంతో షూటింగ్ నిలిపివేయాలని సినిమా యూనిట్ కు సూచించారు. పోలీసుల తీరుపై చిత్రబృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అన్ని అనుమతులు ముందుగానే తీసుకుని.. ఎంతో ఖర్చు చేసి షూటింగ్ మొదలుపెడితే ఇప్పుడు అర్థాంతరంగా నిలిపేశారని, దానివల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తుందని వెల్లడించినట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ, షూటింగ్ రద్దు వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
అలిపిరి షూటింగ్ పై స్పందించిన నిర్మాత మోహన్ రావు
తాజాగా అలిపిరి షూటింగ్ వ్యవహారంపై నిర్మాత మోహన్ రావు స్పందించారు. షూటింగ్ రద్దు చేయలేదని చెప్పారు. అనుకున్నట్లుగానే చిత్రీకరణ కంప్లీట్ చేసినట్లు తెలిపారు. వాస్తవానికి ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 4 గంటలపాటు అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. “మేము అలిపిరిలో షూట్ చేయడానికి అవసరమైన అనుమతులను తీసుకున్నాం. షూటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సి ఉంది. కానీ, లైటింగ్ సరిగా లేకపోవడంతో షూటింగ్ 45 నిమిషాలు ఆలస్యం అయింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా మంది అక్కడ గుమిగూడారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో అక్కడి నుంచి తిరుపతిలోని ఇతర ప్రాంతాల్లో షూట్ చేశాం. ఒకే ఒక్క రోజు తిరపతిలో షూటింగ్ కొనసాగింది” అని వివరించారు. ఈ సినిమాలోని ఓ ఫ్రేమ్ లో తిరుమల దేవస్థానం ఉండాలనే ఉద్దేశంతోనే అక్కడ షూట్ చేసినట్లు వివరించారు. వాస్తవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా షూట్ చేయాలని భావించినా, జనాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరకోవడంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడినట్లు చెప్పారు. భక్తులు, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే చాలా త్వరగా షూట్ కంప్లీట్ చేయాలి అనుకున్నట్లు తెలిపారు.
ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగార్జున
ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ధనుష్‌కు ఇది రెండో తెలుగు చిత్రం కావడం విశేషం. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికిపైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.