Dhanush: ధనుష్‌కు అండగా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ - తమిళ నిర్మాతలు, హీరో గొడవ ముదురుతోందా?
ధనుష్‌కు సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అండగా నిలబడింది. తమిళ నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని లేఖ రాసింది. అసలు, ఈ గొడవ ఏమిటి? ఏమైంది? అంటే...
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్స్ ఏవీ స్టార్ట్ చేయకూడదని పేర్కొంది. నవంబర్ 1 నుంచి షూటింగ్స్ బంద్ చేయాలని డిసైడ్ చేసింది. ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక ధనుష్ (Dhanush) పేరు హైలైట్ అయ్యింది. నిర్మాతల నుంచి ఆయన అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయడం లేదని, ఆయన సినిమాలకు తమ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అతడికి అండగా 'ది సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (The South Indian Artistes Association) రంగంలోకి దిగింది.
ధనుష్ మీద కంప్లైంట్స్ లేవు, రాలేదు!
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Tamil Film Producers Council) నుంచి ధనుష్ మీద ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్స్ లేవని 'ది సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' వివరించింది. అంతే కాదు, అతడి మీద కొత్తగా కంప్లైంట్స్ ఏవీ నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఇరు వర్గాలు కూర్చుని చర్చించుకుంటే సమస్యకు పరిష్కార మార్గం వెతకడం సులభం అవుతుందని సూచించింది.
నిర్మాతల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం!
కొత్త సినిమాల చిత్రీకరణ ప్రారంభించకూడదని, షూటింగ్ బంద్ చేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు 'ది సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' తెలియజేసింది. ఆ నిర్ణయం వెలువరించే ముందు కనీసం తమను సంప్రదించలేదని ఓ లేఖలో వివరించింది. నిర్మాతల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మధ్య చర్చలు
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ది సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మధ్య జూన్ 21న మీటింగ్ జరిగింది. నిర్మాతల నుంచి మురళీ రామసామి, కథిరేసన్ హాజరు అవ్వగా... నటీనటుల తరఫున నాజర్, పూచి ఎస్ మురుగన్ సమావేశంలో పాల్గొన్నారు. 2007లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అప్పటి వరకు ఉన్న ఫిర్యాదులు అన్నటినీ పరిష్కరించినట్టు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తెలిపింది.
ధనుష్ పేరు ఎందుకు హైలైట్ అవుతోంది? గొడవ ఏమిటి?
ధనుష్ 'రాయన్' సినిమా జూలై 26న థియేటర్లలోకి వచ్చింది. మంచి స్పందనతో పాటు వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో అతని పేరు హైలైట్ కావడం, కొత్త సినిమాల షూటింగ్స్ బంద్ చేయడానికి మూల కారణం అతడు అన్నట్టు ప్రాజెక్ట్ కావడం ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. అసలు ఈ గొడవకు, ఆయనకు సంబంధం ఏమిటి? అంటే...
Also Read: 'రాయన్'కు మహేష్ బాబు రివ్యూ - ధనుష్ సినిమాపై సూపర్ స్టార్ ట్వీట్, ఏమన్నాడంటే?
తమిళ నిర్మాతల నుంచి ధనుష్ అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయడం లేదని, అసలు సహకరించడం లేదని పలువురు నిర్మాతలు ఆరోపిస్తున్నట్టు కోలీవుడ్ టాక్. తాము 2023లో ధనుష్‌కు అడ్వాన్స్ ఇచ్చామని, అయినా సరే అతను చిత్రీకరణకు రావడం లేదని శ్రీ తేనండాళ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. చూస్తుంటే... ఈ గొడవ మరింత ముందుకు వెళ్లేట్టు కనబడుతోంది.
Also Read: హరీష్ శంకర్ vs టాలీవుడ్ మీడియా... స్టార్టింగ్ to 'మిస్టర్ బచ్చన్' వరకు - ఏం జరిగిందో తెల్సా?