(Source: ECI/ABP News/ABP Majha)
హ్యపీగా ఉన్నా, అది ఫేక్ న్యూస్ - ‘మృతి’ వార్తలపై సుధాకర్ వీడియో సందేశం
సీనియర్ నటుడు సుధాకర్ మృతి చెందినట్లుగా గత కొన్ని రోజులుగా ఫేక్ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ తప్పుడు కథనాలంటూ ఆయన స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసారు. సుధాకర్ ఏమన్నారంటే..
సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమైన వార్త, ఏది ఫేక్ న్యూస్ అనేది తెలుసుకోవడం కష్టమైపోయింది. ఇటీవల కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలపై తప్పుడు వార్తలను ప్రచారం బాగా ఎక్కువైపోయింది. కొన్ని మీడియా సంస్థలు, వెబ్ సైట్లు అత్యుత్సాహంతో ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా తమ వార్తల్లో చంపేస్తున్నాయి. చాలా కాలంగా తెర మీద కనిపించని సీనియర్ నటీనటులు కొందరు మరణించినట్లుగా రూమర్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో సదరు సినీ ప్రముఖులు లైవ్ లోకి వచ్చి, తాము బ్రతికే ఉన్నామని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు నటుడు సుధాకర్ మీద కూడా అలాంటి ఫేక్ వార్తే వచ్చింది.
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ మృతి చెందారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అయింది. పలు మీడియా సంస్థలు కూడా నటుడు కన్నుమూశారంటూ అదే వార్తను క్యారీ చేశాయి. ఈ నేపథ్యంలో వాటిని ఖండిస్తూ సుధాకర్ ఓ వీడియోలో మాట్లాడారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. దయచేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరారు.
"అందరికీ నమస్కారం. నా మీద వచ్చినవి ఫేక్ న్యూస్. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అలాంటివి స్ప్రెడ్ చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ వెరీ హ్యాపీ" అని సుధాకర్ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఆయన మరణించాడనే వార్తలకు చెక్ పెట్టారు. సుధాకర్ పై ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేయడంపై సినీ అభిమానులు మండిపడుతున్నారు. బ్రతికున్న మనిషిని చనిపోయాడని చెప్పడం సరికాదని ఫైర్ అవుతున్నారు.
View this post on Instagram
కొద్ది రోజుల క్రితం సీనియర్ నటుడు శరత్ బాబు చనిపోయినట్టు ఫేక్ వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఆయన హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఇలాంటి ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేశారు. దీంతో ఈ విషయంపై శరత్ బాబు ఫ్యామిలీ సభ్యులు, ఆసుపత్రి వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆరోగ్యం విషమించడంతో శరత్ బాబు రెండు రోజుల క్రితం కన్నుమూశారు. కానీ ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడే, చనిపోయారు అంటూ ప్రచారం జరగడం అనేది.. ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధపెట్టింది. ఇప్పుడు సుధాకర్ విషయంలోనూ ఇలానే తప్పుడు వార్తలు నివేదించారు. అయితే ఇప్పుడు ఆయన స్వయంగా మాట్లాడటంతో, హ్యాపీగానే ఉన్నారని క్లారిటీ వచ్చింది.
నిజానికి సుధాకర్ ఆరోగ్యం గురించి ఇలాంటి రూమర్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ ఏమీ కాదు. 2010లో ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లారు. ఆ సమయంలోనే సుధాకర్ ఇక లేరని ఫేక్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సమయంలోనే సుధాకర్ ఇక లేరని ఫేక్ వార్తలు పుట్టించారు. అయితే వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో, 2015 సంవత్సరంలో తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత కూడా తాను సినిమాల్లో నటించబోతున్నట్టు ప్రకటించారు కానీ.. పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం సుధాకర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు చిరంజీవి, సుధాకర్ రూమ్మేట్స్ గా ఉండేవారు. భారతీరాజా తెరకెక్కించిన ‘కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్’ అనే సినిమాతో సుధాకర్ బేతా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తెలుగు తమిళ భాషల్లో దాదాపు 400 సినిమాలలో నటించారు. పాత తరం హీరోల దగ్గర నుంచి ఇప్పటి స్టార్ హీరోల వరకూ, అందరికీ స్నేహితుడుగా నటించడం సుధాకర్ కే చెల్లింది. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ మారారు. చిరంజీవితో కలిసి ‘యముడికి మొగుడు’ వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ప్రస్తుతం పూర్తిగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. సుధాకర్ చివరగా 'ఇ ఈ' అనే చిత్రంలో కనిపించారు.