Hyderabad News: చిత్రపురి కాలనీపై అవినీతి ఆరోపణలు - ఆధారాలతో చర్చకు రావాలంటూ ప్రెసిడెంట్ సవాల్
Chitrapuri Allegations: చిత్రపురి కాలనీలో నిర్మాణాలకు సంబంధించి అవినీతి ఆరోపణలపై ప్రెసిడెంట్ అనిల్ కుమార్ స్పందించారు. ఆరోపించేవారు సరైన ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు.

Vallabhaneni Anil Kumar Clarifies On Chitrapuri Colony Corruption Allegations: హైదరాబాద్ చిత్రపురి కాలనీపై గత కొన్నేళ్లుగా ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. వాటిపై తాజాగా చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలు, టవర్స్‌కు సంబంధించి మాట్లాడారు.
ఆధారాలుంటే బయటపెట్టాలి
చిత్రపురి కాలనీలో 6 నెలలకోసారి సమావేశంలో అన్నీ సమస్యలపై చర్చించుకుంటామని ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. 'కుటుంబ సభ్యుల్లా సమస్యలపై చర్చించుకుంటాం. ఇటీవల కొంతమంది ఛలో ఫిలిం ఛాంబర్, ఛలో గాంధీభవన్ అంటూ బయటికి వస్తున్నారు. కాలనీకి సంబంధం లేని వారు కూడా రూ.కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. సరైన ఆధారాలుంటే బహిరంగ చర్చకు రావాలి.
కాలనీలో 4,713 కుటుంబాలు ఇప్పటికే నివాసం ఉంటున్నారు. రూ.700 కోట్ల నుంచి రూ.850 కోట్ల మధ్య ఉన్న చిత్రపురి కాలనీపై సుమారు రూ.3 వేల కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఈ స్థలం ఉచితంగా రాలేదు. కోర్టులో ఉన్న కొన్ని విషయాలపై నేను మాట్లాడలేను.' అని తెలిపారు.
అప్పుడే పర్మిషన్ తీసుకున్నాం
చిత్రపురి కాలనీలో జాయిన్ కావాలంటే కచ్చితంగా సినీ కార్మికులయ్యే ఉండాలని... ప్రస్తుతానికి సుమారు 60 శాతం మాత్రమే అలా ఉన్నారని అనిల్ కుమార్ తెలిపారు. '2009లోనే పర్మిషన్లు తీసుకుని రో హౌసులు నిర్మించగా... 2017లో కూడా మరికొన్ని పర్మిషన్లతో G+2గా మరి కొన్ని రో హౌసులు నిర్మించాం. అన్నింటినీ పూర్తి అనుమతితోనే నిర్మించినా... కొంతమంది కేసులు పెట్టడంతో నిర్మాణాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న రేట్లు కాలనీపై ఉన్న అప్పును దృష్టిలో ఉంచుకునే నిర్ణయించాం. సఫైర్ సూట్ నిర్మించేందుకు అన్నీ పర్మిషన్లతోనే ముందుకెళ్తున్నాం. మొత్తం 51 అంతస్థుల భవనంలో సఫైర్ సూట్ ప్లాన్ చేస్తున్నాం.' అని చెప్పారు.
Also Read: ప్రొడ్యూసర్ కమ్ హీరోను చెప్పుతో కొట్టిన హీరోయిన్ - అసలు రీజన్ ఏంటంటే?
అందరికీ ప్లాట్స్
కాలనీలో చిత్ర పరిశ్రమకు చెందిన ఎవరికీ అన్యాయం జరగదని... సరైన మెంబర్షిప్ ఉంటే కచ్చితంగా వారికి ప్లాట్ వచ్చేందుకు పూర్తి సహకారం ఉంటుందని అనిల్ తెలిపారు. 'చిత్రపురి కాలనీలో నిరంతరం మంజీరా నీటి సరఫరా ఉంటుంది. సెప్టెంబర్‌లో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్‌లో ఆరోపణలు చేసే వారు వివరణ ఇస్తే దాని ఆధారంగా చర్యలు ఉంటాయి. కాలనీలోని సభ్యులపై ఎలాంటి అప్పు పడదు. 2023 తర్వాత ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు. ఒక వేళ అలా చేసిన 336లో సినీ కార్మికులు కాని వారు ఎవరైనా ఉంటే వారిని తీసేయడానికి కమిటీ సపోర్ట్ చేస్తుంది.' అని చెప్పారు.
సినీ జర్నలిస్టులకు కూడా ప్లాట్స్
మూవీ జర్నలిస్టులకు కూడా చిత్రపురిలో ఫ్లాట్స్ ఇస్తామని... డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు అలాగే 24 క్రాఫ్ట్స్‌లో తమ అసోసియేషన్ ద్వారా వస్తే ఫ్లాట్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నట్లు చెప్పారు అనిల్ కుమార్. 'గతంలో వేలం వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చదలవాడ శ్రీనివాస్ గారు అండగా నిలబడ్డారు. 'ప్రభుత్వం ఇప్పటికే వేసిన కమిటీ వారు ఎవరైనా సినీ కార్మికులకు న్యాయంగా ఫ్లాట్ వెళ్తుంది అని చెప్తే కచ్చితంగా వారికి ఫ్లాట్ ఇస్తాం.' అని స్పష్టం చేశారు.
సభ్యులను తీయాలంటే 2 ప్రక్రియలు మాత్రమే ఉంటాయని... ఒకటి సరైన టైంలో డబ్బులు కట్టకపోవడం వల్ల... లేదా సినీ కార్మికులు కాని వారిని తీసేస్తామని చెప్పారు అనిల్ కుమార్. ఈ రెండు కారణాలు కాకుండా సభ్యులను తీసేసే అవకాశం ఎవరికీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో చిత్రపురి కాలనీకి సంబంధించిన సెక్రటరీ దొరై, కమిటీ మెంబర్లు లలిత, రామకృష్ణ, రఘు, లహరి తదితరులు పాల్గొన్నారు.






















