JVAS: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్.. హీరో, హీరోయిన్, దర్శకుడెవరో చెప్పేసిన మెగాస్టార్ చిరంజీవి
JVAS: ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేస్తే, అందులో ఎవరెవరు నటిస్తే బాగుంటుందో చిరు తెలిపారు. హీరో, హీరోయిన్, దర్శకుడి పేరు కూడా ఆయన రివీల్ చేశారు. వారెవరంటే..

JVAS: మెగాస్టార్ చిరంజీవి, అందాల భామ శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు బి.ఏ తెరకెక్కించిన సోషియో ఫాంటసీ వండర్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. వైజయంతీ మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం విడుదలై 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు అప్పటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు యాంకర్ సుమకు సుమారు గంట పాటు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి ఆసక్తికర విషయాలు చెప్పడంతో పాటు, ఈ సినిమాకు సీక్వెల్ అంటూ వస్తే.. తన మనసులో ఎవరెవరిని ఊహించుకుంటున్నారో చెప్పారు.
ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.. ఈ సినిమా రిలీజై అప్పుడే 35 ఏళ్లు అవుతోందా? అప్పటి రోజులు, షూటింగ్‌లో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటుంటే ఇప్పుడే కళ్ల ముందే జరిగినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా కంటే ముందే శ్రీదేవితో రెండు సినిమాలు చేశాను. కానీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమానే మా ఫస్ట్ సినిమా అని అందరూ భావిస్తారు. ఈ సినిమా టైమ్‌కి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలు వరుసగా మూడు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ మూవీ అనుకున్న టైమ్‌లో చాలా మంది ఆయనతో వద్దని సలహాలు వచ్చారు. కానీ నేను, నిర్మాత దత్ మాత్రం ఆయన చేస్తేనే ఈ సినిమా చేయాలి.. లేదంటే ఈ సినిమానే వద్దని అనుకున్నాం.
ఎప్పుడూ సినిమా రిజల్ట్‌ను బట్టి మనిషి టాలెంట్‌ను అంచనా వేయకూడదు. ఓ టెక్నీషియన్‌గా దర్శకేంద్రుడు ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కసిగా పని చేశారు. అందరి ఇన్‌పుట్స్ తీసుకుని ఈ చిత్రాన్ని చెక్కారు. దాదాపు ఈ మూవీ కోసం 27 మంది రైటర్స్ పని చేశారు. నేను కూడా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో 35 రోజులు పని చేశాను. ఇళయరాజా ఈ సినిమాలోని పాటలను మూడు, నాలుగు గంటల్లో కంపోజ్ చేసేశారు. ‘అబ్బనీ తీయని దెబ్బ’ పాటని ఉదయం స్టార్ట్ చేసి మధ్యాహ్నానికే ఇచ్చేశారు. ఈ పాటను మేము ఒకటిన్నర రోజుల్లోనే షూట్ చేసేశాం. ఫస్ట్ ఈ కథను కొన్ని రోజులు మానస సరోవరం కాకుండా, చంద్రమండలం మీద అని అనుకున్నాం. చివరకు మానస సరోవరం అయితేనే నమ్మశక్యంగా ఉంటుందని అంతా ఫిక్సయ్యాం. ఆ మానస సరోవరం సెట్‌ని విజయ వాహినీ స్టూడియోలో దర్శకేంద్రుడు అద్భుతంగా క్రియేట్ చేశారు.
ఈ రీ రిలీజ్‌లో శ్రీదేవిని చాలా మిస్ అవుతున్నాం. ఈ రీ రిలీజ్‌ను ఆమెకు అంకితం చేస్తున్నాం. ఇందులో ‘దినక్కుతా’ అనే పాటను చివరగా షూట్ చేశాం. ఆ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. శ్రీదేవి డేట్స్ కేవలం ఒకటిన్నర రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఆమె ఫారెన్ వెళ్లిపోతుంది. ఆ టైంలో నాకు తీవ్ర జ్వరం వచ్చింది. అసలు నిలబడే ఓపిక లేదు, రిహర్సల్స్ చేసే శక్తి లేదు. అయినా సరే ఎలాగోలా షూట్ చేశాం. అంతా అయిపోయి, గుమ్మడి కాయ కొట్టేశారు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా పడిపోయాను. వెంటనే పక్కనే ఉన్న విజయ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సుమారు రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాను. అప్పుడు నాకు మలేరియా ఫీవర్ అని తెలిసింది.
విన్సెంట్ ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్‌గా మలిచారు. భూలోకం నుంచి ఇంద్రలోకంలోకి వెళ్లేటప్పుడు ఇంటి పైకప్పు తెరుచుకునే సన్నివేశాన్ని ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం లోపు ఫినిష్ చేశారు. ఇప్పుడు కనుక ఆ షాట్ తీయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో చెప్పలేం. అలాంటిది ఆ టైంలోనే ఆయన వండర్స్ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో ప్రభుదేవా చేసిన ‘అబ్బనీ తీయని దెబ్బ’ అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలిచింది. సుందరం మాస్టారు భయపడుతున్నా, నేను మాత్రం ప్రభుదేవాకు పాటలు ఇచ్చేవాడిని. 16 ఏళ్ల వయసున్న ప్రభుదేవాలో ఉన్న టాలెంట్ ఏంటో నేను బాగా గమనించాను. అందుకే ప్రత్యేకంగా ప్రభుదేవాకి పాటలు ఇస్తుండేవాడిని.
సినిమాలో ఎంతో శక్తి ఉన్న ఆ రింగుని చేప మింగిన తర్వాత ఏం జరిగింది? అనే పాయింట్‌ను అప్పుడే ఎండ్ కార్డులో వేసి ఉంటే, ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడో వచ్చి ఉండేది. ఇప్పుడీ సినిమాకు కనుక సీక్వెల్ తీస్తే అందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ చేస్తే బాగుంటుంది. ఈ సీక్వెల్‌ను దర్శకేంద్రుడి పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ తీస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. నిర్మాతలు ఎలాగూ అశ్వనీదత్ పిల్లలే. ఇప్పటితరం ఆ మూవీని థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేసి ఉండరు. ఈ తరం అంతా ఈ రీ రిలీజ్ చూడండి. అందరూ ఫ్యామిలీతో వెళ్లి సినిమాను చూడండి. చక్కగా ఎంజాయ్ చేయండని చెప్పుకొచ్చారు.
Also Read: సుక్కు చేయలేనిది... రాజమౌళి చేశాడు... మహేష్ కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూమెంట్





















