Chiranjeevi - Brahmanandam : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'
Chiranjeevi Appreciates Brahmanandam : కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన తారలుగా రూపొందిన సినిమా 'రంగమార్తాండ'. ఇందులో నటనకు గాను బ్రహ్మిని చిరు, చరణ్ ప్రశంసించారు.
కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన తారలుగా రూపొందిన సినిమా 'రంగమార్తాండ' (Rangamarthanda Movie). 'మన అమ్మానాన్నల కథ'... అనేది ఉపశీర్షిక. ఉగాది కానుకగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలోకి వచ్చిందీ సినిమా. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా.
కంటతడి పెట్టిన బ్రహ్మానందం
'రంగమార్తాండ'లో బ్రహ్మానందం (Brahmanandam) నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. తెలుగులో సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఒకటి ఆరా మినహాయిస్తే మెజారిటీ సినిమాల్లో కామెడీ వేషాలు వేశారు. అటువంటి బ్రహ్మిలో సీనియర్ నటుడిని కృష్ణవంశీ తెరపై ఆవిష్కరించారు. వినోదం కాకుండా నటనతో బ్రహ్మానందం విశ్వరూపం చూపించారు. ఆయన నటన తమ గుండెలను కదిలించిందని చాలా మంది చెబుతున్నారు. సామాన్యులతో పాటు స్టార్ హీరోలను సైతం బ్రహ్మి నటనకు మంత్రముగ్దులు అవుతున్నారు.
బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం
బ్రహ్మానందం నటించిన పాత్రకు మంచి పేరు రావడంతో ఆయన్ను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు.
Also Read : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
హౌస్ ఫుల్ మూవీస్, రాజ్య శ్యామల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కాలిపు మధు, వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు రాయగా... లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు. లక్ష్మీ భూపాల రాసిన షాయరీకి చిరంజీవి తన గళం అందించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'రంగమార్తాండ' థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా విడుదలైంది. సంక్రాంతి సినిమాలు 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య'తో మైత్రి డిస్ట్రిబ్యూషన్ మొదలైన సంగతి తెలిసిందే. 'కోనసీమ థగ్స్' సినిమా కూడా విడుదల చేసింది.
Also Read : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
View this post on Instagram
చిరంజీవి షాయరీలో ఏముంది? అనేది చూస్తే...
''నేనొక నటుడ్ని
చమ్కీల బట్టలేసుకుని
అట్ట కిరీటం పెట్టుకుని
చెక్క కత్తి పట్టుకుని
కాగితపు పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే
చక్రవర్తిని నేను
కాలాన్ని బంధించి శాసించే నియంతను నేను
నేనొక నటుడ్ని
నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని
నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని
వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని
వేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుడ్ని
నేనొక నటుడ్ని
నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను
హరివిల్లుకు ఇంకో రెండు రంగులేసి నవరసాలూ మీకిస్తాను
నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బతుకుతుంటాను
నేనొక నటుడ్ని
జగానికి జన్మిస్తాను
సగానికి జీవిస్తాను
యుగాలకు మరణిస్తాను
పోయినా బ్రతికుంటాను
నేనొక నటుడ్ని
లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్ని
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని
ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని
నేనొక నటుడ్ని
గతానికి వారధి నేను
వర్తమాన సారథి నేను
రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను
పూటపూటకూ రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను
నేనొక నటుడ్ని
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను
నరం నరం నాట్యమాడే నటరాజు రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను
ప్రచండంగా ప్రకాశించు రంగమార్తాండుడ్ని నేను
నేనొక నటుడ్ని
అసలు మొహం పోగొట్టుకున్న అమాయకుడ్ని
కానీ 9 తలలు ఉన్న నటరావణుడ్ని
నింగి, నేల రెండు అడుగులైతే
మూడో పాదం మీ మనసుల మీద మోపే వామనుడ్ని
మీ అంచనాలు దాటే ఆజానుబాహుడ్ని
సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని
నేనొక నటుడ్ని
అప్సరసల ఇంద్రుడ్ని
అందుబాటు చంద్రుడ్ని
అభిమానుల దాసుడ్ని
అందరికీ ఆప్తుడ్ని
చప్పట్లను భోంచేస్తూ
ఈలలను శ్వాసిస్తూ
అనుక్షణం జీవించే అల్పసంతోషిని నేను
మహా అదృష్టవంతుడ్ని నేను
తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే
సగటు కళాకారుడ్ని నేను
ఆఖరి శ్వాస వరకూ నటనే ఆశ నాకు
నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు''