Chiranjeevi Song: కొరియా షోలో చిరంజీవి ‘గోలిమార్’ సాంగ్ - తెలుగులో ఇరగదీసిన కొరియన్ సింగర్స్
Chiranjeevi Song: చిరంజీవి ఐకానిక్ సాంగ్ ను కొరియన్ సింగర్స్ అద్భుతం పాడి ఆకట్టుకున్నారు. తాజాగా అక్కడ సింగింగ్ షో స్టేజి మీద ఆలపించి అలరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Chiranjeevi Donga Movie Song: ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మెగాస్టార్ స్థాయికి చేరిన నటుడు చిరంజీవి. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి అలరించారు. చక్కటి నటన అంతకు మించి డ్యాన్సులతో అభిమానులను మెస్మరైజ్ చేశారు. తన అసమాన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. సుమారు 7 పదుల వయసు దగ్గర పడుతున్నా, కుర్ర హీరోలకు మించి జోష్ తో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు.
ఇండస్ట్రీని ఊపు ఊపిన ‘కాష్మోరా కౌగిలిస్తే’ సాంగ్
ఇక చిరంజీవి నటించిన ‘దొంగ‘ సినిమాలోని ‘కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో’ అనే పాట ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపింది. గోలీమార్ అంటూ మొదలయ్యే ఈ పాట ప్రేక్షకులను ఎంతో అలరించింది. మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్ ఆల్బంను బేస్ చేసుకుని ఈ పాటను రూపొందించారు. ఇందులో చిరంజీవి స్టెప్పులు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటని చూసిన తర్వాత లాటిన్ అమెరికా, అమెరికా, ఐరోపా దేశాల సినీ అభిమానులు చిరంజీవిని ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పిలవడం మొదలు పెట్టారు. ఈ పాటను దివంగత గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి రాయగా, దివంగత గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.
కొరియన్ షోలో ‘కాష్మోరా కౌగిలిస్తే’ పాట పాడిన సింగర్స్
తాజాగా ఇదే పాటను కొరియన్ సింగర్స్ ఓ సింగింగ్ కాంపిటీషన్ లో పాడటంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. అక్కడి టీవీ ఛానెల్ ఓ పాటల షో నిర్వహిస్తోంది. పలువురు సింగర్స్ ఈ షోలో పాల్గొన్నారు. చక్కటి పాటలతో అలరించారు. అదే షోలో ఓ సింగర్ చిరంజీవి ‘కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో’ అనే పాటను పాడి అలరించారు. అచ్చం చిరంజీవి మాదిరిగానే రెడ్ కలర్ షర్ట్ వేసుకుని, స్టైల్‌గా స్టెప్పులు వేస్తూ పాటపాడి అలరించారు. ఆయన పాడుతుంటే షో జడ్జిలతో పాటు తోటి కంటెస్టెంట్లు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, అది ఒరిజినల్ వీడియోనా, మార్ఫింగా.. లేదా అలా క్రియేట్ చేశారా అనే చర్చ కూడా నడుస్తోంది.
View this post on Instagram
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘దొంగ‘
1985లో ‘దొంగ‘ సినిమాను దివంగత దర్శకుడు ఎ కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి, రాధ హీరో, హీరోయిన్లుగా నటించారు. రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్య, గొల్లపూడి మారుతీ రావు సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ సినిమాగా ‘దొంగ‘ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద టి. త్రివిక్రమరావు నిర్మించారు. చక్రవర్తి సంగీతం అందించారు. 14 మార్చి 1985న విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. చిరంజీవి కెరీర్ కు మాంచి బూస్టింగ్ ఇచ్చింది. ఈ సినిమా తమిళంలోనూ డబ్బింగ్ వెర్షన్ విడుదల అయ్యింది. అక్కడ ఈ సినిమాకు ‘కొలై కరణ్‘ అని పేరు పెట్టారు.
Read Also: ఆ పాట విని ఫ్యూజులు ఎగిరిపోయాయ్, 'నా పెట్టే తాళం' సాంగ్ పై సత్యశ్రీ షాకింగ్ కామెంట్స్