Bholaa Shankar: 'తమ్ముడు' పక్కన పెట్టేసిన రీమేక్ తో 'అన్నయ్య' హిట్టు కొడతాడా?
చిరంజీవి 'భోళా శంకర్' మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. అయితే ఇది గతంలో మెగా బ్రదర్ పవన్ కల్యాణ్ వదిలేసిన రీమేక్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇది 2015లో వచ్చిన 'వేదాళం' అనే తమిళ చిత్రానికి అధికారిక రీమేక్. అక్కడ అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కంటెంట్ ని దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చిరు తెలుగులోకి తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ రీమేక్ మూవీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సింది.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. పవన్ కల్యాణ్ హీరోగా 2016 అక్టోబర్ 11న ఓ సినిమాని లాంచనంగా ప్రారంభించారు. సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.రత్నం సమర్పణలో శ్రీ సాయిరాం క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 4గా ఈ ప్రాజెక్ట్ పేర్కొనబడింది. 'జిల్లా' ఫేమ్ ఆర్.టి. నేసన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇది 'వేదాళం' చిత్రానికి రీమేక్ గా అప్పట్లో వార్తలు వచ్చాయి. విజయదశమి సందర్భంగా ఫిలింనగర్‌లోని నిర్మాణ సంస్థ కార్యాలయంలో పూజా కార్యకమాలు కూడా జరిగాయి. దీనికి పవన్ కల్యాణ్, ఎ.ఎం.రత్నం, శరత్ మరార్, జ్యోతికృష్ణ, ఆర్.టి.నేసన్, ఎ.ఎం.రత్నం సోదరుడు దయాకర్ తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి.
అయితే ఎందుకనో పవన్ - నేసన్ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. కారణాలు తెలియదు కానీ పవర్ స్టార్ ఈ రీమేక్ ను పక్కన పెట్టేసారు. ఇన్నేళ్లకు ఇప్పుడు ఆయన సోదరుడు చిరంజీవి 'వేదాలం' రీమేక్ గా 'భోళా శంకర్' సినిమాతో వస్తున్నారు. దీనికి వారి కజిన్ మెహర్ రమేష్ దర్శకుడు. మెగాస్టార్ ఇమేజ్ ను, తెలుగు నేటివిటీకి దృష్టిలో పెట్టుకొని కథలో మార్పులు చేర్పులు చేసారు. 70 శాతం స్క్రిప్టును చేంజ్ చేసినట్లు డైరెక్టర్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రెఫెరెన్స్ లు కూడా పెట్టారు. ఎన్ని చేసినా, అప్పుడు తమ్ముడు పక్కన పెట్టేసిన రీమేక్ తో ఇప్పుడు అన్నయ్య ఎలాంటి హిట్టు కొడతాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు.
Also Read: రీల్ హీరో to రియల్ హీరో: మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
'భోళా శంకర్' చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా.. అక్కినేని హీరో సుశాంత్, మహానటి కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషించారు. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చారు. డూడ్లీ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేసారు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే, 'వేదాళం' రీమేక్ ను వదిలేసిన తర్వాత 2014లో అజిత్ కుమార్ హీరోగా నటించిన 'వీరమ్' మూవీని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. శరత్ మరార్ నిర్మాణంలో ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. కానీ డైరెక్టర్ ఎస్.జె సూర్య 'స్పైడర్' సినిమాతో బిజీగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ ను కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) చేతిలో పెట్టారు. అదే 2017లో 'కాటమ రాయుడు'గా వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచింది. గత రెండేళ్లలో పవన్ 'వకీల్ సాబ్' 'భీమ్లా నాయక్' 'బ్రో' వంటి మరో మూడు రీమేక్ సినిమాలతో పలకరించారు.. త్వరలో 'తేరి' రీమేక్ తో రాబోతున్నారు.
Also Read: 'డ్రామా జూనియర్స్ 6' షోలో కన్నీళ్లు పెట్టుకున్న బాబు మోహన్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial