Hyper Aadi Speech : వర్మ, గరికపాటి నుంచి అంబటి వరకు ఎవ్వరినీ వదలని 'హైపర్' ఆది - మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే
'హైపర్' ఆది మెగా ఫ్యాన్. 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ వేడుకలో మెగా అభిమానులకు పూనకాలు తెప్పించారు. రామ్ గోపాల్ వర్మ నుంచి గరికపాటి వరకు ఎవ్వరినీ వదల్లేదు.
తెలుగు చలన చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. వారిలో 'హైపర్' ఆది (Hyper Aadi) ఒకరు. మెగా ఫ్యామిలీని, మెగా హీరోలను ఎవరైనా ఏమైనా అంటే... ఇంతకు ముందు వాళ్ళపై 'జబర్దస్త్' స్కిట్స్‌లో సెటైర్స్ వేసే ఆది, ఇప్పుడు ఏకంగా ప్రీ రిలీజ్ వేడుకల్లో పంచ్ డైలాగ్స్ వేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ గోపాల్ వర్మ, గరికపాటి నరసింహా రావు నుంచి అంబటి రాంబాబు వరకు ఎవ్వరినీ వదల్లేదు. అందరిపై సెటైర్స్ వేశారు హైపర్ ఆది. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే స్థాయిలో స్పీచ్ ఇచ్చారు.
''ఎలక్షన్స్ గురించి మాట్లాడిల్సిన వాళ్ళు కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో... 'భోళా శంకర్' దర్శక నిర్మాతలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంత వచ్చాయనేది వాళ్ళు చెబుతారు. మొన్న కలెక్షన్స్ తక్కువ వచ్చాయట! అవును... ఆయన వెనక వేసుకున్న కలెక్షన్స్ తో పోలిస్తే మన కలెక్షన్స్ తక్కువే'' - ఇదీ 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ వేడుకలో తన స్పీచ్ చివరలో 'హైపర్' ఆది వేసిన సెటైర్! - అంబటి రాంబాబును ఉద్దేశించి 'హైపర్' ఆది పైమాటలు చెప్పారని ఏపీలో చిన్న పిల్లాడిని అడిగినా సరే ఈజీగా చెబుతారు. పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమా కలెక్షన్స్ మీద అంబటి రాంబాబు రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అందుకని, ఈ సెటైర్!
''తెలుగులో ఓ దర్శకుడు ఉన్నారు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు. అలాగే, చిరంజీవి గురించి మాట్లాడే స్థాయి కూడా ఎవరికీ లేదు. ఆ దర్శకుడు చిన్న పెగ్ వేస్తే చిరంజీవి గారి గురించి, పెద్ద పెగ్ వేస్తే పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేస్తాడు. నాకు తెలిసి మీ వ్యూహాలు దెబ్బ తింటాయని నా గట్టి నమ్మకం'' - ఇదీ 'హైపర్' ఆది డైలాగే. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి ఆ మాటలు అన్నారని ఈజీగా అర్థం అవుతోంది. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అండగా వర్మ 'వ్యూహం' తీస్తున్నారు. అందుకని, ఈ సెటైర్ అన్నమాట.
''కొన్ని వేల మందికి ప్రవచనాలు చెప్పే ఓ వ్యక్తి... కొన్ని కోట్ల మంది అభిమానించే చిరంజీవి గారి మీద అసహనం ప్రదర్శించారు. ఏ కారణం లేకుండా, చిరంజీవి గారికి ఏ సంబంధం లేకుండా! ఎదురుగా ఉన్నవాళ్లకు ఎలా ఉండాలో నేర్పించే ఆయన సహనం కోల్పోయారు గానీ ఆ రోజు చిరంజీవి గారు సహనం కోల్పోలేదు. వెళ్లి ఆయన పక్కన కూర్చున్నారు. ఆ సభ సజావుగా జరిగేలా చేశారు. అదీ చిరంజీవి'' - ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును ఉద్దేశించి చేసిన డైలాగ్ ఇది.
Also Read : 'బ్రో' శాంపిలే, 'ఉస్తాద్'లో సెటైర్స్ సునామీ - టార్గెట్ వైసీపీ!
'ఠాగూర్'లో 'తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించడం' అని చెప్పినా సరే... నిజ జీవితంలో ఆయన అందరినీ క్షమించాని 'హైపర్' ఆది వ్యాఖ్యానించారు. వర్మ, గరికపాటి, అంబటి రాంబాబులపై మాత్రమే కాదు... చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు అవార్డులు ఇచ్చిన ప్రభుత్వాలు, ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే విమర్శలు చేశారని ఆవేశంగా చెప్పారు. సుమన్, ఉదయ్ కిరణ్ వివాదాల్లో చిరంజీవి పేరు ప్రస్తావిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను కూడా 'హైపర్' ఆది వదిలిపెట్టలేదు.
''చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ 'చిరుత' సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత ఏదైనా సినిమా హిట్ అయితే దర్శకుడి వల్ల అని, ఫ్లాప్ అయితే చరణ్ వల్ల అని కామెంట్ చేశారు. అప్పుడు 'రంగస్థలం' వచ్చింది. నోరెత్తిన ప్రతి ఒక్కరూ చెయ్యి ఎత్తి జై కొట్టారు. కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరూ కామ్ గా ఉండిపోయారు. సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ కాలేదు. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ కాలేదు. కానీ, చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు'' అంటూ అభిమానులకు పూనకాలు తెప్పించే స్థాయిలో 'హైపర్' ఆది స్పీచ్ ఇచ్చారు.
Also Read : ఆగ్రహంతో ఊగిపోతున్న అల్లు అర్జున్ అభిమానులు - మైత్రికి మాస్ వార్నింగ్!
గమనిక : సోషల్ మీడియాలో నెటిజనులు చేసిన పోస్టులకు ఏబీపీ దేశం ఎటువంటి బాధ్యత వహించదు. కొంత మంది చేసిన ట్వీట్స్ ఇక్కడ మీకు అందిస్తున్నాం.