Bandla Ganesh: పవన్, మహేష్ సినిమాలతో 100 కోట్ల నష్టం... రమేష్‌దే తప్పు - బండ్ల గణేష్ వైరల్ ట్వీట్
Singanamala Ramesh Babu on Pawan Kalyan: ప్రజారాజ్యం పనుల్లో పవన్ బిజీ కావడంతో 'కొమరం పులి' తీయడానికి మూడేళ్ల పట్టిందని, దాంతో పాటు 'ఖలేజా'తో తనకు వంద కోట్ల నష్టం వాటిల్లిందని శింగనమల రమేష్ చెప్పారు.

'కొమరం పులి', 'ఖలేజా' సినిమాలతో తనకు వంద కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాత శింగనమల రమేష్ బాబు తెలిపారు. అంతే కాదు... పవన్ కళ్యాణ్ తమ సినిమాకు సరిగ్గా డేట్స్ కేటాయించక పోవడం వల్ల సకాలంలో సినిమా పూర్తి కాలేదని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. దాంతో శింగనమల రమేష్ బాబు (Singanamala Ramesh Babu)కు నిర్మాత బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు రమేష్ ఏమన్నారు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఆయనకు గణేష్ ఏం కౌంటర్ ఇచ్చారు? అనేది చూస్తే...
నిర్దోషిగా 14 ఏళ్ళ న్యాయ పోరాటం తర్వాత!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా 'కొమరం పులి', సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'ఖలేజా' సినిమాలను నిర్మాత శింగనమల రమేష్ బాబు ప్రొడ్యూస్ చేశారు. ఆయన మీద ఒకరు కేసు వేశారు. వాళ్ళు చిత్రసీమకు చెందిన వ్యక్తులు కాదు. ఆ కేసులో 75 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. సుమారు 14 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత ఆ కేసు నుంచి నిర్దోషిగా శింగనమల రమేష్ బయట పడ్డారు. ఆ సందర్భంగా నిర్మాత ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు 'కొమరం పులి', 'ఖలేజా' నష్టాల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే
తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా తనను పలకరించలేదని, 'ఎలా ఉన్నావ్ రమేష్?' అని అడగలేదని శింగనమల రమేష్ బాబు వ్యాఖ్యానించారు. 'కొమరం పులి', 'ఖలేజా' గురించి మాట్లాడుతూ... ''ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి మూడేళ్ల సమయం పడుతోంది. అప్పట్లో ఆరు నెలలు లేదా ఏడాదిలో సినిమా పూర్తి అయ్యేది. కానీ, నా దురదృష్టం కొద్దీ 'కొమరం పులి', 'ఖలేజా' - ఒక్కో సినిమా షూట్ కంప్లీట్ కావడానికి మూడేళ్లు పట్టింది. 'ప్రజారాజ్యం' పార్టీ స్థాపించినప్పుడు మేం 'కొమరం పులి' చేశాం. పవన్ కళ్యాణ్ ఆ పార్టీ పనులు ఉండటం, ఇంకా వేర్వేరు కారణాల వల్ల సినిమా లేట్ అయ్యింది. 'ఖలేజా' లేట్ కావడానికీ వేర్వేరు కారణాలు ఉన్నాయి'' అని చెప్పారు. ఆ రెండు సినిమాల్లో తనకు వంద కోట్ల వరకు లాస్ వచ్చిందని పేర్కొన్నారు. పవన్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలను నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా ఖండించారు.
రమేష్ ప్లానింగ్ సరిగా లేదు... రాద్ధాంతం చేసుకోకండి!
''శింగనమల రమేష్ బాబు గారూ... మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు. మీ కోసం పవన్ కల్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు మరో సినిమా ఏదీ చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి. ఇది కరెక్ట్ కాదు'' అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.
సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం @PawanKalyan గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు ప్రత్యక్ష సాక్షి నేను దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు . https://t.co/LVGihOWIhI
— BANDLA GANESH. (@ganeshbandla) February 5, 2025





















