Pushpalatha Passed Away: వందకు పైగా సినిమాల్లో నటించిన పుష్పలత ఇకలేరు... యాక్టింగ్ మానేశాక ఏం చేశారు? కూతురూ హీరోయినే అని తెల్సా?
Pushpalatha : సీనియర్ నటి పుష్పలత తాజాగా వృద్ధాప్య సమస్యల కారణంగా స్వర్గస్తులయ్యారు. ఆమె చివరి సినిమా ఏంటి? సినిమాలు మానేశాక ఏం చేశారు ? వంటి విషయాలను చూద్దాం.

ప్రముఖ అలనాటి నటి పుష్పలత తాజాగా చెన్నైలో కన్నుమూసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. చాలాకాలంగా చెన్నైలోని టీ నగర్ లో ఉన్న తిరుమల పిళ్ళై రోడ్డులో ఆమె నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె వృద్ధాప్య సమస్యల కారణంగా స్వర్గస్తులైనట్టు సమాచారం. శ్వాస విషయంలో సమస్యలు తలెత్తగా, ఆ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే పుష్పలత తుది శ్వాస వెల్లడించారు ఫ్యామిలీ మెంబర్స్.
ఇండస్ట్రీలో పుష్పలత కెరియర్
9 ఏళ్లకే భరతనాట్యం నేర్చుకున్న పుష్పలత 1958లోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరియర్ మొదటి నుంచి ఇప్పటిదాకా పుష్పలత తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తం 100కు పైగా సినిమాల్లో నటించారు. 1958లో రిలీజ్ అయిన 'సెంగోట్టై సింగం' అనే సినిమాతో ఆమె వెండితెరపై అడుగు పెట్టారు. కానీ హీరోయిన్ గా మాత్రం 1961లో వచ్చిన 'కొంగునాట్టు తంగం' అనే సినిమాతో మారింది.
నటుడితో ప్రేమ, పెళ్లి
'నానుమ్ ఒరు పెణ్' అనే సినిమాలో ఏవీఎన్ రాజన్ కు జోడిగా నటించిన పుష్పలత ఆ తర్వాత ఆయననే ప్రేమించి పెళ్లాడారు. ఈ జంటకి ఇద్దరు ఆడ పిల్లలు. పుష్పలత కూతురు మహాలక్ష్మి కూడా హీరోయినే. ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో రెండు జెళ్ళ సీత, మాయదారి మరిది, ఆనంద భైరవి వంటి సినిమాల్లో ఆమె హీరోయిన్ గా కనిపించింది.
పుష్పలత తెలుగు సినిమాలు...
తెలుగులో పుష్పలత ఇప్పటిదాకా అన్నదమ్ముల అనుబంధం, పెద్ద కొడుకు, మేము మనుషులమే, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, కొండవీటి సింహం, యుగపురుషుడు వంటి సినిమాల్లో నటించారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ సరసన 'రాము' అనే సినిమాలో పుష్పలత నటించారు. ఈ మూవీని ఏవీఎం సంస్థ నిర్మించింది. ఇక తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఆమె నటిగా సత్తా చాటింది. 1963 లో 'మైన్ బీ లక్కీ హూ' అనే మూవీతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'నర్స్' అనే మలయాళ సినిమాలోను నటించిన పుష్పలత సకల కళావల్లభన్ వంటి మలయాళ సినిమాల్లో కీలక పాత్రలు సైతం పోషించింది. అలా అన్నీ భాషల్లోనూ నటిగా మంచి పేరు సంపాదించుకుంది పుష్పలత. ఇప్పటిదాకా చేసిన సినిమాల ద్వారా ఆమె సినీ ప్రియుల మదిలో చెరగని ముద్ర వేసింది.
పుష్పలత చివరి సినిమా ఇదే
1970ల నుండి పుష్పలత సినిమాల్లో నటించడం తగ్గించి, ఆ తరువాత పూర్తిగా నటించడం మానేసింది. ఆమె చివరిసారిగా 1999లో శ్రీ భారతి దర్శకత్వంలో మురళి, నళిని నటించిన "పూవాసం" అనే చిత్రంలో నటించారు. అనంతరం ఆమె వయసు మీద పడడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తరువాత ఆధ్యాత్మికత కార్యకలాపాల్లో నిమగ్నమైన ఆమె, పలువురిని సాయం చేస్తూ జీవించింది. తాజాగా పుష్పలత స్వర్గస్తులయ్యారు అన్న విషయం తెలిసిన సినీ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.





















