Balakrishna: నా పేరు బాలకృష్ణ... మా ఇంటిపేరు నందమూరి... హిందీలో ఇంటర్వ్యూ... ఎంత వినయంగా, వివరంగా చెప్పారో!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్కరించారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాకు బాలకృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశారా?

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకు తగ్గ తనయుడిగా, తెలుగు తెరపై తిరుగులేని కథానాయకుడిగా, హిందూపూర్ శాసనసభ్యుడిగా చెరగని ముద్ర వేశారు. అటువంటి వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుంటూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
నా పేరు బాలకృష్ణ...
నేను ఎన్టీఆర్ కుమారుడిని...
మా ఇంటి పేరు నందమూరి!
బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించిన సంగతి తెలుగు ప్రజలతో పాటు భారతీయులు అందరికీ తెలిసిన విషయమే. ఆ అవార్డును ఇటీవల అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా ఆ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ మీడియా ఆయనను ఇంటర్వ్యూ చేసింది. అందులో తనను తాను పరిచయం చేసుకున్నారు బాలకృష్ణ.
తెలుగు నాట స్టార్ హీరో అయినప్పటికీ... శాసన సభ్యుడిగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నప్పటికీ... ఉత్తరాది ప్రజలకు తాను అంతగా పరిచయం లేదు గనుక... ''నా పేరు బాలకృష్ణ, మా ఇంటి పేరు నందమూరి, నేను ఎన్టీఆర్ కుమారుడిని!'' అంటూ తన గురించి చాలా వినయంగా వివరంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
'భగవంత్ కేసరి', 'డాకూ మహారాజ్'తో పాటు త్వరలో తాను చేయబోతున్న సినిమాల గురించి బాలకృష్ణ వివరించారు. హిందూపూర్ శాసనసభ నుంచి మూడు పర్యాయాలు సాధించిన విజయాలతో పాటు అక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు. తెలుగు చిత్ర సీమలో తనది 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం అని చెప్పిన బాలకృష్ణ... త్వరలో హిందీ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తన మనసులో కోరికను వెల్లడించారు.
Also Read: శేష్ మామూలోడు కాదు... స్టేజి మీద 'హిట్ 3' హీరోయిన్ శ్రీనిధికి షాక్ ఇచ్చాడు... వైరల్ వీడియో చూడండి
తన అభిమాన సంఘాలు చాలా ఉన్నాయని, రిజిస్టర్డ్ ఫ్యాన్స్ తనకు ఉన్నట్టు మరొకరికి లేరని, ఆ అభిమానుల ఫోన్ నంబర్స్ తన దగ్గర ఉన్నాయని, వాళ్ళతో అప్పుడప్పుడూ మాట్లాడతానని బాలకృష్ణ తెలిపారు. బాలకృష్ణ వినయం అభిమానులను మరొకసారి ఆకట్టుకుంది. గొప్ప స్థాయికి చేరిన తరువాత కూడా తన గురించి తాను చెప్పుకోవడం మామూలు విషయం కాదంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ' సినిమా ఉత్తరాది జనాలను సైతం ఆకట్టుకుంది అయితే అప్పట్లో ఆ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడం కుదరలేదు . థియేటర్లలో కంటే ఓటీటీలో పెద్ద విజయం సాధించింది. దాంతో ఇప్పుడు 'అఖండ 2' చిత్రాన్ని హిందీలో సైతం భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిలో మైథాలజీ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువ ఉంది. అందులోనూ సౌత్ నుంచి వచ్చిన భక్తి చిత్రాలు భారీ విజయాలు సాధించడంతో 'అఖండ 2' నార్త్ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకోవడం ఖాయం అనే మాట వినబడుతోంది.





















