‘బేబీ’ సక్సెస్‌పై విజయ్ ఆనందం - రిలీజ్‌కు ముందే స్ట్రీమ్ రైట్స్ కొనేసిన ఆ ఓటీటీ
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం 'బేబీ'. డైరెక్టర్ మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువనిర్మాత SKN నిర్మించిన ఈ చిత్రం జూలై 14న(ఈరోజు) థియేటర్స్ లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.'కలర్ ఫోటో' వంటి నేషనల్ అవార్డు ని అందుకున్న సినిమాకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిజానికి విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. ఇప్పుడు పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు. తమ్ముడు ఆనంద్‌కు, వైష్ణవికి టైట్ హగ్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
నిజ జీవితంలో స్కూల్ కాలేజ్ డేస్ లో జరిగే లవ్ స్టోరీని సినిమాలో రియాలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశారు. విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. లేటెస్ట్ ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు 'బేబీ' సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' రూ.8 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మూవీ రిలీజ్‌కు ముందే ఈ డీల్ జరిగినట్లు తెలిసింది. ఓ చిన్న సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. అంతేకాదు కేవలం డిజిటల్ రైట్స్ తోనే ఈ మూవీకి భారీగా లాభాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దాని ప్రకారం ఈ సినిమా రిలీజ్ కి ముందే లాభాలు అందుకోవడంతో మేకర్స్ మూవీ సక్సెస్ పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక సెప్టెంబర్ నెలలో ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బేబీ మూవీ కథ విషయానికొస్తే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ఓ బస్తీ యువకుడు. అతని ఎదురింట్లో ఉండే అమ్మాయి వైష్ణవి(వైష్ణవి చైతన్య) ఆనంద్ ని ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైష్ణవిని ఇష్టపడతాడు. అలా స్కూల్ డేస్ లో వీళ్ళ లవ్ స్టార్ట్ అవుతుంది. అయితే పదవ తరగతి ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవరు అవుతాడు. వైష్ణవి మాత్రం ఇంటర్ పూర్తి చేసి బీటెక్లో జాయిన్ అవుతుంది. అక్కడ వైష్ణవికి ఓ ధనవంతుడి కొడుకు విరాజ్ (విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. మొదట్లో ఫ్రెండ్స్ గా దగ్గరవుతారు. ఆ తర్వాత పబ్ లో రొమాన్స్ చేస్తారు.
అంతేకాదు ఓ రీజన్ వల్ల ఇద్దరు 31 రోజులు డేటింగ్ కూడా చేస్తారు.మరి ఈ విషయం ఆనంద్ కి తెలిసిందా? తెలిసిన తర్వాత ఆనంద్ ఎలా రియాక్ట్ అయ్యాడు? అసలు ఇద్దరిలో వైష్ణవి ఎవరిని ప్రేమించింది? ఒక బస్తీలో పుట్టి పెరిగిన వైష్ణవికి పబ్ కల్చర్ ఎలా అలవాటయింది? వైష్ణవి చేసిన ఓ తప్పు ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసింది? వీళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కి ఎండ్ కార్డ్ ఎలా పడింది? అనేది తెలియాలంటే 'బేబీ' మూవీ చూడాల్సిందే. ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్ ని దృష్టిలో పెట్టుకొని సాయి రాజేష్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈరోజుల్లో యువతరం ఈజీగా ప్రేమలో పడుతున్నారు. కానీ ఆ ప్రేమని ఒకరికి మాత్రమే పంచడం లేదు. ఒకరికి తెలియకుండా వేరొకరితో రిలేషన్ లో ఉంటూ తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా ఉంటుంది.
Also Read : ప్రేక్షకులకు షాకిచ్చిన శివ కార్తికేయన్ 'మహా వీరుడు' - షోస్ నిలిపివేత!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial