Allu Arjun Pushpa: తగ్గేదే లే అంటున్న లీకు వీరులు.. తగ్గిస్తామంటున్న బన్నీ
పుష్ప సినిమా లీకుల సంగతి తెలిసి అల్లు అర్జున్ షాక్ అయ్యాడు. షూటింగ్ టైంలోనే కాదు, ఎడిటింగ్ రూమ్లోకి కూడా మొబైల్ ఫోన్లు అనుమతించవద్దని టీమ్‌కి ఆదేశించాడట.
అల్లు అర్జున్ హీరోగా... క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమాలో అల్లుఅర్జున్‌కు జోడీగా రష్మిక నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.
మొదటి భాగం క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే లీకుల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ లీకైంది. దీనిపై నిర్మాణ సంస్థ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేసి.. లీకులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది.
పుష్ప సినిమాలో ఈ ఒక్క పాటే కాదు.. ఓ ఫైట్ సీక్వెన్స్‌లోని కొన్ని సెకన్స్, బన్నీ, రష్మికపై సాగే 'వల్లీ.. వల్లీ' అనే పాట కూడా లీకైందని టాక్ నడుస్తోంది. కొన్ని సెకన్ల పాటు లీకైనట్లు పుష్పా టీమ్ సమాచారం. వరుస లీకుల సంగతి తెలిసి బన్నీ షాకయ్యాడట.
లీక్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అల్లు అర్జున్.. చిత్రీకరణ సమయంలోనే కాదు, ఎడిటింగ్ రూమ్లోకి కూడా మొబైల్ ఫోన్లను అనుమతించవద్దని చిత్ర బృందాన్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడటని చెప్పుకుంటున్నారు. లీక్ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దన్నాడట.
దీనిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్ బృందం...‘‘సినిమాకు సంబంధించి పలు సన్నివేశాలు లీక్ అవ్వడం బాధించింది. అభిమానులు కూడా ఆవేదన చెందారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిందితులను కచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని చెప్పారు. అంతేకాదు.. ఇలాంటి పనులు ఎవరు చేసినా ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. అయినా సినిమా ఫస్ట్ లుక్, సాంగ్, టీజర్, ట్రైలర్ ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తేనే కిక్ ఉంటుంది. ముందుగా వస్తే దాని విలువ తెలియదన్నారు మైత్రి మూవీ మేకర్స్.
ఇలా వరుసగా సినిమాలో ఒకదాని తర్వాత ఒకటి లీక్ అవ్వడంపై నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ సమస్య ఎక్కడ తలెత్తింది అని అలోచిస్తే... పుష్ప చిత్ర యూనిట్ వి.ఎఫ్.ఎక్స్ కోసం ఓ నలభై ఐదు నిమిషాల ఫుటేజ్‌ని ఓ సంస్థకు అప్పగించిందట. ఆ వి.ఎఫ్.ఎక్స్ సంస్థ నుంచే మొత్తం పుటేజ్ లీకైందేమోనని అనుమానిస్తున్నారు. ఏదేమైనా తాజా ఘటనపై మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నామన్న నిర్మాతలు....నిందితులను వదిలిపెట్టేదే లే అంటున్నారు.