'ఏజెంట్' ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా - అందుబాటులోకి వచ్చేది అప్పుడే!
అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీ ప్రముఖ ఓటీటీ సోనీ లీవ్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. తాజాగా సోనీ లీవ్ 'ఏజెంట్' ఓటీటీ స్ట్రీమింగ్ ని వాయిదా వేసినట్లు సమాచారం.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఏజెంట్' ఓటీటీ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. నిజానికి మే 19 అంటే ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీ సోనీ లీవ్ లో 'ఏజెంట్' మూవీ స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా 'ఏజెంట్' ఓటీటీ స్ట్రీమింగ్ ని వాయిదా వేశారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన 'ఏజెంట్' మూవీ ఏప్రిల్ 28న థియేటర్స్ లో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుంది. ప్రేక్షకులనే కాదు అభిమానులను సైతం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా.
దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా కోసం అఖిల్ రెండేళ్లు కష్టపడ్డాడు. స్పైగా మారడానికి తన లుక్, ఫిజిక్ ను పూర్తిగా మార్చుకొని కండలు తిరిగిన దేహంతో కనిపించాడు. కానీ ఈ సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టమంతా వృథా అయిపోయింది. సినిమాలో అఖిల్ పర్ఫామెన్స్ పర్వాలేదని అనిపించినా.. కథ, కథనం, మ్యూజిక్ ఏమాత్రం బాలేదు. నిజానికి ఈ సినిమాను డైరెక్ట్ చేసింది సురేందర్ రెడ్డి అయినా, కథను అందించింది మాత్రం ప్రముఖ రచయిత వక్కంతం వంశీ. అందుకే సురేందర్ రెడ్డి ఈ కథను హ్యాండిల్ చేయలేకపోయారనే టాక్ కూడా వినిపించింది. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్ర పోషించారు. సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.
ఇక ఏజెంట్ రిజల్ట్ పై అక్కినేని అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ సరికొత్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిజానికి మొదట్లో ఈ సినిమాను మే 19న సోనీ లీవ్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ ఓటిటి సోనీ లీవ్ 'ఏజెంట్' మూవీ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకోగా.. మే 19 నుంచి ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కి అందుబాటులో రానున్నట్లు పేర్కొన్నారు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో సోనీ లీవ్ ఓటీటీ సంస్థ 'ఏజెంట్' స్ట్రీమింగ్ ని వాయిదా వేసింది. నిజానికి సినిమా థియేటర్ రిలీజ్ కు అలాగే ఓటీటీ రిలీజ్ కు మధ్య సుమారు 20 నుంచి 30 రోజుల గ్యాప్ ఉండాలి. 'ఏజెంట్' థియేటర్ రిలీజ్ కి ఓటీటీ రిలీజ్ కనీసం 20 రోజులు కూడా గ్యాప్ లేకపోవడంతో ఈ మూవీ స్ట్రీమింగ్ ను మరో వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం మే 26 నుంచి 'ఏజెంట్' మూవీ సోనీ లీవ్ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.