Ganja Shankar Movie : మెగా ఫ్యామిలీ 'శంకర్' - చిరు, పవన్, సాయి తేజ్ తర్వాత ఎవరొస్తారో?
సెంటిమెంట్ ప్రకారం జరిగిందో? లేదంటే యాదృశ్చికంగా జరిగిందో? శంకర్ టైటిల్ అంటే మెగా ఫ్యామిలీకి ఇష్టం ఉన్నట్లు ఉంది. ఒకరి తర్వాత ఒకరు ఆ టైటిల్ తో సినిమాలు చేస్తున్నారు.
శంకర్ పేరుకు మెగా ఫ్యామిలీకి అవినాభావ సంబంధం ఉంది. ఆ పేరు అంటే ఆ కుటుంబానికి చాలా చాలా స్పెషల్! మెగా ఫ్యామిలీ మూల పురుషుడు, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. స్క్రీన్ మీదకు చిరంజీవిగా వచ్చారు. ఆ తర్వాత మెగాస్టార్ అయ్యారు. ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో ఓ బాట వేశారు. ఆయన పేరులో శంకర్ ఉండటంతో ఫ్యామిలీ అందరికీ ఆ పేరు మీద మమకారం ఉండటం సహజం. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా ఆ పేరు సినిమా టైటిళ్లలోకి కూడా వస్తోంది.
శంకర్ దాదా... గుడుంబా శంకర్...
ఇప్పుడు మేనల్లుడు గంజా శంకర్!
మెగా ఫ్యామిలీ హీరోల సినిమా టైటిళ్ళలో 'శంకర్' పేరు ఇప్పుడు హైలైట్ కావడం వెనుక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఉన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా 'గాంజా శంకర్' (Ganja Shankar Movie)ను ఈ రోజు అనౌన్స్ చేశారు.
'గంజా శంకర్'గా సాయి ధరమ్ తేజ్ సినిమా చేస్తుండటంతో... ఇంతకు ముందు మెగా ఫ్యామిలీలో 'శంకర్' టైటిల్స్ తెరపైకి వచ్చాయి. శంకర్ అంటే మెగా ఫ్యామిలీ, ప్రేక్షకులకు ముందుకు గుర్తుకు వచ్చేది చిరంజీవి. ఆయన చేసిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా సీక్వెల్ 'శంకర్ దాదా జిందాబాద్' కూడా చేశారు.
చిరంజీవి తర్వాత శంకర్ పేరుతో సినిమా చేసిన మెగా ఫ్యామిలీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఆయన 'గుడుంబా శంకర్' సినిమా చేశారు. ఆ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ బరిలో ఆశించిన విజయం సాధించలేదని కొందరు కామెంట్ చేస్తున్న మాట వాస్తవం. అయితే... అందులో పవన్ నటన, ఆ డ్రస్ డిజైన్స్, క్యారెక్టర్ ఇప్పటికీ ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు.
Also Read : ఒంటిపై చైతన్య పేరును చెరిపేసిన సమంత... మాజీ భర్త గుర్తులు వద్దని అనుకుంటోందా?
పెద్ద మావయ్య శంకర్ దాదా, చిన్న మావయ్య గుడుంబా శంకర్ అయితే... మెగా మేనల్లుడు 'గాంజా శంకర్' అన్నమాట! శంకర్ దాదా, గుడుంబా శంకర్ క్యారెక్టర్లు హైదరాబాద్ నేపథ్యంలో ఉంటాయి. 'గాంజా శంకర్' సినిమా నేపథ్యం కూడా హైదరాబాద్. చిరు, పవన్ క్యారెక్టర్లకు... ఇప్పుడీ 'గాంజా శంకర్'కు దర్శకుడు సంపత్ నంది ఏమైనా కనెక్షన్ పెడతారో? లేదో? చూడాలి. అన్నట్లు... ఆయన మెగా అభిమాని. సంపత్ నంది దర్శకత్వం వహించిన గత సినిమాలు చూస్తే... వాటిలో మెగా ప్రస్తావన ఉంటుంది.
Also Read : బాలీవుడ్ హీరోతో రష్మిక లిప్ లాక్ - నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో
'గాంజా శంకర్' సినిమా విషయానికి వస్తే... ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ ఇంత మాస్ క్యారెక్టర్ చేయలేదని సంపత్ నంది సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరో తెలంగాణ యాస మాట్లాడతారని తెలిసింది. లుక్ నుంచి డ్రసింగ్ వరకు... క్యారెక్టర్ యాటిట్యూడ్ నుంచి డైలాగ్స్ వరకు సంపత్ నంది స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. తెరపై కొత్త సాయి ధరమ్ తేజ్ కనిపించడం ఖాయం.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial